– 74 మంది మహిళలకు అన్యాయం జరిగిందా?
– ఏదీ, ఏడుగురి పేర్లు చెప్పు చూద్దాం
– నోటికొచ్చింది మాట్లాడడానికి సిగ్గుండాలి
– ఐదేళ్లు ఒక్క ఆడపిల్లకైనా రక్షణ ఇచ్చారా?
– జగన్, రోజాపై మంత్రి సంధ్యారాణి ఫైర్
పార్వతీపురం, స్వేచ్ఛ: AP Political: మాజీ సీఎం జగన్, మాజీ మంత్రి రోజాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. శనివారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె, జగన్‌పై ఫైరయ్యారు. ఆస్తి కోసం సొంత తల్లిని, చెల్లిని కోర్టులో పెట్టిన జగన్ మనిషేనా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తండ్రి వైఎస్ పోటీ చేసిన టైమ్‌లో సొంత ఇల్లు కూడా లేదు, అలాంటిది అన్ని ఆస్తులు జగన్ ఏ విధంగా సంపాదించారని ప్రశ్నించారు. ఒకప్పుడు ఇళ్లు కూడా లేని రాజశేఖర్‌రెడ్డి కుమారుడికి ఇప్పుడు ఇన్ని ఇళ్లు ఎలా వచ్చాయని అడిగారు.
జగన్ ఇంత ఆస్తి ఎలా వచ్చింది, రాళ్లు కొట్టి సంపాదించారా అంటూ సెటైర్లు వేశారు. రాష్ట్రంలో ఉన్న వారందరూ అక్క చెల్లెమ్మలే అని చెప్పుకునే జగన్, సొంత తల్లిని బయటకు తోసేసి, చెల్లికి కోర్టుకు లాగారంటూ విమర్శించారు. ఇంత చేసి, చంద్రబాబు, లోకేష్ గురించి ఎలా మాట్లాడతారని మండిపడ్డారు. కరోనా సమయంలో జనాన్ని పలకరించని జగన్, మొన్న గుర్లలో కేవలం రాజకీయ లబ్ధి కోసం పలకరింపులు చేశారని అన్నారు మంత్రి సంధ్యారాణి. ఇక, రోజా వ్యాఖ్యలపై స్పందిస్తూ, 74 మంది మహిళలకు అన్యాయం జరిగిందని చెప్పిన రోజా, కనీసం ఏడుగురు పేర్లు అయినా చెప్పాలని డిమాండ్ చేశారు.
రోజా అలా మాట్లాడేందుకు సిగ్గుండాలని మండిపడ్డారు. ఐదు సంవత్సరాల కాలంలో కనీసం ఒక్క ఆడపిల్లకు కూడా మీరు రక్షణ కల్పించలేకపోయారని ఆరోపించారు. ఏదైనా సంఘటన జరిగితే చంద్రబాబు ఆదేశాల మేరకు శాఖల పరమైన మంత్రులే నేరుగా వెళ్తున్నారని వివరించారు. ప్రజలు మిమ్మల్ని ఛీ కోట్టారన్న విషయం మర్చిపోవద్దని, ఇంకా ఛీ కొట్టించుకోవాలని తాపత్రయపడొద్దని చురకలంటించారు. వరద బాధితులకు కోటి రూపాయలు ప్రకటించిన జగన్, ఇంతవరకు ఆ చెక్కు పంపిణీ చేయలేదన్నారు మంత్రి.