Ambati Rambabu: మీ నాయకుడిపై అంత ప్రేమ ఉంటే, మీ అభిమానం ఆయన దగ్గర చూపించండి. అంతేకానీ మా మనోభావాలను దెబ్బతీసే హక్కు మీకెక్కడిది? మీరు మొన్నటి వరకు మంత్రిగా ఉన్నారు, ఎన్నో సార్లు తిరుమల పర్యటనకు వచ్చారు. మీకు టీటీడీ నిబంధనలు తెలియవా.. ఇప్పటికైనా మారండి అంటూ వైసీపీకి చెందిన ఆ మాజీ మంత్రికి క్లాస్ తీసుకుంటున్నారు టీడీపీ నేతలు. ఇంతకు ఇలా టీడీపీ నేతలతో క్లాస్ తీసుకున్న ఆ మాజీ మంత్రి ఎవరో తెలుసా.. అంబటి రాంబాబు.
మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. తెలిసి జరిగిందో, తెలియక జరిగిందో ఏమో కానీ ప్రస్తుతం వార్తలు నిలిచారు అంబటి. నిన్న తిరుపతిలో జరిగిన భూమన కరుణాకర్ రెడ్డి పార్టీ పదవి బాధ్యతల కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఈరోజు తిరుమలకు వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్నారు అంబటి రాంబాబు. ఇక్కడే టీటీడీ నిబంధనలను ఉల్లంఘించారని అంబటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
సాధారణంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునే సమయంలో ఏ వ్యక్తుల యొక్క స్టిక్కర్స్ ను ధరించడం, చేతపట్టడం నిషేధం. కానీ అంబటి రాంబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమయంలో తన చొక్కాకు గల జేబుపై మాజీ సీఎం జగన్ బొమ్మను కలిగి ఉన్నారు. అయితే సాధారణంగా విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేయడం మామూలే. కానీ అంబటిని తనిఖీ చేసిన సమయంలో, మెడలో వేసుకున్న కండువా కారణంగా కనిపించలేదేమో కానీ, శ్రీవారి దర్శనానికి మాజీమంత్రి అంబటి రాంబాబును అనుమతించారు. ప్రస్తుతం ఇదే వివాదంగా మారింది.
అంబటి వివాదంపై రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ సీరియస్ అయ్యారు. టీటీడీ నిబంధనలను ఉల్లంఘించి ఏకంగా జేబుకు స్టిక్కర్ అతికించుకొని అంబటి రాంబాబు శ్రీవారిని దర్శించుకోవడం దారుణమన్నారు. మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన అంబటికీ టీటీడీ నిబంధనలు తెలియకపోవడం శోచనీయమన్నారు సీఎం రమేష్. ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి పనులు అంబటి చేస్తారని, ఇలాంటివారు కొండపైకి రాకుండా చేయాలని, తిరుమల పవిత్రతను కోల్పోయేలా వైసీపీ నాయకుల తీరు ఉందంటూ సీఎం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Pawan Kalyan: పవన్ టార్గెట్ మారిందా.. కూటమిలో కుంపటి వాస్తవమేనా.. ఏం జరగనుంది?
అయితే ఈ వివాదంపై టీటీడీ కూడా దృష్టి సారించి, అంబటి దర్శించుకున్న వీడియోలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే పూర్తిగా నిర్ధారించుకున్నాక, అంబటి నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే, కేసదు నమోదు చేయడంతో పాటు, నోటీసులు కూడా ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలా మొత్తం మీద అంబటికి ఈ వివాదం మెడకు చుట్టుకుందనే చెప్పవచ్చు.