Big Stories

AP Passengers : ఆ 28 మంది ప్రయాణికులు ఏమయ్యారు..? ఏపీ ప్రభుత్వం ఆరా..!

AP Passengers : ఒడిశాలో ప్రమాదానికి గురైన కోరమాండల్‌, యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ల్లో మొత్తం 695 మంది ఏపీ వాసులు ప్రయాణించారని నిర్ధారించారు. ఈ విషయాన్ని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆ రెండు రైళ్లలో ప్రయాణించిన ఏపీ ప్రయాణికుల్లో 553 మంది సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. 92 మంది తాము ట్రావెల్‌ చేయలేదని సమాచారం ఇచ్చారన్నారు. మిగిలిన వారిలో 28 మంది ఇంకా ఫోన్‌ కు అందుబాటులోకి రాలేదని చెప్పారు.

- Advertisement -

ఫోన్‌ నంబర్‌ ఆధారంగా ఆ 28 మంది లొకేషన్లు గుర్తిస్తామన్నారు. వారి ఇళ్లకు అధికారులను పంపి వివరాలు తెలుసుకుంటున్నామని తెలిపారు. మరో 22 మంది స్వల్పంగా గాయపడ్డారని మంత్రి బొత్స వెల్లడించారు. క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతోందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి అమర్‌నాథ్‌, ఆరుగురు అధికారులు ఒడిశా వెళ్లి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. సమాచారాన్ని ఎప్పటికప్పుడు సీఎం జగన్‌కు అందజేస్తున్నామని మంత్రి తెలిపారు.

- Advertisement -

రిజర్వేషన్‌ చార్ట్‌ ప్రకారం కోరమాండల్‌లో 484, యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో 211 మంది ఏపీ ప్రయాణికులు ఉన్నారని బొత్స వెల్లడించారు. యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతిలో 107 మంది ఎక్కారని , అన్‌రిజర్వుడ్‌ ప్రయాణికుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. ఈ సమాచారాన్ని ఒడిశాలోని వివిధ ఆస్పత్రుల నుంచి మంత్రి అమర్‌నాథ్‌, అధికారుల బృందం సేకరిస్తోందన్నారు. ఇంకా 180 మృతదేహాల వివరాలను గుర్తించాల్సి ఉన్నట్లు అక్కడి నుంచి తమకు సమాచారం వచ్చిందని బొత్స వెల్లడించారు.

కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద ఘటనలో క్షత్రగాత్రుల సమాచారం కోసం విపత్తుల సంస్థ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ 24/7 కంట్రోల్ రూమ్ నెంబర్స్ ఇచ్చింది. మిస్సయిన వారి సమాచారం కోసం ఈ 1070, 112, 18004250101 ఫోన్‌ చేయాలని సూచించింది. అలాగే, 8333905022 నెంబర్‌కు ప్రయాణికుడి ఫొటో, ఇతర వివరాలను వాట్సాప్‌లో పంపించాలని తెలిపింది. అనంతరం, వివరాల ఆధారంగా పోలీసు శాఖతో సమన్వం చేసుకుని బాధితులకు వివరాలు తెలియజేయనున్నట్టు అధికారులు తెలిపారు.

మరోవైపు ఒడిశా రైలు ప్రమాదం ఘటనలో సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన శ్రీకాకుళానికి చెందిన గురుమూర్తి కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. లక్ష చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. కేంద్రం సాయానికి అదనంగా ఈ పరిహారం ఇవ్వాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News