Big Stories

BJP: మిషన్‌ సౌత్‌.. వాళ్ల భేటీకి అదే కారణమా?

Chandrababu-Amit-Shah

వచ్చే ఎన్నికలకు పాత మిత్రులు మళ్లీ కలుస్తారా? అధికారికంగా బీజేపీ – జనసేన ఫ్రెండ్‌షిప్ కొనసాగుతోంది. టీడీపీని కలుపుకుని వెళ్దామని పవన్ పదేపదే బీజేపీ నాయకత్వాన్ని కోరుతున్నారు. సీఎం జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ తిరోగమనంలో వెళ్తోందని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని పవన్ చెప్తున్న మాట. ఇన్నాళ్లు లైట్ తీసుకున్నారు బీజేపీ అగ్రనేతలు. అయితే.. చంద్రబాబుతో అమిత్‌షా భేటీ అవ్వడంతో బీజేపీ, టీడీపీ మధ్య స్నేహం చిగురించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.

- Advertisement -

మరోవైపు.. తమ పార్టీకి ఫండింగ్ చేస్తున్నవారి డీటేల్స్‌ను సీఎం జగన్‌ కేంద్రానికి సమర్పించారని.. వాటి ఆధారంగా వరుసగా ఐటీ దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు భావిస్తున్నారు. ఇదే జరిగితే వచ్చే ఎన్నికలకు నిధులు సమకూర్చుకోవడం టీడీపీకి కష్టమవుతుంది. దీనిపై కూడా అమిత్‌షాతో చంద్రబాబు చర్చించినట్టు తెలుస్తోంది. చంద్రబాబుతో అమిత్‌షా మీటింగ్ వెనక సంఘ్‌ పరివార్ పెద్దలు, పవన్ తో పాటు మాజీ టీడీపీ నేతలైన సీఎం రమేశ్‌, సుజనాచౌదరి ఉన్నారని కూడా చెప్తున్నారు. ఏప్రిల్‌ 3, 4 తేదీల్లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బీజేపీ జాతీయ నాయకత్వంతో రెండు రోజులపాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తే మంచిదని జనసేనాని కాషాయ నేతలకు చెప్పినట్లు సమాచారం. అయితే బీజేపీ నేతలు మాత్రం అందుకు సిద్ధంగా లేకపోవడంతో, బీజేపీ కలిసి రాకపోయినా, టీడీపీ, జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తామని పవన్‌ కల్యాణ్‌ తెగేసి చెప్పినట్లు సమాచారం. బీజేపీ, టీడీపీ మధ్య రాయబారిగా పవన్‌ వ్యవహరించారని, ఇప్పుడు చంద్రబాబును కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పిలిపించుకోవడం పవన్‌ రాయబారంలో భాగమే అని చర్చ జరుగుతుంది.

- Advertisement -

మోదీ సర్కార్‌ ను గద్దె దింపడానికి విపక్షాలు ఏకతాటిపైకి వస్తున్నాయి. నితీష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఓ జట్టు అయితే రూపుదిద్దుకునే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జాతీయ స్థాయిలో విపక్ష కూటమికి ఒక తుదిరూపం వస్తోంది. మోదీకి వ్యతిరేకంగా విపక్షాలు కూటమి కడుతున్న క్రమంలో దక్షిణాదిలో గట్టి నాయకుడుగా ఉన్న చంద్రబాబును తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ మెత్తబడినట్టు తెలుస్తోంది. చంద్రబాబు జాతీయ స్థాయిలో సమర్థుడైన నేత. విపక్షాలను ఏకతాటిపైకి తేవడం ఆయనకు సాధ్యం. ఈ విషయం చాలా సందర్భాల్లో కన్ఫర్మ్ అయ్యింది. అందుకే ఆయన విపక్ష కూటమి వైపు చూడకుండా బీజేపీ నేతలు కళ్లెం వేయడానికి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అందుకే ఇప్పుడు అమిత్ షా అపాయింట్ మెంట్ ఇచ్చి మరీ బాబును కలుసుకున్నారు. దీనిద్వారా చంద్రబాబు తమవాడేనని విపక్షాలకు పరోక్షంగా సంకేతాలిస్తున్నారనేది రాజకీయ విశ్లేషకుల మాట.

అయితే వైసీపీకి బీజేపీ పూర్తి అండాదండా ఉంది. అలాంటి సహకారం కొనసాగిస్తే… బీజేపీతో పొత్తులు పెట్టుకోవడం.. లేకపోతే ఎన్డీఏలో చేరడం అనేది జరగదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో అయినా మరో రాష్ట్రంలో అయినా టీడీపీ నుంచి సహకారం పొందాలంటే.. కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుందనేది ఆ పార్టీ నేతలు చెబుతున్న మాట. టీడీపీతో కలిసి నడవాలని అనుకుంటే… ఆ పార్టీ ఇచ్చే ఇన్‌పుట్స్‌ను బీజేపీ ఫాలో అవుతుందని, లేకపోతే అవదని.. వచ్చే రెండు, మూడు వారాల్లో ఈ అంశంపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News