AP Capital: మంత్రి బొత్సా సత్యనారాయణ ఉన్నారే.. తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. గతంలో అమరావతిని శ్మశానంతో పోల్చడం తీవ్ర విమర్శల పాలైంది. అయినా, ఆయన మారలేదు. ఇప్పుడు మళ్లీ కాంట్రవర్సీ స్టేట్‌మెంట్ చేశారు. లక్షల కోట్ల ప్రజాధనం తీసుకొచ్చి, అమరావతి గోతుల్లో పోయాలా? అంటూ మరోసారి కలకలం రేపారు.
అమరావతి రైతుల ఉద్యమం 1200 రోజులకు చేరిన సందర్భంగా స్థానిక రైతులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. వారికి కౌంటర్‌గా మంత్రి బొత్సా మీడియా సమావేశం పెట్టి పలు వ్యాఖ్యలు చేశారు. రాజధాని పేరుతో ఆర్థికంగా లాభపడినవారే తప్ప.. నిజమైన రైతులెవరూ ఉద్యమంలో లేరన్నారు. గతంలో తాను అమరావతిని శ్మశానంతో పోల్చడాన్ని కూడా సమర్థించుకున్నారు.
“ఊరంటే శ్మశానం కూడా ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే అమరావతిని గతంలో శ్మశానంతో పోల్చా. నివాసయోగ్యం అయినందున అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటున్నాం” అని బొత్స అన్నారు.
మూడు రాజధానుల విధానంతోనే వచ్చే ఎన్నికలకు వెళ్తామని మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు. న్యాయ చిక్కులు, సాంకేతిక సమస్యలు లేకుంటే రేపటి నుంచే విశాఖలో పాలన ప్రారంభించాలనేదే తన అభిప్రాయమని చెప్పారు. ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఐదేళ్లు పాలించాలని ప్రజలు అవకాశమిస్తే.. ఆ ఛాన్స్‌ను ఎందుకు వదులుకుని ముందస్తుకు వెళ్తామని ప్రశ్నించారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపైనా బొత్స స్పందించారు. విశాఖ రాజధాని సెంటిమెంట్‌ను ప్రజలు నమ్మలేదనే వాదనతో తాను ఏకీభవించనన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పు ఎక్కడ జరిగిందో సమీక్షించుకుంటామని చెప్పారు. ఉత్తరాంధ్రలో వైసీపీ అభ్యర్థి ఓడిపోవడంపై తానే బాధ్యత వహిస్తానన్నారు మంత్రి బొత్సా.