Big Stories

Jagan : ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం ప్రారంభం.. టోల్‌ ఫ్రీ నంబర్ 1902..

CM Jagan Latest News(Andhra Pradesh Political News) :‘ జగనన్నకు చెబుదాం’ అనే కొత్త కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని జగన్ తెలిపారు. సమస్యల పరిష్కారానికి ఇది మంచి వేదిక అవుతుందన్నారు. ప్రభుత్వ సేవలను పొందడంలో ఎదురయ్యే అడ్డంకులకు పరిష్కారం దొరుకుతుందన్నారు.
అధికారులంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతారని స్పష్టం చేశారు.

- Advertisement -

లంచాలకు, వివక్షకు తావు లేకుండా పథకాల అమలు చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. స్పందన ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని తెలిపారు. పరిపాలనలో ప్రజలను భాగస్వాములను చేస్తున్నామని చెప్పారు.  
ప్రజలకు పాలన మరింత చేరువయ్యే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం వెతికే దిశగా పాలన సాగుతోందని జగన్ స్పష్టం చేశారు.

- Advertisement -

గత ప్రభుత్వ పాలనలో లంచాలు, వివక్ష ఉండేదని జగన్ విమర్శించారు. టీడీపీ హయాంలో తమ పార్టీకి చెందిన వ్యక్తులకు మాత్రమే సంక్షేమ పథకాలు ఇచ్చే  వారని ఆరోపించారు. కానీ నేడు పార్టీలకు అతీతంగా ప్రజలకు పథకాలు అందుతున్నాయని తెలిపారు. వ్యవస్థలో మార్పు తీసుకొచ్చేందుకు ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.

ఈ కార్యక్రమం కోసం టోల్‌ఫ్రీ నంబర్ 1902ను అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చింది.. ప్రజలు ఆ నంబర్ కు ఫోన్ చేసి తమ సమస్యలను తెలియజేయాలి. ఆ ఫిర్యాదులను ప్రభుత్వం పరిష్కరిస్తుంది. సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ సేవల్లో ఎవరికైనా సమస్యలు ఎదురైతే వాటిని పరిష్కరించాలన్న లక్ష్యంతో ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం చేపడుతున్నామని ప్రభుత్వం ప్రకటించింది. సంక్షేమ పథకాలు, వైఎస్ఆర్ పెన్షన్‌ కానుక , రేషన్‌ కార్డు పొందడంలో ఇబ్బందులు కలిగితే టోల్‌ఫ్రీ నంబర్ 1902కు ఫోన్ చేయవచ్చు. రెవెన్యూ సమస్యలు , ప్రభుత్వ సేవలకు సంబంధించిన సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చు.

టోల్‌ ఫ్రీ నంబర్ 1902కు ఫోన్‌ చేసి కాల్‌ సెంటర్‌లో ప్రతినిధికి సమస్యను చెప్పాలి. వారు ఆ సమస్యను నమోదు చేసుకుంటారు. ఆ తర్వాత యువర్‌ సర్వీసు రిక్వెస్టు ఐడీ ..వైఎస్ఆర్ ఐడీ ఇస్తారు. ఆ తర్వాత ఆ సమస్య పరిష్కారంపై ఫిర్యాదుదారుడికి ఎప్పటికప్పుడు మెసేజ్ ల రూపంలో సమాచారం పంపుతారు. సమస్య పరిష్కారమైన తర్వాత ఫిర్యాదుదారుడు అభిప్రాయం తెలియజేయాలి. సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ప్రాజెక్టు మానిటరింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తున్నారు. సీఎం కార్యాలయం నుంచే ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు.

‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల పరిషత్‌ కార్యాలయాలు, గ్రామ సచివాలయాలు , రైతు భరోసా కేంద్రాల్లో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేయాలని జడ్పీ సీఈవోలు, డీపీవోలను పంచాయతీరాజ్‌ శాఖ ఆదేశించింది. స్థానిక జడ్పీటీసీని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని స్పష్టం చేసింది. గ్రామ సచివాలయాల్లో నిర్వహించే కార్యక్రమానికి స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలను ఆహ్వానించాలని సూచించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News