Narayana on Jagan : జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ సరిగా జరగడం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఆ కారణంగానే జగన్, షర్మిళ మధ్య ఆస్తుల పోట్లాట జరుగుతోందని అన్నారు. కేంద్రం సరిగా వ్యవహరిస్తే.. జగన్ ఎప్పుడో జైలుకు వెళ్లేవాడంటూ వ్యాఖ్యానించారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రంలో ఇటీవల చోటుచేసుకుంటున్న అనేక పరిణామాలపై సీపీఐ నారాయణ.. తనదైన శైలిలో విమర్శలు సంధించారు.
జగన్ కేసులు విచారణ ఓ మాయ..
అవినీతి, అక్రమార్జన కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్.. 11 ఏళ్ల నుంచి బెయిల్ పై ఉన్నారని అన్నారు. మరెవరికి ఇది సాధ్యం కాదన్న నారాయణ.. మాయల ఫకీర్ ప్రాణం పక్షిలో ఉన్నట్లు… జగన్ కేసుల వ్యవహారం బీజేపీ పెద్దల చేతిలో ఉందని విమర్శించారు. జగన్ అక్రమాస్తుల కేసు 11 ఏళ్లుగా తేలడం లేదు కాబట్టే.. ఇప్పుడు ఆస్తుల పంచాయితీ తెరమీదకు వచ్చిందని అన్నారు. జగన్ ఆస్తుల వ్యవహారం కేంద్రం చేతుల్లో ఉందిని.. కేంద్ర ప్రభుత్వం ఈ కేసును సీరియస్ గా తీసుకోవాలి డిమాండ్ చేశారు. అప్పుడే.. అన్నా చెల్లెళ్ల పంచాయితీ కూడా తేలిపోతుందని అన్నారు.
పోలవరం ఎత్తు తగ్గితే.. ప్రయోజనం ఉండదు.
పోలవలం ఎత్తు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై చంద్రబాబు ఎందుకు స్పందించలేదంటూ.. వైఎస్ జగన్ విమర్శించిన నేపథ్యంలో నారాయణ సైతం ఈ విషయంపై తన అభిప్రాయాల్ని వెల్లడించారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ను 45 మీటర్ల నుంచి 41 మీటర్లకు మారుస్తుంటే మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినేలా తీసుకునే చర్యల్ని వ్యతిరేకించాలన్న నారాయణ.. పోలవరం ఎత్తు 45 మీటర్లకు తగ్గితే రిజర్వాయర్ గా కాకుండా బ్యారేజిగా పనికొస్తుందని వ్యాఖ్యానించారు. ఎత్తు తగ్గింపు నిర్ణయంతో ఉత్తరాంధ్రకు నీళ్లు రావన్న సీపీఐ జాతీయ కార్యదర్శి.. పోలవరం ఎత్తు తగ్గింపు ఆత్మహత్యా సదృశ్యమేనన్నారు. ఎత్తు తగ్గించి కట్టడానికి ఇంత ప్రజాధనం అవసరం లేదని అన్నారు.
మూసి ప్రక్షాళన అడ్డుకోవడం అవివేకం..
హైదరాబాద్ లో మహానగరంలో ప్రవహించే మూసి నదిని ప్రక్షాళన చేయాలని రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. వ్యతిరేకించే పార్టీలు హైదరాబాద్ కు ద్రోహం చేస్తున్నాయని అన్నారు. ఇప్పటికే తీవ్ర కాలుష్యమయంగా మారిపోయిన మూసిని ఆధునీకరించడాన్ని వ్యతిరేకిస్తూ.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తీవ్రంగా పోరాడుతున్నాయన్న నారాయణ.. రాజకీయాల కోసం మూసి అంశాన్ని వాడుకోవద్దని సూచించారు.
గవర్నర్లను తప్పుగా వాడుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కారంపై దృష్టి పెట్టకుండా రాజకీయం చేస్తోందని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అన్ని సక్రమంగా ఉన్నాయా.? అన్న నారాయణ.. మరెందుకు తమిళనాడు, కేరళ, దిల్లీ ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రాలను గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లను వినియోగించుకుని ఇబ్బందులు పెడుతున్నారని, సమాఖ్య వ్యవస్థను దెబ్బ తీసేలా మోడీ వ్యవహరిస్తున్నారని అన్నారు. దేశంలో ఒక దేశం – ఒకే ఎన్నిక విధానం మంచిది కాదని అభిప్రాయ పడ్డారు. అధికారం కోసం దేశం వినాశనమైనా ఫర్వాలేదనేలా బీజేపీ వ్యవహరిస్తోందని విమర్శించారు.
సీపీఐ క్షేత్ర స్థాయిలో ఎదురీదుతోంది.
దేశంలో ప్రాంతీయ పార్టీలు బలేపడేకొద్దీ జాతీయ పార్టీలు నష్టపోతున్నాయన్న.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ..
సీపీఐ ప్రజా క్షేత్రంలో ఎదురీదుతోందని అన్నారు. సీపీఐ క్షేత్ర స్థాయిలో బలపడటానికి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
జార్ఖండ్ లో 9 సీట్ల లో సొంతగా పోటీ చేస్తున్నామని వెల్లడించిన నారాయణ.. మహారాష్ట్రలో ఇండియా కూటమి పొత్తులో భాగంగా ఒక స్థానంలో పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు.