EPAPER

AP Kapu Politics : ఏపీ ఎన్నికల్లో కాపు ఓట్లే కీలకమా ? ఆ ఇద్దరి కోసమే అన్నిపార్టీల ఎదురుచూపులు..

AP Kapu Politics : ఏపీ ఎన్నికల్లో కాపు ఓట్లే కీలకమా ? ఆ ఇద్దరి కోసమే అన్నిపార్టీల ఎదురుచూపులు..

AP Kapu Politics : ఏపీ రాజకీయాలు గతంలో కంటే ఇప్పుడు డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. ఓవైపు వైసీపీ వై నాట్ 175 అంటోంది. అదే సమయంలో జగన్ పార్టీని ఈసారి ఓడిస్తామంటూ టీడీపీ, జనసేన పట్టుదలగా ఉన్నాయి. గెలుపోటముల్లో కీలకమైన కాపు సామాజికవర్గం ఈసారి ఎవరికి జై కొడుతుందన్నది కీలకంగా మారింది. మార్పు కోరుకుంటున్నారా… నేతలు చెప్పిన వారికే ఓటేయబోతున్నారా?


ఎన్నికలు వచ్చినప్పుడే కుల, వర్గ సమీకరణాలు తెరపైకి వస్తుంటాయి. ఇప్పుడు ఏపీలోనూ అదే సీన్ కనిపిస్తోంది. బలమైన కాపు సామాజికవర్గం ఈసారి పూర్తి అలర్ట్ గా అడుగులు వేస్తోందా అన్న చర్చ జరుగుతోంది. నిజానికి రెడ్లు, కమ్మ వర్గాలదే కీలక పదవుల్లో ఆధిపత్యం కనిపిస్తోంది. అదే సమయంలో కాపు వర్గానికి కొన్ని పదవులే దక్కుతున్నాయి. అందులోనూ కీలకం అన్నవి లేవన్న వాదన ఉంది. ఏపీ జనాభాలో 27 శాతం ఉన్నా బలమైన సామాజిక వర్గమైనా అధికారం అందని ద్రాక్షగానే ఉంటోందంటున్నారు. నిజానికి ఏ రాష్ట్రంలో ఈ స్థాయి జనాభా ఉన్నా.. కీలక పదవులు చేపట్టిన పరిస్థితి ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో కాపు సామాజికవర్గంలో అనైక్యత కారణంగానే కీలక పదవులకు దూరంగా ఉండిపోయారన్న టాక్ కూడా ఉంది.

కాపులు ప్రతి ఎన్నికల్లోనూ తమకు నచ్చిన పార్టీకి ఓట్లేస్తుంటారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు కూడా అదే జరిగింది. అయితే నాడు అధిక శాతం కాపుల ఓట్లు ప్రజారాజ్యానికి పడ్డాయి. ఇక 2019లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తే కూడా కాపులలో ఒక సెక్షన్ ఓటింగ్ బాగా పడింది. చాలా వరకు వైసీపీకి పడ్డాయి. అప్పట్లో ముద్రగడ పద్మనాభం కూడా జగన్ కు అనుకూలంగా ఉండడంతో పరిస్థితి అటే మారిపోయింది. కానీ ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మాత్రం కాపు ఓటు పూర్తిగా కన్సాలిడేట్ కావాలని భారీ వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే పవన్ కల్యాణ్ చాలా పరిణతితో బహిరంగ లేఖ రాశారంటున్నారు. జనసేనకు టీడీపీ పొత్తుల్లో భాగంగా ఎక్కువ సీట్లు వచ్చేలా చూసుకోవడం, తద్వారా అధికారంలో కీలక భాగస్వామ్యం పోషించాలన్నది కాపు నేతల ఆలోచనగా కనిపిస్తోంది. పవన్ తో ముద్రగడ జతగూడితే జనసేన బలం సామాజికంగా, రాజకీయంగా రెట్టింపు అవుతుందన్న అంచనాల్లో ఉన్నారు.


ఈ ఎన్నికల్లో కాపులంతా ఒక్కటి అయ్యే సంకేతాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందుకో ఉదాహరణ క్లియర్ గా కనిపిస్తోంది. ఇటీవలే వైసీపీలో చేరిన 10 రోజులు తిరగకుండానే క్రికెటర్ అంబటి రాయుడు రూట్ మార్చేశారు. వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. జనసేనవైపు అడుగులు వేస్తున్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన అంబటి రాయుడు దిశ మార్చేసుకోవడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కాపులంతా ఒక్క చోట చేరుతారా అన్న ప్రశ్నలకు సమాధానంగా మారుతోంది. రానున్న రోజుల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయని కూడా అంటున్నారు. మొత్తం మీద కాపు ఓటు కన్సాలిడేట్ అయితే అది ఏపీ రాజకీయాలను ఏ విధంగా మలుపు తిప్పుతుందన్న కీలకంగా మారింది.

కాపు సామాజికవర్గంలో తమకున్న పట్టును కోల్పోకూడదని వైసీపీ భావిస్తోంది. అందుకే పార్టీలోని కాపులందరినీ ఏకతాటిపైకి తెచ్చి జనసేన, టీడీపీ నేతలపై విరుచుకుపడేలా చేస్తున్నారు. గత ఐదేళ్లలో కాపులకు జగన్ ప్రభుత్వం ఏమేం చేసిందో చెబుతున్నారు. మరోవైపు వైసీపీకి పోటీగా జనసేనకు చెందిన కాపు నేతలు కూడా మీటింగ్ పెట్టుకుంటున్నారు. కాపులకు రాజకీయంగా మంచి పొజిషన్ వస్తుందని అంటున్నారు. పవన్ కల్యాణ్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. మరోవైపు వంగవీటి రాధా, ముద్రగడ పద్మనాభం వంటి వారి సపోర్ట్ కోసం అన్ని పార్టీలు ఎదురుచూస్తున్నాయి.

కేంద్రం ఇచ్చిన ఈడబ్ల్యూఎస్‌ 10 శాతం రిజర్వేషన్‌లో 5 శాతం కాపులకు వర్తించేలా గత టీడీపీ ప్రభుత్వం శాసనసభలో బిల్లు పెట్టి ఆమోదం కూడా పొందింది. తర్వాత అధికారంలోకి వైసీపీ రావడంతో ఆ విషయం మరుగున పడింది. మరోవైపు కాపులు ఓన్‌ చేసుకుంటున్న పవన్‌ కల్యాణ్‌పై వైసీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్నారంటూ పవన్‌ పర్సనల్ లైఫ్‌పై సీఎం జగన్ ప్రతి సభలో స్వయంగా మాటల దాడి చేస్తున్నారు. అయితే అవన్నీ కాపు ఓటుబ్యాంకుపై ప్రతికూల ప్రభావాన్ని చూపబోతున్నాయని వైసీపీ సర్వేల్లో వెల్లడవ్వడంతో.. దిద్దుబాటు చర్యల్లో ఉన్నారంటున్నారు.

పవన్ ఫ్యాక్టర్ ను కొంత వరకైనా తగ్గించే ప్లాన్ తో జగన్ ఉన్నారు. గతంలో రాధా వైసీపీలో ఉన్నప్పుడు ఆయనకు ప్రాధాన్యం ఇవ్వకపోగా.. గత ఎన్నికల్లో సీటు కూడా ఖరారు చేయలేదు. ఆయన విజయవాడ సెంట్రల్ నుంచి పోటీకి సిద్ధమైతే.. వేరే చోటకి వెళ్లాలన్నారు. దాంతో రాధా అప్పట్లో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. అప్పుడు పవన్‌ కల్యాణ్‌ టీడీపీతో లేకపోవడంతో కాపు ఓట్ల అంశాన్ని వైసీపీ పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు టీడీపీ, జనసేన కలిసి నడిచేందుకు సిద్ధమవుతుండడం, అలాగే గతంలో ఎప్పుడూ లేనంతగా పవన్‌ను ఆయన సామాజికవర్గం ఓన్‌ చేసుకుంటడం వైసీపీ నేతల్లో గుబులు రేపుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో వంగవీటి రాధా కోసం పునరాగమనం కోసం వైసీపీ ప్లాన్ చేస్తోంది.

.

.

Related News

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

Big Stories

×