EPAPER

Anil Kumar Yadav : నెల్లూరా..? నరసరావుపేటా..? అయోమయంలో అనిల్ కుమార్..

Anil Kumar Yadav : నెల్లూరా..? నరసరావుపేటా..? అయోమయంలో అనిల్ కుమార్..
Anil Kumar Yadav

Anil Kumar Yadav : సీఎం జగన్ కి వీర విధేయుడిగా.. ప్రతిపక్షాలకు తన వాగ్దాటితో చుక్కలు చూపించే మాజీ మంత్రి అనిల్‌కు సొంత పార్టీలోనే షాక్ తగిలే పరిస్థితి కనిపిస్తోంది. పదేపదే తాను నెల్లూరు సిటీ నుంచి పోటీ చేస్తానని చెబుతున్న అనిల్‌ను అధిష్టానం నరసరావుపేట ఎంపీ అభ్యర్ధిగా పంపడానికి చూస్తుందన్న ప్రచారంతో.. అటు అనిల్.. ఇటు సింహపురి వైసీపీ కార్యకర్తల్లో ఆందోళన కనిపిస్తోంది. నెల్లూరు సిటీలో మంత్రిగా ఉన్నప్పుడు అనిల్ వైఖరితో వైసీపీలో వర్గ పోరు పెరిగిపోయింది. సొంతపార్టీలోనే పలువురు నేతలు ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో అనిల్ యాదవ్‌ని నరసరావుపేట షిఫ్ట్ చేస్తారన్న ప్రచారంతో ఇంతకాలం ఆయన్ని నమ్ముకుని ముందుకు నడిచిన కార్యకర్తలు, ముఖ్య నేతలు తలలు పట్టుకుంటున్నారంట. అదే జరిగితే తమ పరిస్థితి ఏంటని బెంగ పెట్టేసుకుంటున్నారంట.


మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. ముందు నుంచి వైఎస్ జగన్‌కు వీర భక్తుడు. 2014 టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా దూకుడు ప్రదర్శించి తనదైన బ్రాండ్ వేసుకోగలిగారు. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే అనిల్ వీర విధేయతకు పట్టంగట్టారు జగన్. మొదటి విడతలోనే ఆయనకి కీలకమైన జల వనరుల శాఖను అప్పజెప్పారు. మంత్రిగా ఉన్న సమయంలో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో అనిల్ తనదైన శైలిలో చక్రం తిప్పే ప్రయత్నం చేశారు. అనిల్‌కుమార్ యాదవ్ , శ్రీధర్ రెడ్డి, రూప్ కుమార్‌యాదవ్‌ల టీం.. అప్పటి మాజీ మంత్రి కాకాణికి వ్యతిరేకంగా గట్టిగానే పనిచేసింది. రెండో విడతలో కాకాణి మంత్రి అవ్వడంతో వారి మధ్య విభేదాలు ఒక్కసారిగా బయటికి వచ్చాయి. అలాగే అప్పుడు అనీల్ పక్కనున్న నేతలు కూడా ఆయనకు దూరమయ్యారు.

నెల్లూరు సిటీలో తన అనుచరులను కాపాడుకుంటూ వస్తున్న నగర ఎమ్మెల్యే అనిల్ యాదవ్ ఒక్కసారిగా నియోజకవర్గం మారతారన్న ప్రచారం మొదలైంది. ఆయన నరసరావుపేట ఎంపీ అభ్యర్ధిగా వెళ్తారన్న ప్రచారంతో అనిల్ అనుచరుల్లో గుబులు మొదలైందంట. అటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇటు అధికారంలో ఉన్నప్పుడు అనిల్ దూకుడుకి తగ్గట్లు ఆయన వెంట నడిచిన కార్యకర్తలు.. ఆయన వెళ్లిపోతే తమ పరిస్థితి ఏంటా అని ఆందోళన చెందుతున్నారంట. తర్వాత ఎవరు వస్తారో?.. అనిల్ కుమార్ లాగా దూసుకు వెళ్లేవారు వస్తారా లేదా అన్న ఉత్కంఠ వారిలో కనిపిస్తోంది.


మరో వైపు నెల్లూరు ఫైర్ బ్రాండ్ అనీల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీ నుంచే పోటీ చేస్తానని పదేపదే అంటుంటారు. అదే సమయంలో జగన్ ఎక్కడి నుంచి పోటీ చేయమన్న చేస్తానని కూడా చెప్తుంటారు. ఒకవేళ నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ పోటి చేస్తే నెల్లూరు సిటీలో ఉన్న అనిల్ వర్గం పరిస్థితి ఏంటి..! కొత్తగా వచ్చే ఇన్చార్జి అనిల్ వర్గాన్ని దగ్గరికి తీస్తారా?.. అనిల్‌తో వర్గం వైసీపీలో ఉంటుందా? వేరే ప్రత్యామ్నాయం వెతుకుంటుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఇక అనిల్ కుమార్ యాద‌వ్‌కి జిల్లా వైసీపీ ముఖ్య నేత‌ల‌కు మధ్య ఏర్ప‌డ్డ అగాధం పార్టీని ఇబ్బంది పెడుతుంద‌ని రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి వ‌ర్గం అంటోంది. 2019 లో అనిల్ గెలుపుకి అన్ని విధాలా స‌హ‌క‌రించిన వేమిరెడ్డికి అనిల్ కి మ‌ధ్య కూడా చాలా కాలంగా గ్యాప్ పెరిగింది. వివిధ కార‌ణాల‌తో వేమిరెడ్డితో అనిల్ విభేధిస్తూ వస్తున్నారు. అందుకే నెల్లూరు సిటీ అభ్య‌ర్థిని మార్చాలని వేమిరెడ్డి గ‌ట్టిగా ప‌ట్టుప‌డుతున్నారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగనున్న వేమిరెడ్డి పట్టబట్టడం వల్లే అనిల్‌కు స్థానచలనం తప్పడంలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీని వదిలి నరసరావుపేటకు వెళ్తున్నారన్న ప్రచారంతో ఆయన స్థానంలో తెరపైకి పలువురు పేర్లు వస్తున్నాయి. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి వంటి కీలక నేతల పేర్లు టికెట్ రేసులో ఫోకస్ అవుతున్నాయి. మరి చూడాలి అనిల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో..?

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×