EPAPER

Chevireddy VS Balineni : బాలినేనికి ఆ ఎస్పీతో చెక్ ? ఒంగోలులో చెవిరెడ్డి మార్క్..

Chevireddy VS Balineni : బాలినేనికి ఆ ఎస్పీతో చెక్ ? ఒంగోలులో చెవిరెడ్డి మార్క్..
ap politics

Chevireddy VS Balineni(AP Politics): ప్రకాశం జిల్లాలో వైసీపీ రాజకీయాలను.. తాను అనుకున్నట్లే నడిపిస్తున్నారు పార్టీ అధ్యక్షుడు జగన్‌రెడ్డి. తన మాట వినలేదని ఒంగోలు ఎంపీ మాగుంటకు ఈ సారి టికెట్ నిరాకరించారు. మాగుంటకు మద్దతు పలికినందుకు జిల్లా పార్టీలో తన బంధువైన బాలినేని ప్రాధాన్యత తగ్గించేశారు.. ఇక ఇప్పుడు తన నమ్మినబంటు చెవిరెడ్డిని అక్కడ పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్‌గా నియమించారు. తమ జిల్లాలోకి చెవిరెడ్డి రాకను బాలినేని ముందు నుంచి వ్యతిరేకిస్తున్నారు. అయినా చెవిరెడ్డికి పార్టీ కీలక బాధ్యతలు అప్పగించడంతో ఆయన తీవ్ర అసహనంతో ఉన్నారంట. ఆ క్రమంలో ఒంగోలులో చెవిరెడ్డి ఫ్లెక్సీలను తగలపెట్టడం వైసీపీలో కలకలం రేపుతోంది. అసలు చెవిరెడ్డిని ఒంగోలు పంపడం వెనుక జగన్ స్కెచ్ ఏంటి?


సీఎం జగన్‌రెడ్డి తన ముఖ్య అనుచరుడు, చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి పార్టీ పరంగా కీలక బాధ్యతలు కట్టబెట్టారు. ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గంతో పాటు బాపట్ల పార్లమెంట్‌ పరిధిలోని సంతనూతలపాడు, నెల్లూరు పార్లమెంట్‌ పరిధిలోని కందుకూరు, కావలి నియోజకవర్గాలకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని రీజనల్ కో ఆర్డినేటర్‌గా నియమించారు. ప్రకాశం జిల్లా రాజకీయాల్లోకి చెవిరెడ్డి రాకను మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ముందు నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు.

ఒంగోలు ఎంపీ అభ్యర్ధిగా చెవిరెడ్డి పేరుని పార్టీ పెద్దలు ప్రతిపాదించినప్పుడు బాలినేని అంగీకరించలేదు. చెవిరెడ్డి స్వయంగా వచ్చి సహకరించమని కోరినా.. ససేమిరా అన్నారు. ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులురెడ్డిని జగన్ పూర్తిగా పక్కన పెట్టేశారు. మాగుంటకు ఈ సారి టికెట్ లేదని తేల్చేశారు. మాగుంటకు టికెట్ నిరాకరించడాన్ని బాలినేని జీర్ణించుకొలేకపోయారు. మాగుంటకు టికెట్ ఇవ్వాలని పట్టుబట్టి రాయబారాలు నడిపారు. ఆ అసంతృప్తితో ఆయన హైదరాబాద్ వెళ్లిపోయి.. నెలరోజులకు పైగా ఒంగోలు వైపు చూడలేదు. కాంగ్రెస్‌లో ఉన్నప్పటి నుంచి మాగుంట, బాలినేని కాంబినేషన్‌ ఒంగోలులో హిట్‌లు కొడుతూ వస్తోంది.


అయితే 2014లో వైసీపీ నుంచి ఒంగోలు ఎంపీగా వైవీ సుబ్బారెడ్డి పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని ఓటమి చవి చూడాల్సి వచ్చింది. తిరిగి 2019లో మాగుంట ఒంగోలు ఎంపీ అభ్యర్ధిగా బరిలో దిగడంతో.. ఇద్దరూ గెలుపొందారు. ఈ నేపధ్యంలో మాగుంటకు టికెట్ లేదనడం బాలినేని మింగుడుపడలేదు. అయితే మాగుంటపై ఆగ్రహంతో ఉన్న జగన్ ఆయనకు సీటు ఇచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో.. మాగుంట విషయంలో బాలినేని మెత్తపడాల్సి వచ్చింది.

అయితే ఒంగోలు ఎంపీ టికెట్ ప్రకాశం జిల్లా వాసులకే ఇవ్వాలని వైసీపీ పెద్దల ముందు ప్రతిపాదన పెట్టారంట.. దాని కోసం విజయవాడలో రెండు రోజులు మకం వేసిన బాలినేని వద్దకు ప్రభుత్వ సలహాదారు సజ్జల వెళ్లి.. ప్రకాశం జిల్లాలో చెవిరెడ్డి ప్రమేయం ఉండదని చెప్పారంట. దాంతో బాలినేని విజయవాడ నుంచి ఒంగోలుకి తిరిగి వచ్చిన రోజు సాయంత్రానికే.. చెవిరెడ్డిని రీజనల్ కోఆర్డినేటర్‌గా ప్రకటించింది వైసీపీ.

రీజనల్ కో ఆర్డినేటర్‌గా చెవిరెడ్డి ప్రకాశం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం.. ఇష్టం లేని బాలినేని ఆ ప్రకటన వెలువడగానే తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు. చెవిరెడ్డి పేరుమింగుడు పడలేదు. హైదదాబాద్ వెళ్ళిన బలినేని ఫోన్ స్విఛ్చాఫ్ చేసి అటు వైసీపీ పెద్దలకు.. ఇటు తన అనుచరులకు కూడా టచ్‌లో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. అటు కాంగ్రెస్‌లో ఉన్నపుడు.. తర్వాత వైసీపీ అవిర్భావం నుంచి ప్రకాశం జిల్లాలో చక్రం తిప్పిన బాలినేని.. ఇప్పుడు చెవిరెడ్డి ఎంట్రీతో భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారంట.

ఇప్పటికే ప్రకాశంలో బాలినేని పెత్తనాన్ని తగ్గించేశారు జగన్. మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టారు. ఇప్పుడు ఎక్కడో చిత్తూరు జిల్లాలో ఉన్న చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డిని తీసుకొచ్చి రీజనల్ కోఆర్డినేటర్‌ని చేశారు. దాంతో జగన్‌ సొంత బంధువు అయినప్పటికీ.. పార్టీలో తన మాట చెల్లుబాటు కాకపోతుండటంతో బాలినేని అసంత‌ృప్తితో రగిలిపోతున్నారంట.

ఆ క్రమంలో చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇంకా ఒంగోలు అడుగుపెట్టకుండానే షాక్ తగిలింది. చెవిరెడ్డికి ఒంగోలులో స్వాగతం పలుకుతూ వైసీపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను.. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే చింపి తగలబెట్టారు. ఆ ఫ్లెక్సీల్లో ఉన్న చెవిరెడ్డి ఫోటోలను మాత్రమే దుండగులు చించేయడం ఒంగోలు వైసీపీలో చర్చకు దారి తీస్తోంది. వైసీపీ పార్టీ జిల్లా కార్యాలయం పక్కనే చెవిరెడ్డి ఫ్లెక్సీని తగులబెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది బాలినేని అనచురుల పనే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

అదలా ఉంటే చెవిరెడ్డికి ఒంగోలు పార్టీ బాధ్యతలు అప్పజెప్పడం వెనుక జగన్ మార్క్ రాజకీయం స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు. ఒంగోలు ఎంపీ అభ్యర్ధిగా చెవిరెడ్డి పోటీ చేయడం ఖాయమంటున్నారు. ఆయన రాకతో జిల్లా పార్టీలో బాలినేని జీరో అయిపోయినట్లే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరోవైపు చెవిరెడ్డి అప్పుడే ఎన్నికల సన్నాహాలు మొదలుపెట్టేసినట్లు కనిపిస్తున్నారు .. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్పీల బదిలీల్లో భాగంగా.. తిరుపతి జిల్లా ఎస్పీ గా ఉన్న పి.పరమేశ్వరరెడ్డి ప్రకాశం జిల్లాకు బదిలీ అయ్యారు. చెవిరెడ్డి ఒంగోలులో అడుగుపెట్టడానికి ముందే ఎస్పీ బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి.

పరమేశ్వర్‌రెడ్డిని ప్రకాశం జిల్లా ఎస్పీగా నియమించడంపై పోలీసు వర్గాల్లో పొలిటికల్ ప్రచారం మొదలైంది. గతేడాది మార్చిలో జరిగిన తిరుపతి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. చెవిరెడ్డీ వర్గీయులు ఇతర ప్రాంతాల నుంచి నిరక్షరాస్యుల్ని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించడం వెలుగు చూసింది. జిల్లా ఎస్పీగా ఉన్న పరమేశ్వర్‌రెడ్డి ఈ ఫిర్యాదులపై స్పందించలేదనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు చెవిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రగిరిలో టీడీపీ, జనసేన సానుభూతిపరుల ఓట్లు తొలగింపునకు సంబంధించి.. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 10 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఒక్క అరెస్ట్‌ కూడా జరగలేదు.

శ్రీకాళహస్తిలో వివాదాస్పద సీఐగా పని చేసిన అంజూయాదవ్ విషయంలో సైతం పరమేశ్వర్ రెడ్డి చూసిచూడనట్లు వ్యవహరించిన తీరు చర్చనీయాంశం అయ్యింది. రాష్ట్రంలో గంజాయి వినియోగం, సాగు పెరిగిపోతుందని నారా లోకేశ్ ఆరోపిస్తే.. పొలిటీషియన్‌లా ఎస్పీ సీన్‌లోకి వచ్చి దానికి కౌంటర్ ఇచ్చారు. అలాంటి ఎస్పీ ఇప్పుడు ఒంగోలుకి ట్రాన్స్‌ఫర్ అవ్వడం వెనుక చెవిరెడ్డి ప్రమేయం ఉందని పోలీసు డిపార్ట్‌మెంట్ వర్గాలు ఆఫ్ ద రికార్డ్‌గా అంటున్నాయి. చెవిరెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేయడానికే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారంటున్నారు. మరి బాలినేని రియాక్షన్ ఎలా ఉంటుందో ? ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఆయన చెవిరెడ్డికి ఎంత వరకు సహకరిస్తారో చూడాలి.

Related News

Chandrababu: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

Flood Damage: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Huge Rains: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!

Budameru Floods: బుడమేరు గండి పూడ్చివేత పూర్తి .. పరిశీలించిన మంత్రి నారా లోకేశ్..

YCP Target on Pawan Kalyan: మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్

CM Chandrababu: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. తెలిపిన ఏపీ సీఎం

Big Stories

×