EPAPER

AP Elections 2024 : ఆ గట్టు నుంచి ఈ గట్టుకి పీకే .. బెనిఫిట్ ఎవరికి ?

AP Elections 2024 : ఆ గట్టు నుంచి ఈ గట్టుకి పీకే .. బెనిఫిట్ ఎవరికి ?

AP Elections 2024 : అధికారమే లక్ష్యంగా ఏపీలో టీడీపీ ప్లాన్డ్‌గా ముందుకెళ్తోంది. అదే సమయంలో రెండోసారి పవర్‌ దక్కించుకోవడం కోసం జగన్‌ కూడా తనదైన స్టైల్‌లో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మరో మూడు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే 2019లో జగన్‌ చేతిలో చంద్రబాబు ఘోరంగా ఓటమిపాలయ్యారు. ఈసారి అదే జరిగితే ఇక తెలుగుదేశం పార్టీ ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది అనడంలో సందేహం లేదు. ఈసారి మిస్‌ అయితే మళ్లీ ఛాన్స్‌ దొరకదని చంద్రబాబు ఫిక్స్‌ అయ్యారు. అందుకే 2024లో ఎలాగైనా అధికారంలోకి రావాలని అందుకోసం ఏం చేయాలో అవన్నీ చేస్తున్నారు. అందులో భాగంగానే 2019లో జగన్‌ గెలుపులో కీలకంగా వ్యవహరించిన పొలిటికల్‌ స్ట్రాటజిస్ట్‌ ప్రశాంత్‌ కిషోర్‌ను అప్రోచ్‌ అయ్యాడు.


రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన ఎలాంటి ఉపయోగం ఉండదని చంద్రబాబుకు బాగా అర్థమైపోయిందని తెలుస్తోంది. పవన్‌ కల్యాణ్‌ సినీ గ్లామర్‌.. ఓట్లురాబట్టలేవని గ్రహించినట్టుగా తెలుస్తోంది. అందుకనే చివరకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో ఒప్పందం చేసుకున్నారు. 2019లో వైసీపీ కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్‌ ఏరికోరి పిలిపించుకున్నారు. పీకేను లోకేష్‌ ఢిల్లీకి వెళ్లి ప్రత్యేక విమానంలో విజయవాడకు తీసుకొచ్చారు. అయితే అదే పీకేను గతంలో చంద్రబాబు అనరాని మాటలు అన్నారు. ఎంతలా బందిపోటుతో పోల్చారు. 2019 ఎన్నికల్లో జగన్‌ బీహార్ బందిపోటు పీకేతో కలిసి రాష్ట్రాన్ని నాశనం చేసినట్లు ఊరూవాడా తిరిగి తిట్టారు. సీన్ కట్ చేస్తే.. చివరకు అదే పీకేని ఇదే చంద్రబాబు ప్రత్యేక విమానంలో విజయవాడకు పిలిపించుకున్నారు. అవసరం కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారిపోతారనటానికి పీకేని పిలిపించుకోవటమే తాజా ఉదాహరణ అంటున్నారు వైసీపీ నేతలు. అయితే చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలోనే పలుమార్లు ఢిల్లీకి వెళ్లిన లోకేష్‌ పీకేతో భేటీ అయ్యారని వైసీపీ చెబుతున్నారు.

తెలుగుదేశం పార్టీ కోసం వ్యూహకర్త రాబిన్‌ శర్మ గత కొద్ది నెలలుగా పనిచేస్తున్నారు. క్షేత్రస్థాయిలో తన టీమ్‌ను డిప్లై చేసి అభ్యర్థుల ప్రొఫైల్స్‌ను స్టడీ చేశారు. అయితే చంద్రబాబు ఇంత సడెన్‌గా పీకేను ఎందుకు రంగంలోకి దించాడు అన్నదే ఇక్కడ అసలు మేటర్‌. రాబిన్ ఉన్నప్పటికీ మళ్లీ పీకేను పిలిపించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది..? అంటే రాబిన్ వ్యూహాలు పార్టీకి పెద్దగా వర్కవుట్‌ కావడం లేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాబిన్‌శర్మ కూడా ఒకప్పుడు ఐప్యాక్‌ సంస్థలో పీకే సహచరుడు. అయితే ఎన్నికలకు ఇంకా ఉన్నది మూడు నెలలు మాత్రమే. ఏం చేసినా ఈలోగానే చేయాలి. అందుకే పీకేను చంద్రబాబు ఆఘమేఘాల మీద విజయవాడకు రప్పించుకుని భేటీ అయ్యారు. గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వైసీపీకి వ్యూహకర్తగా పనిచేశారు. ఆయన వ్యూహాలు ఫలించడంతోపాటు, జగన్ కి ఒక అవకాశం ఇచ్చి చూద్దామనుకున్నారు కాబట్టే వైసీపీ అధికారంలోకి రాగలిగింది. అలాంటి ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు బాబు టీంతో కలిసిసోయారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించేందుకు రాబిన్‌శర్మ, పీకే బృందాలు పరస్పర సహకారంతో పనిచేయనున్నాయి.


2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని ఊహించని విధంగా జగన్‌ దెబ్బకొట్టారు. 151 సీట్లతో జయకేతనం ఎగురవేశారు. వైసీపీ ఆరేంజ్‌లో విజయం సాధించడానికి కారణం అప్పటి వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ అన్నది జగమెరిగిన సత్యం. పీకే వ్యూహాలను జగన్‌ అమలు చేయడం వల్లే వైసీపీకి పగ్గాలు దక్కాయి. జగన్‌ ప్రచార సమయంలో వచ్చిన పాటలు కానీ.. బైలైనర్స్‌ కూడా బాగా ఫేమస్‌ అయ్యాయి. 2014 లో జాబు కావాలంటే బాబు రావాలి అనే స్లోగన్ తో చంద్రబాబు ఏపీలో అధికారాన్ని దక్కించుకున్నారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో రావాలి జగన్‌.. కావాలి జగన్‌ అనే స్లోగన్‌ను ప్రతి ఒక్కరి నోళ్లల్లో నానేలా చేశారు. అంతేకాదు జగన్ మేనిఫెస్టోను డిజైన్ చేసింది కూడా పీకేనే. అందులో నవరత్నాలకు ప్రాణం పోసింది ప్రశాంత్ కిషోరే. అందుకే జగన్‌ భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు.

ఇప్పుడు మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. సరైన అర్థం వచ్చేలా.. పంచింగ్‌ లైన్‌ తో కూడిన నినాదాలను జనంలోకి తీసుకెళ్లడంలో పీకే ఎక్స్‌ పర్ట్. అందుకే తమ ఓటమికి కారణమైన ప్రశాంత్ కిషోర్ ద్వారానే వైసీపీని దెబ్బకొట్టాలనే వ్యూహంతో చంద్రబాబు ముందుకు వెళ్తున్నారని క్లియర్‌గా అర్థమవుతోంది. గత సంవత్సరకాలంగా పీకే ని వ్యూహకర్తగా నియమించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించినా వర్కవుట్ కాలేదు. ప్రస్తుతం తాను రాజకీయాల్లో బిజీగా ఉన్నానని ప్రశాంత్ కిషోర్ చెప్పడంతో సైలెంట్ అయిపోయారు. అయితే ఎన్నికల సమయం దగ్గరపడిన నేపథ్యంలో తమ పార్టీకి రాజకీయ వ్యూహాలు అందించేందుకు ప్రశాంత్ కిషోర్ ను ఒప్పించినట్లు తెలుస్తోంది. అయితే మర్యాద పూర్వకంగానే బాబుతో భేటీ అయ్యానని ప్రశాంత్‌ కిషోర్‌ చెప్పడం ఇక్కడ కొసమెరుపు.

చంద్రబాబు ప్రశాంత్‌ కిషోర్‌ భేటీపై వైసీపీ మంత్రులు ఘాటుగా రియాక్ట్‌ అయ్యారు. ఆల్రెడీ చంద్రబాబుతో ఒక పీకే ఉన్నాడని.. ఇప్పుడు ఉంకో పీకేను తెచ్చుకున్నాడని.. అయినా కూడా ఏం చేసేదేం లేదు అంటున్నారు. ఒకప్పుడు బీహార్‌ డెకాయిట్‌ అన్న వ్యక్తి కాళ్లు పట్టుకుని బతిమిలాడుతున్నారని కామెంట్స్‌ చేశారు.

చంద్రబాబుతో భేటీ సందర్భంగా ప్రశాంత్‌ కిషోర్‌.. ఓ డీటెయిల్డ్‌ రిపోర్ట్‌ను ఆయనకు అందజేశారట. అంశాలవారీగా ప్రభుత్వ బలాబలాలు వివరించారు. వైసీపీ ప్రభుత్వ విధానాలపై యువత తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు పీకే. వచ్చే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే పలు అంశాలను వివరించారు. నిరుద్యోగం, ధరలు, విద్యుత్ ఛార్జీలు, పన్నుల బాదుడు ప్రభావం చూపుతాయన్నారు. దళితులు, బీసీలపై దాడులు ఆయా వర్గాలను వైసీపీకి దూరం చేశాయని చర్చలో పీకే చెప్పారని టాక్‌. అయితే ప్రశాంత్ కిశోర్ వల్లే జాతకాలు తారుమారవుతాయి అనుకోలేం. అలా అని ఆయన వ్యూహాలను అంత తేలిగ్గా తీసిపారేయలేం.

ప్రస్తుతం ఏపీలో వైసీపీకి కూడా పీకే టీమ్ లోని పాత సభ్యులు పని చేస్తున్నారు. ఐ-ప్యాక్ తో వైసీపీ ఒప్పందం కొనసాగుతోంది. వారి సర్వేల ఆధారంగానే ఇటీవల ఇన్ చార్జ్ ల మార్పు జరిగింది అని తెలుస్తోంది. అయితే ఇప్పుడు అదే సంస్థకు అధిపతి అయిన పీకే వైసీపీని ఓడించేందుకు టీడీపీకి వ్యూహాలు అందించేందుకు సిద్ధమవడం సంచలనగా మారింది. ఏదిఏమైనా ఈ పరిణామాలన్నీ అధికార పార్టీ వైసీపీకి ఆందోళన కలిగిస్తున్నాయి. మొన్నటి వరకు తమతో పని చేసిన ప్రశాంత్ కిషోర్ కు తమ రాజకీయ వ్యవహారాలు, పార్టీ పరిస్థితి బాగా తెలుసు అని ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ టీడీపీ కోసం పనిచేస్తే నష్టం తప్పదనే బావనలో వైసీపీలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఐ ప్యాక్ నుంచి ప్రస్తుతమైతే ప్రశాంత్ కిషోర్ దూరంగా ఉన్నారు. ఈ తరుణంలోనే చంద్రబాబుతో పీకే భేటీ అవ్వడం వైసీపీ నేతలకు కాస్త గుబులు పుట్టించింది. ఇది ఎక్కడా డ్యామేజ్ అవుతుందోనని ఐ ప్యాక్ టీమ్ ట్విట్టర్ వేదికగా స్పందించింది. గత సంవత్సర కాలంగా తాము జగన్ గెలుపు కోసం పనిచేస్తున్నామని ప్రకటించింది. అంటే ప్రశాంత్ కిషోర్ కు జగన్ కు సంబంధం లేదని చెప్పడమే ఆ ట్వీట్ ఉద్దేశం. మొత్తంగా పీకే ఎంట్రీతో ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టింది. మరి రిజల్ట్ లో కూడా ఆ స్థాయి ప్రభావం కనపడుతుందా లేదా అనేది వేచి చూడాలి.

.

.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×