TTD Board Members: తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలక మండలి వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది. టిటీడీ కొత్త బోర్డులో చిత్తూరు, తిరుపతి జిల్లాల నుంచి చైర్మన్ సహా ముగ్గురికి ప్రాతినిధ్యం లభించింది. అయినప్పటికీ.. తిరుపతి తెలుగు తమ్ముళ్లు మాత్రం నిరాశలో ఉన్నారు. ఉహించని వారికి బోర్డులో ప్రాతినిధ్యం లభించదని అశావహులు మనోవేదనతో ఉన్నారట. అసలు ఆ ఆశావహులు ఎవరు ?
కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుని ధర్మకర్తల మండలిలో చోటు దక్కడం అంటే అంతా పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. అందుకే చాలమంది ఇందులో ప్రాతినిధ్యం కోరుకుంటారు. అయితే కూటమి ప్రభుత్వం ప్రకటించిన పాలక మండలిలలో ఉహించని పేర్లు తెరమీదకు రావడం అశావహులకు ఊహించని షాక్ ఇచ్చిందని అనుకుంటున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన మీడియా అధిపతి బీఆర్ నాయుడు ఛైర్మన్ గా నియామితులు అయ్యారు. బోర్డు మెంబర్ల విషయానికి వచ్చే సరికి చిత్తూరు జిల్లా కుప్పం నకు చెందిన శాంతారామ్, మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మి చోటు దక్కించుకున్నారు. అయితే వారికి సభ్యులుగా అవకాశం రావడం పట్ల తీవ్ర చర్చ జరుగుతుందట.
గత ఎన్నికల్లో తిరుపతి పార్లమెంటు బీజేపీకి కేటాయించడంతో.. మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ పోటీ చేయలేకపోయారు. దీంతో అమెకు బోర్డులో అవకాశం కల్పించారు సీఎం చంద్రబాబు. కుప్పానికి చెందిన శాంతారామ్ కు నాయి బ్రాహ్మణ కోటాలో అవకాశం పొందారు. అయితే టీటీడీ బోర్డులో ఛాన్స్ కోసం టీడీపీతో పాటు బీజేపీ, జనసేన నేతలు గట్టిగానే ప్రయత్నాలు చేశారట. టీడీపీ నుంచి పార్లమెంటు అధ్యక్షుడు నరిసింహా యాదవ్, రాష్ట మీడియా కో అర్డినేటర్ శ్రీధర్ వర్మ ప్రయత్నించారట. శ్రీధర్ వర్మ తండ్రి ఎన్ టి అర్ రాజు తిరుమల వాసి.. గతంలో ఆయన బోర్డు మెంబర్ గా పనిచేశారు. నందమూరి నారా కుటుంబాలతో వర్మ కుటుంబానికి సాన్నిహిత్యం ఉంది..అయినప్పటికి వర్మకు అదృష్టం కలసి రాలేదని అంటున్నారు.
Also Read: గుంతలు పూడ్చి.. రోడ్ రోలర్ నడిపి.. ఈ వయస్సులో అంత యాక్టీవ్ ఏంటీ సీఎం సాబ్!
అలానే ఓ ఇన్ చార్జ్ కూడా సీరియస్ గా ప్రయత్నించారట. ఇక బీజేపీ నుంచి రాష్ట అధికార ప్రతినిధి, మాజీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి, కోలా అనంద్ లతో పాటు గాలి పుష్పలత కూడా ప్రయత్నించారట. మరోవైపు తిరుపతి జనసేన నాయకులు, మాజీ బోర్డు మెంబర్ హరిప్రసాద్, తిరుపతి ఇన్ చార్జ్ కిరణ్ రాయల్ లు కూడా ప్రయత్నించారట. వీరికి కూడా అవకాశం దక్కలేదు. జనసేన కోటా కిందా వచ్చిన మూడింటిలో రెండు తెలంగాణ కోటా కింద పోవడం.. మరొకటి మహిళకు కేటాయించారని అంటున్నారు.
మొత్తం మీద తిరుపతి నాయకులు అశించిన విధంగా బోర్డులో అవకాశం దొరక్కపోవడంతో పలువురు నేతలు అసహనంగా ఉన్నట్టు చర్చ జరుగుతుంది. దీంతో ఒకటి, రెండు మార్పులు ఉంటాయని అశిస్తున్నారట. చూడాలి మరి ఎవరికైనా అవకాశం వస్తుందా అని…