Bhumana on Sharmila : వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు చంద్రబాబు అమలు చేస్తున్న కుట్రలో వైఎస్ షర్మిళ ప్రధాన పాత్రధారి అని వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మొదటి నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబు.. జగన్ ను ఇబ్బంది పెట్టడం ద్వారా వైఎస్ఆర్ ను ప్రజల గుండెల్లో నుంచి తొలగించాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ ప్రయత్నాలకు వైఎస్ షర్మిళ సాయం చేస్తుందని అన్నారు. ఎవరెన్ని చెప్పినా వైఎస్ఆర్ పరిపాలనను మరిచేలా ఐదేళ్లు పనిచేసిన వైఎస్ జగన్.. తండ్రి కంటే ఎక్కువగా ప్రజల గుండెల్లో నిలిచారన్నారు.
మొన్నటి ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి గెలిచేందుకు అవకాశం ఉన్నా… రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా జగన్ నిజాయితీగా వ్యవహరించారని, చంద్రబాబు మాత్రం అమలు సాధ్యం కాని హామిలిచ్చి గెలిచారన్నారు. చెల్లిగా తనకు రాజకీయ ప్రయోజనం కల్పించనందునే.. షర్మిళ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని భూమన విమర్శించారు. ఎన్నికల్లో జగన్ కు వ్యతిరేకంగా పనిచేసిన షర్మిళ.. ఇప్పుడు బెయిల్ రద్దు చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. వైఎస్ విజయమ్మ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఈడీ జప్తు చేసిన ఆస్తుల బదలాయింపునకు ప్రయత్నిస్తున్నారన్నారు. వైఎస్ షర్మిళ.. జగన్ కు చెల్లి కావడం ఆయన అభిమానులకు బాధగా ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
షర్మిళ పెళ్లి నాటికే ఆస్తుల పంపకాలు జరిగినా.. చెల్లి మీద ప్రేమతో తన స్వార్జితమైన సాక్షి, జగతి పబ్లికేషన్ నుంచి 40 శాతం వాటా ఇచ్చేందుకు జగన్ అంగీకరించినా ఎందుకు షర్మిళ ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. తమ నాయకుడు ఎప్పటికీ తప్పు చేయడన్న భూమన కరుణాకర్ రెడ్డి.. మీరే తప్పు చేస్తున్నారంటూ షర్మిళపై ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిళను వైఎస్ కూతురుగా గౌరవిస్తామని.. కానీ వైఎస్ కుటుంబ పరువుకు భంగం కలిగేలా వ్యవహరిస్తే అంగీకరించమన్నారు. రోజూ మీడియా ముందుకు వచ్చి ఎందుకు ఏడుస్తున్నారన్న భూమన… మీరు రాసే లేఖలు తెలుగుదేశం పార్టీకి ముందే ఎలా వెళుతున్నాయని ప్రశ్నించారు. షర్మిళ వ్యవహరిస్తున్న తీరుకు వైఎస్ అభిమానులుగా మా గుండెలు పగిలిపోతున్నాయన్నారు.
హామీలు అమలు చేయకుండా.. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు
జగన్ వీరుడు, అందుకే ఆయన వెంట కోట్లాది మంది అభిమానులున్నారన్న భూమన.. షర్మిళ వెనుక వైఎస్ అభిమానులు ఒక్కరు కూడా లేరని అన్నారు. కనీసం.. తాను అధ్యక్షురాలిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం ఆమెకు మద్ధతు ఇవ్వడం లేదని గుర్తుచేశారు. వైఎస్ కుటుంబంలో ఒంటరైన షర్మిళ, కాంగ్రెస్ పార్టీలోను ఒంటరేనని ఎద్దేవా చేశారు. జగన్ మీద పంతం పట్టి మెట్టినిళ్లు అంటూ తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టినా.. ఎవరూ షర్మిళ మాయ మాటల్ని నమ్మలేదని, ఇప్పుడు.. ఆంధ్రప్రదేశ్ కు ఎందుకు వచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Also read : అది ఆస్తి కోసం తగాదా కాదు.. అధికారం కోసం తగాదా: విజయ్ సాయి రెడ్డి
ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ఆరోపించిన భూమన కరుణాకర్ రెడ్డి.. నెలకొక సంఘటనను తెరపైకి తెస్తున్నారన్నారు. మొదటి నెల రిషికొండ ప్యాలెస్, తర్వాత ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రాలు, కాందబరి హీరోయిన్ వ్యవహారం, ఆ తర్వాతి నెల తిరుమల లడ్డూలో కల్తీ వ్యవహారం.. ఇప్పుడు జగన్, షర్మిళ మధ్య ఆస్తుల వివాదాన్ని వాడుకుంటోందని వివరించారు. ప్రజలను పక్కదోవ పట్టించేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న కుట్రలో షర్మిళ భాగమైందని ఆగ్రహించిన భూమన.. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీల మధ్య వివాదాలను బిజినెస్ పేజీల్లో రాసిన మీడియా.. ఇప్పుడు జగన్ కుటుంబ వ్యవహారాన్ని మాత్రం ప్రధాన శీర్షికల్లో ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు.
తమ నాయకుడు పేద ప్రజల కోసం రూపొందించిన మ్యానిఫెస్టోలో 98 శాతానికి పైగా హామీలను పూర్తి చేశామని.. రాష్ట్రంలోని 60 శాతం బడుగు బలహీన వర్గాల వారికి
3.5 లక్షల కోట్లను నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని గుర్తుచేశారు.