ఈ నెల 11 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెలాఖరుతో ఓటాన్ బడ్జెట్ ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 11వ తేదీనే పూర్తిస్థాయి బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టబోతున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా పది రోజుల పాటు సమావేశాలు నిర్వహించి.. పలు బిల్లులను సభలో ప్రవేశపెట్టే యోచనలో ఏపీ సర్కార్ ఉన్నట్టు సమాచారం. ఉదయం 10 గంటలకు కేబినెట్ భేటీతో పాటు అదే రోజు బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తుందట. మొత్తం 5 నెలలకు బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం అందుతోంది.
ALSO READ: టీటీడీ బోర్డు సభ్యుల లిస్ట్ మారనుందా? కొత్తగా ఛాన్స్ కొట్టేది ఎవరు?
నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆర్థికశాఖపై రెండుమూడు విడతలుగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. గత ఆరు నెలలుగా ఓటాన్ బడ్జెట్ తోనే ప్రభుత్వం నడుస్తోంది. ఇదిలా ఉంటే రాష్ట్ర చరిత్రలో మొదటిసారి ఒకే ఏడాది రెండుసార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు వెళుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఆర్థిక పరిస్థితిపై స్పష్టత కోసమే గడువు తీసుకోవాల్సి వచ్చిందని వివరించాయి. దానికి అనుగుణంగానే రెండోసారి కూడా ఏపీ సర్కార్ ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఇక చివరి అసెంబ్లీ సమావేశాలలో రాష్ట్ర ఆర్థికపరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రాలను సైతం విడుదల చేసింది. ఆర్థిక పరిస్థితి, మద్యం, శాంతి భద్రతలపై వివరాలను సభ ముందు ఉంచింది. గత సమావేశాల్లోనే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతారని భావించగా, ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తోనే కొనసాగించింది. గడువు ఈనెల చివరితో ముగియనున్న నేపథ్యంలో జరగబోయే సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.