⦿ వైసీపీని వీడుతున్న సీనియర్లు
⦿ రోజురోజుకూ జగన్ పార్టీకి దూరం
⦿ పార్టీని వీడుతున్నవారిని వారించేదెవరు?
⦿ వెళితే వెళ్లనీ ధోరణిలో జగన్
⦿ పార్టీకి డ్యామేజ్ అయిన ఆస్తి తగాదాలు
⦿ జనవరి నుంచి జనంలోకి ఎలా వెళతారు?
⦿ ముంచుకొస్తున్న స్థానిక ఎన్నికలు
⦿ పాతకేసుల్లో వైసీపీ మాజీ మంత్రులు
⦿ తిరగతోడుతున్న కూటమి
⦿ కేసుల భయంతో పార్టీని వీడనున్న మరికొందరు
అమరావతి, స్వేచ్ఛ:
YCP Leaders Quits: వైనాట్ వన్ సెవంటీ ఫైవ్ కాస్తా..లెవన్ నెంబర్ దగ్గరే ఆగిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో లెవన్ సంఖ్య మీద ట్రోలింగులు తెగ వైరల్ అవుతున్నాయి. గడియారంలో 12 సంఖ్యలుంటాయి సహజంగా..కానీ వైసీపీ వాల్ క్లాక్ లో 11 మాత్రమే ఉంటాయి. క్యాలెండర్ లో 12 నెలలు ఉంటే వైసీపీ క్యాలెండర్ లో 11 మాత్రమే ఉంటాయి. ఇలా ఎవరిష్టమొచ్చిన ట్రోలింగులు వాళ్లు చేస్తున్నారు. రీసెంట్ గా మరో ట్రోలింగ్ హల్ చల్ చేస్తోంది. ఇది 11వ నెల. ఈ నెల 11న అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మరి 11 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉన్న వైసీపీ నేతలు ఈ నెల 11న జరగబోయే సమావేశాలకు హాజరవుతారా? ట్విస్ట్ ఏమిటంటే ఈ అసెంబ్లీ సమావేశాలు కూడా 11 రోజులు మాత్రమే జరుగుతాయని ప్రకటించారు. మొత్తంగా చూస్తే 11 సంఖ్యతోనే ఈ సమావేశాలు ముడిపడి ఉండటం యాదృచ్ఛికమే.
కండువాల మార్పునకు సిద్ధం
అవన్నీ పక్కన పెడితే వైసీపీలో కీలక పాత్ర పోషించిన నేతలంతా కండువాలు మార్చబోతున్నారని..ఫ్యాన్ గాలి ఎక్కువైపోయి..ఫ్యాను రెక్కలు తిరుగుతున్నా ఉక్కపోతకు గురవుతున్నారని అంతా అంటున్నారు. అంటే ఈ నెలలో ఎప్పుడైనా..ఎక్కడైనా పార్టీ మారేందుకు నేతలు సిద్ధమవుతున్నారని సమాచారం. అయితే ఈ కీలక సమాచారం మొత్తం లీక్ అవుతుంది సొంత పార్టీనుంచే అంటున్నారు.
సొంత పార్టీ నేతలే లీకులు
ఆ పార్టీకి చెందిన నేతలే ఒకరితో ఒకరు చర్చించుకోవడం ద్వారా పార్టీ మారబోతున్నట్లు సమాచారం వస్తోంది. దీనిపై జగన్ కూడా పెద్దగా స్పందిస్తున్నట్లు లేదు. వెళ్లేవాళ్లు వెళ్లనీ..ఉండేవాడే ఉంటారనే ధోరణిలో ఉన్న జగన్ తీరు ఇంకా మారలేదన పార్టీ వర్గాలే భావిస్తున్నాయి. గతంలో మంత్రులుగా చేసి మొన్నటి ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన దాదాపు ఆరుగురు వైసీపీ మాజీ మంత్రులు కూటమి సర్కార్ లో చేరే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఆరుగురు మాజీలు
మొన్నటిదాకా విడదల రజనీ పార్టీని వీడుతున్న సమాచారం హల్ చల్ చేసింది. ప్రస్తుతం జోగి రమేశ్, అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్లు కూడా పార్టీ కండువాలు మార్చుకునేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. వీరితో పాటు మరో నలుగురు మాజీ మంత్రులు కూడా రెడీ అవుతున్నారని అంటున్నారు. ఎందుకంటే అనుమానాలకు తావిచ్చేలా సదరు ఆరుగురు మంత్రులు ఎక్కడా జగన్ నిర్వహించే ఏ కార్యక్రమానికి హాజరవ్వడం లేదు. పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడం లేదు.
జగన్ పార్టీ ప్రక్షాళన అంటూ కొంతమందికి వాళ్లకు అంతగా పట్టులేని నియోజకవర్గాలకు ఇన్ ఛార్జి పదవులను కట్టబెట్టడంతో సదరు ఇన్ ఛార్జ్ మంత్రులు క్షేత్ర స్థాయి కార్యకర్తలను కలుపుకుని పోలేకపోతున్నారని..పైగా వీళ్లు తీసుకునే నిర్ణయాలు కూడా కార్యకర్తలకు నచ్చడం లేదని తెలుస్తోంది.
అయిష్టంతోనే ఇన్ ఛార్జి పదవులు
కొందరు నేతలు పార్టీలో బలపడిపోతున్నారని..నియంతల్లా వ్యవహరిస్తున్నారని వారిపై కంప్లైంట్స్ రావడంతో తప్పనిసరి పరిస్థితిలో వారిని జిల్లా స్థాయి ఇన్ ఛార్జిలుగా వేరే చోట్లకు బదిలీ చేయవలసి వచ్చింది. ఇది ఆ నేతలు ఎంత మాత్రం జీర్ణించుకోలేని పరిస్థితి. కేవలం జగన్ కొంతమంది చెప్పుడు మాటలు విని కష్టపడి పనిచేసే నేతలు, కార్యకర్తలను దూరం పెడుతున్నారని సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. పైగా జనవరి నెల తర్వాత ఏ క్షణమైనా స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ లేకపోలేదు. ఎందుకంటే కూటమి సర్కార్ ప్రస్తుతం మంచి ఊపు మీద ఉంది. పెద్దగా ప్రభుత్వ వ్యతిరేకత కూడా లేదు. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుని దానినే ఓటు బ్యాంకుగా మలుచుకోవాలని భావిస్తోంది.
కలిసొచ్చే స్థానిక ఎన్నికలు
స్థానిక ఎన్నికలలో వైసీనీ నేతలను గట్టిగా ఆకర్షించి తమవైపునకు తిప్పుకోవాలనే యోచన చేస్తోంది కూటమి సర్కార్. జగన్ ఇప్పటికే ఫ్యామిలీ గొడవలతో కుదేలైపోయారు. ఈ సమస్యనుండి బయటకొచ్చేందుకు కొంత సమయం పట్టవచ్చు. ఈ లోగా చాలా వరకూ జగన్ కు డ్యామేజ్ జరిగింది.
జగన్ కోలుకునేలోగా స్థానిక ఎన్నికలు కూడా జరిపించేస్తే మరింత మంది నేతలు, క్షేత్ర స్థాయి కార్యకర్తలు, సెకండ్ గ్రేడ్ లీడర్లు అంతా కూటమి సర్కార్ తో కలిసిపోయే ఛాన్స్ ఉంది. ఈ పరిస్థితినుంచి జగన్ బయటపడాలంటే ఏదైనా అద్భుతమే జరగాలి. జనవరి నుంచి జనంలోకి వెళదామనుకుంటున్న జగన్ కు తల్లీ, చెల్లీ ఆస్తుల లొల్లి ఆటంకంగా మారే పరిస్థితి ఉంది. ఈలోగా వైసీపీ నేతల మీద ఉన్న కేసులన్నీ కూటమి ప్రభుత్వం తిరగతోడుతోంది.
కేసుల నుంచి తప్పించుకునేందుకే..
కొంతమంది ఈ కేసులనుంచి తమని తాము రక్షించుకునే ప్రక్రియలో భాగంగా వైసీపీని వీడే అవకాశం ఉంది. కూటమి, వైసీనీ పార్టీలను పోల్చుకుంటే ఏ పార్టీలో చేరితే ఎక్కువ తమకు లాభమూ ఆలోచనలో పడ్డారు వైకాపా నేతలు. కూటమి సర్కార్ ఏమీ చేయలేక చేతులెత్తేస్తేనే వైకాపాకు అవకాశం ఉంటుంది. పైగా కూటమి సర్కార్ కు నిధుల విషయంలో కేంద్రం అండగా ఉండటంతో రాజధాని పనులు వేగవంతం అయ్యాయి.
అటు రాజధాని, ఇటు పోలవరం రెండూ రాగల రెండేళ్లలో ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంటడం..కొత్త రైల్వే లైన్లకు కేంద్రం అమోదం తెల్పడం, అంతర్జాతీయ ఎయిర్ పోర్టుల రాక, ఇటు పర్యాటకంగా జరుగుతున్న అభివృద్ధి, లోకేష్ పెట్టుబడుల అంశంపై అమెరికా పర్యటన..ఇవన్నీ కూటమి సర్కార్ కు కలిసొచ్చే అంశాలుగా మారనున్నాయి. వైసీపీకి ఎటు చూసినా మార్గం మూసుకుపోతోంది. ఈ పరిస్థితినుంచి బయటపడేందుకు జగన్ ఒంటరి పోరాటమే చేస్తున్నారు.