EPAPER

Vizianagaram : రైలు ప్రమాదంపై అనుమానాలెన్నో.. ఆటోసిగ్నలింగ్ లోపాలే కారణమా ?

Vizianagaram : రైలు ప్రమాదంపై అనుమానాలెన్నో.. ఆటోసిగ్నలింగ్ లోపాలే కారణమా ?

Vizianagaram : విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదానికి కారణం సిగ్నలింగ్‌ వ్యవస్థలో సాంకేతిక లోపమా, మానవ తప్పిదమా అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఒకదాని వెనుక మరొకటి ప్రయాణించే సమయంలో ముందు వెళ్లే రైలు పట్టాలు తప్పినా, ఆగిపోయినా వెనుక వచ్చే రైలు ఆగిపోయేలా సిగ్నలింగ్‌ వ్యవస్థ పని చేయాలి. రైలు వేగం గంటకు 10, 15 కిలోమీటర్లకు పరిమితం కావాలి. విశాఖపట్నం నుంచి పలాస వెళ్లే ప్యాసింజర్‌ నెమ్మదిగా వెళ్లినా వెనుక వచ్చిన రాయగడ ప్యాసింజర్‌ అధిక వేగంతో వచ్చి ఢీకొట్టడంతోనే పెనుప్రమాదం జరిగింది.


విజయనగరం జిల్లాలో ప్రమాదం జరిగిన కంటకాపల్లి- అలమండ మార్గంలో ఆటోమేటిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ ఉంది. దీంతో ఒకే ట్రాక్‌లో రెండు రైళ్లు ఒకదాని వెనుక మరోటి ప్రయాణం చేయవచ్చు. అయితే మధ్యలో ఉండే సిగ్నళ్లు సక్రమంగా పనిచేసి, లోకోపైలట్లు వాటిని గమనిస్తూ రైళ్లను నడిపితేనే సురక్షిత ప్రయాణం సాధ్యమవుతుంది.

పలాస ప్యాసింజర్‌ కంటకాపల్లి దాటిన తర్వాత సాంకేతిక లోపంతో మిడిల్‌ లైన్‌లో ఆగిపోయింది. అప్పటికే గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో రాయగడ ప్యాసింజర్‌ కంటకాపల్లి స్టేషన్‌ దాటి వచ్చేసి, ఆగి ఉన్న పలాస ప్యాసింజర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ముందు వెళుతున్న రైలు ఆగిపోతే మధ్యలో సిగ్నళ్లు రెడ్‌ లైట్‌లోకి మారిపోవాలి. అలాంటప్పుడు వెనుక వచ్చే రైలు లోకోపైలట్‌ బండిని ఆపాలి. సిగ్నళ్లలో గందరగోళం ఉంటే రైలు వేగాన్ని గంటకు 10- 15 కిలో మీటర్లకు పరిమితం చేయాలి. కానీ, ప్రమాద సమయంలో రాయగడ ప్యాసింజర్‌ వేగం గంటకు 60 కిలో మీటర్లుగా డేటాలాగర్‌లో నమోదైంది. రాయగడ లోకో పైలట్‌ ముందు పలాస ప్యాసింజర్‌ ఉన్న విషయాన్ని కేవలం 70 మీటర్ల దూరంలో గుర్తించారని, ఆ తర్వాత బండిని ఆపేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు.


అన్నిచోట్లా రైలు మార్గాల్లో ఎక్కువగా అబ్సల్యూట్‌ బ్లాక్‌ సిస్టమ్‌ ఉంటుంది. అంటే ఒక స్టేషన్‌ చివర్లో ఉండే లాస్ట్‌ స్టాప్‌ సిగ్నల్‌లో బయలుదేరిన రైలు తర్వాత స్టేషన్‌ మొదట్లో ఉండే హోమ్‌ సిగ్నల్‌ దాటి స్టేషన్‌ వద్దకు చేరుకున్నాకే.. వెనుక స్టేషన్‌లో మరో రైలుకు గ్రీన్‌ సిగ్నల్‌ లభిస్తుంది. రాష్ట్రంలోని రైలు మార్గాల్లో అత్యధిక చోట్ల ఇప్పటికీ ఇదే విధానం ఉంది. ఇందులో భాగంగా ఇంటర్మీడియట్‌ బ్లాక్‌ విధానం కూడా అమలవుతోంది. దీనిలో రెండు స్టేషన్ల మధ్య ఒక చోట సిగ్నల్‌ పోస్ట్‌ ఉంటుంది. ఓ స్టేషన్‌లో బయలుదేరిన బండి.. మధ్యలో ఉన్న సిగ్నల్‌ పోస్ట్‌ దాటిన తర్వాత వెనుక స్టేషన్‌ నుంచి మరొక రైలు కదిలేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తారు. కొంతకాలంగా పలు మార్గాల్లో ఆటోమేటిక్‌ బ్లాక్‌ సిస్టమ్‌ అమలు చేస్తున్నారు. ఇందులో రెండు స్టేషన్ల మధ్య సగటున కిలోమీటరు నుంచి కిలోమీటర్నర దూరానికి ఒకటి చొప్పున ఆటోమేటిక్‌ సిగ్నల్‌ పోస్ట్‌ ఉంటుంది. ఓ సిగ్నల్‌ పోస్ట్‌ దాటి రైలు వెళ్లాక, వెనుక సిగ్నల్‌ పోస్ట్‌ వద్ద మరో రైలుకు గ్రీన్‌ సిగ్నల్‌ లభిస్తుంది. ప్రమాదం జరిగిన కొత్తవలస- విజయనగరం మార్గంలో ఈ విధానమే ఉంది.

ఎల్లో లైట్‌తో సిగ్నల్‌ ఉంటే.. అప్రమత్తంగా ఉండాలని, తర్వాత సిగ్నల్‌లో రెడ్‌, గ్రీన్‌ సిగ్నల్స్‌లో ఏదైనా ఉండొచ్చు జాగ్రత్త అని హెచ్చరికగా పరిగణిస్తారు. ఇలాంటప్పుడు రైలు గంటకు 10 నుంచి 15 కిలోమీటర్ లోపు వేగంతోనే వెళ్లాలి. రెండు పసుపు లైట్లతో సిగ్నల్‌ ఉంటే.. తర్వాత పోస్టులో రెడ్‌ సిగ్నల్‌ ఉంటుందని హెచ్చరిక. అప్పుడు రైలు వేగాన్ని పూర్తిగా నియంత్రించాలి. తాజా ప్రమాదంలో పలాస ప్యాసింజర్‌ ఒక్క పసుపు లైట్‌ సిగ్నల్‌ చూసి నెమ్మదిగా వెళ్లి, తర్వాత సిగ్నల్‌కు దగ్గరలో నిలిచిపోయింది. అదే సమయంలో వెనుక రాయగడ ప్యాసింజర్‌ ఎందుకు వేగంగా వచ్చింది? సిగ్నలింగ్‌లో సాంకేతిక లోపంతో గ్రీన్‌ చూపించిందా? లేక డబుల్‌ ఎల్లో సిగ్నల్‌ను లోకో పైలెట్‌ గమనించలేదా? అందుకే వేగ నియంత్రణ పాటించలేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ప్రమాదం జరిగిన కంటకాపల్లి- అలమండ స్టేషన్ల పరిధిలో మూడు లైన్లు ఉన్నాయి. వాటిలో ఎక్కడా క్రాసింగ్స్‌ కూడా లేవు. ఈ మధ్యలో రెండు ఆటోమేటిక్‌ సిగ్నల్‌ పోస్టుల్లో ఆదివారం ఉదయం నుంచి బ్లాంక్స్‌ వస్తున్నట్లు గుర్తించారు. దీంతో కంటకాపల్లి స్టేషన్‌ మాస్టర్‌ వీహెచ్‌ఎఫ్‌ సెట్‌ ద్వారా అటుగా వెళ్లే రైళ్లను అప్రమత్తం చేస్తున్నారు. పలాస ప్యాసింజర్‌ లోకో పైలెట్‌, గార్డ్‌నూ అలాగే అప్రమత్తం చేయడం వల్లే రైలు నెమ్మదిగా వెళ్లిందని తెలిసింది. మరి వెనుక రాయగడ ప్యాసింజర్‌ వేగంగా ఎలా వెళ్లిందనేది అంతు చిక్కడం లేదు.

Related News

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు విప్పు జగన్.. ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Big Stories

×