Deepam Scheme : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తామని ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించారు. సూపర్ సిక్స్ లో ఒకటైన ఉచిన గ్యాస్ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. చిన్నప్పుడు తన తల్లి కట్టేల పొయ్యిపై వంట చేయడం చూశానని చెప్పిన చంద్రబాబు.. ఒకేసారి ఇంటికి 10, 20 మంది వస్తే కట్టెల పొయ్యిపై వంట చేయడం ఎంత బాధో తనకు తెలుసన్నారు. తన తల్లే కాదు.. రాష్ట్రంలోని ఏ ఆడబిడ్డ అలా కష్టపడకూడదనే తాను ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని తీసుకువచ్చినట్లు చెప్పారు.
నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తనకు.. తన జీవితంలో ఎప్పుడూ చూడని విధ్వంస రాష్ట్రాన్ని చూశానని అన్నారు. ఏ శాఖలో రివ్యూ చేసినా.. ఎక్కడికి వెళుతుందో అర్ధం కాని పరిస్థితిలు ఉన్నాయని అన్నారు. తన రాజకీయ జీవితంలో అంత దారుణమైన పరిస్థితులు చూడలేదని అన్నారు. కేంద్ర పంపిన డబ్బులను జగన్ సర్కార్ దారి మళ్లించిందని ఆరోపించారు. ఒక్క సివిల్ సప్లై శాఖలోనే 41 వేల కోట్లను దారిమళ్లించినట్లు వెల్లడించారు.
గ్యాస్ సిలిండర్ పరిచయం చేసింది నేనే..
దేశంలో తొలిసారి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తొలిసారి ప్రజలకు గ్యాస్ సిలిండర్లను పరిచయం చేశానని గుర్తు చేసిన సీఎం చంద్రబాబు.. ధరలు పెరుగుతుండడంతో గ్యాస్ వినియోగం తగ్గిందని అన్నారు. ఆ కారణంగానే.. ఇప్పుడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నామని ప్రకటించారు. అప్పట్లోనే 59 లక్షల గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందించామని.. ఆ కారణంగానే ఇప్పుడు రాష్ట్రంలో 1.59 కోట్ల గ్యాస్ సిలిండర్లు వచ్చాయని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు కడుతుంది..
ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించేందుకు కేంద్ర వైపు నుంచి కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయని.. త్వరలోనే వాటిని పరిష్కరిస్తామన్నారు సీఎం చంద్రబాబు. ప్రస్తుతాని.. గ్యాస్ బుక్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వమే డీబీటీ పద్దతిలో కేంద్రానికి డబ్బులు కడతామని, డబ్బులు కట్టి గ్యాస్ తీసుకున్న ప్రజలకు.. 48 గంటల్లో తిరిగి బ్యాంకు ఖాతాల్లో పడతాయని చెప్పారు.
25 ఏళ్లు తాగే మందు డబ్బులపై ముందే అప్పులు తెచ్చారు..
రాష్ట్రంలో మద్యం అమ్మకాల్లో జగన్ ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిదన్న చంద్రబాబు.. వారి ఆరోగ్యాలను తాకట్టు పెట్టి డబ్బులు తీసుకు వచ్చారని విమర్శించారు. మందుబాబులు తాగితే వచ్చే డబ్బుల్ని చూపించి వాటిపై భారీగా అప్పుగా తెచ్చారని చెప్పారు. రాష్ట్రంలో 25 ఏళ్లు మద్యం తాగితే ఎంత డబ్బులు వస్తాయో వాటన్నింటిపై అప్పులున్నాయని వివరించారు.
గత ఐదేళ్లల్లో రాష్ట్రంలో ఇసుక దోపిడి పెద్ద ఎత్తున జరిగిందన్న చంద్రబాబు.. వైసీపీ నాయకులు భారీగా సంపాదించుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని ఇసుక.. ప్రజల ఆస్తి అన్న చంద్రబాబు.. అవసరమైన వాళ్లు ఉచితంగా ఇసుకను తీసుకువెళ్లవచ్చని చెప్పారు. ఉచిత ఇసుక పంపిణీ విషయంలో ఏ నాయకుడు జోక్యం చేసుకోవద్దని కూటమి పార్టీ నాయకులు సూచించినట్లు తెలిపారు.