పెళ్లి తరవాత ఆడపిల్లలకు పుట్టినిల్లే పరాయి ఇల్లు అవుతుంది. అప్పటి వరకు ఉన్న సంబంధాలన్నీ ఆ తరవాత కొద్ది కొద్దిగా దూరం అవుతూ ఉంటాయి. ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నా పెళ్లి తరవాత మాత్రం కుటుంబ సభులు బిడ్డను దూరంగా పంపిస్తుంటారు. మళ్లీ పండుగలకో పబ్బాలకో ఇంటికి వస్తారు తప్ప తరచూ వస్తూ పోవడాలు ఉండవు. దీంతో పెళ్లైతే ఆడపిల్ల ఇంటి మనిషి కాదు అనే భావన ఉంది. అయితే ఇదే విషయంపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తల్లి దండ్రుల కుటుంబంలో కుమార్తె స్థానాన్ని పెళ్లి అంతం చేయదని స్పష్టం చేసింది.
వివరాల్లోకి వెళితే… పెళ్లి తరవాత అత్తవారింటికి వెళ్లిన ఓ యువతి తన తండ్రి ప్రభుత్వ ఉద్యోగం కారుణ్య నియామకం కింద తనకు ఇవ్వాలని కుటుంబ సభ్యులతో వాదించింది. కానీ దానికి వారు అంగీకరించకపోవడంతో కోర్టును ఆశ్రయించింది. కారుణ్య నియామకానికి కుటుంబ సభ్యులు తనను ఇంటిమనిషిగా పరిగనించడంలేదని తన ఫిర్యాదులో పేర్కొంది. నేడు దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ ఇంటి అమ్మాయి పెళ్లి తరవాత తమ కుటుంబంతో సంబంధం లేదని చెప్పడాన్ని కోర్టు తప్పుపట్టింది.
కారుణ్య నియామకాల్లో కొడుకులను, కూతుళ్లను వేర్వేరుగా చూడటం తప్పుపట్టింది. పెళ్లి అయినా కాకపోయినా ఆడపిల్లలు తల్లిదండ్రుల కుటుంబంలో భాగమేనని స్పష్టం చేసింది. అయితే ఇప్పటి వరకు తల్లి దండ్రుల ఆస్తిలో కుమారుడితో పాటు కూతురుకు సమానమైన హక్కు ఉందని చాలా మందికి తెలుసు. కానీ కారుణ్య నియామకాల విషయంలో అమ్మాయిలకు కూడా హుక్కు ఉందనే విషయం చాలా మందికి తెలియదు. కోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో ఆ విషయంపై క్లారిటీ వచ్చేసింది.