EPAPER
Kirrak Couples Episode 1

Andhra Pradesh : వైసీపీలో ఏం జరుగుతోంది..? వై నాట్ 175 సాధ్యమేనా?

Andhra Pradesh : వైసీపీలో ఏం జరుగుతోంది..? వై నాట్ 175 సాధ్యమేనా?
ysrcp latest news today

YSRCP latest news today(AP news today telugu):

ఆళ్ల వ్యవహారం వైసీపీని షేక్ చేస్తోంది. ఇందతా జస్ట్ ట్రైలర్ అంటున్నారు జగన్. మున్ముందు సినిమా మరింత రంజుగా ఉంటుందని చెప్పకనే చెబుతున్నారు. 11మంది ఇంచార్జ్ లను మార్చి వైసీపీ నేతలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన జగన్.. భవిష్యత్లో దెనికైనా రెడీగా ఉండాలని చెప్పకనే చెబుతున్నారు.


వైసీపీ నేతలతో పాటు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి కూడా పదేపదే ఒక మాట చెబుతూ ఉంటారు. అదే వైనాట్‌ 175. మరి ఆయన చెబుతున్నట్టు వై నాట్ 175 సాధ్యమా? లేకుంటే విపక్షాలు చెబుతున్నట్టు ఘోర ఓటమి తప్పదా? ఇదే ప్రశ్న.. వైసీపీ శ్రేణులతో పాటు ఏపీ ప్రజల్లోనూ తలెత్తుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం.. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉండటం, పార్టీ పరంగా వరుసగా ముంచుకొస్తున్న సంక్షోభాలు. దీంతో జగన్ తన స్టైల్‌ మార్చేశారని టాక్‌ వినిపిస్తోంది. అందుకే కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 40 నుంచి 50 మంది అభ్యర్థులను మార్చి రెండోసారి గెలిచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

తెలంగాణలో కేసీఆర్ చేసిన తప్పు.. ఏపీలో రిపీట్ కాకుండా చూసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా కొంతమంది సీనియర్లు, మంత్రులు, సన్నిహితులకు జలక్ ఇస్తున్నారు. అయితే ఈ పరిణామాలు వైసీపీని కుదిపేస్తున్నాయి. ఇన్నాళ్లు సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని జగన్ చెప్పుకొచ్చారు. 80 శాతానికిపైగా లబ్ధిదారులు తమతోనే ఉన్నారని సర్వేల్లో తేలినట్లు పార్టీ శ్రేణులకు చెప్పుకొచ్చేవారు. అయితే ఇప్పుడు ఏకంగా 11 నియోజకవర్గాల్లో కొత్త ఇన్చార్జిలను ప్రకటించడం దేనికి సంకేతం.


అంతేకాదు జగన్ కు అత్యంత సన్నిహితుడైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకి రాజీనామా చేశారంటే పరిస్థితి ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు. పత్తిపాడుకు బాలసాని కిషోర్, కొండేపికి ఆదిమూలపు సురేష్, చిలకలూరిపేటలో రాజేష్ నాయుడు, గుంటూరు పశ్చిమకు విడదల రజనిని ఇంచార్జ్లుగా నియమించారు జగన్. ఇక తాడికొండకు సుచరిత, వేమూరుకు వరికూటి అశోక్‌బాబు, సంతనూతలపాడుకు మంత్రి మేరుగ నాగార్జునను పంపించారు. మంగళగిరికి గంజి చిరంజీవి, అద్దంకికి పాణెం హనిమిరెడ్డి, గాజువాకకు రామచంద్రరావు, రేపల్లెకు గణేష్‌‌లను ఇన్‌ఛార్జులుగా నియమించారు.

ఏపీలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టుగా జగన్‌కు సర్వే రిపోర్టులు అందాయి. దాదాపు 100 చోట్ల సిట్టింగులు గెలవలేరని సర్వేలో తేలినట్లు తెలుస్తోంది. ఇంటర్నల్‌ సర్వేల్లో వైసీపీ ఓటమి తప్పదని రిపోర్టులు వస్తుండటంతో జగన్‌కు టెన్షన్‌ పట్టుకుందని అర్థమవుతోంది.

అందుకే జగన్ నియోజకవర్గాల అభ్యర్థుల మార్పు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఏకంగా మంత్రుల స్థానాలనే మార్చడం సంచలనం అవుతుంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే అయినా మంత్రి ఆదిమూలపు సురేష్‌కు ఈసారి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని సర్వేలో తేలింది. దీంతో ఆయనను కొండేపికి పంపారు. వేమూరులో మంత్రి మేరుగ నాగార్జున, సంతనూతలపాడు లో టీజీ ఆర్ సుధాకర్ బాబు ఓడిపోతారని పలు సర్వేల్లో చెప్పడంతో.. సుధాకర్ బాబును ఏకంగా తప్పించారు.

నాగార్జునను సంతనూతలపాడుకు పంపించారు. ప్రత్తిపాడు నుంచి పోటీ చేస్తే సుచరితకు ఓటమి తప్పదని ఐప్యాక్ టీం నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆమెను తాడికొండకు పంపించారు. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న ఉండవల్లి శ్రీదేవి ఇప్పటికే పార్టీని వీడారు. ఆమె స్థానంలో అంతకుముందే ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ను ఇన్చార్జిగా నియమించారు. శ్రీదేవి ఒత్తిడి పెంచడంతో ఆయనను తొలగించారు. ఆమె సస్పెన్షన్ తర్వాత కత్తి సురేష్ ను ఇంచార్జిగా పెట్టారు. ఇప్పుడు సుచరితను నియమించడంతో ఆయన సైతం బయటకు వెళ్లాల్సిన పరిస్థితి.

ఉమ్మడి విశాఖ జిల్లాలో భారీగా మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. గాజువాక ఇంచార్జ్‌ మార్పుతో ఉత్తరాంధ్ర వైసీపీలో టెన్షన్‌ పట్టుకుంది. అరకు, పాడేరు, అనకాపల్లి, పాయకరావుపేటలోనూ మార్పులు ఖాయమని తెలుస్తోంది. ఇచ్చాపురం, పాతపట్నం, ఎచ్చెర్ల, చోడవరంపైనా జగన్‌ కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. అరకుకు సంబంధించి ఎంపీగా ఉన్న మాధవితో పాటు పసుపులేటి బాలాజీ పేర్లను జగన్‌ పరిశీలిస్తున్నారు. పాడేరుకు విశ్వేశ్వర్‌రాజును, అనకాపల్లికి బుడేటి సత్యవతి లేదా దాడి రత్నాకర్‌ పేర్లను జగన్‌ ఆలోచిస్తున్నారు. చోడవరంలో కూడా కొత్త ఇంచార్జ్‌ నియామకానికి కసరత్తు చేస్తున్నారు సీఎం జగన్‌. పాయకరావుపేటలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న గొల్ల బాబూరావును కూడా తప్పిస్తారని టాక్.

ఈ నేపథ్యంలో పాయకరావుపేట, అనకాపల్లి, వైజాగ్ ఈస్ట్, వెస్ట్‌ స్థానాల్లో కొత్త అభ్యర్థులు ఖాయం అంటున్నారు. అనకాపల్లి పార్లమెంట్‌ స్థానానికి మంత్రి అమర్‌నాథ్‌ను పంపిస్తారని.. ఆ టికెట్‌ రేసులో సత్యవతి ఉన్నట్టు తెలుస్తోంది. వైజాగ్‌ ఎంపీగా సత్యనారాయణను తప్పించి.. విశాఖ తూర్పు స్థానం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దించే అవకాశాలు ఉన్నాయి.

వైజాగ్‌ వెస్ట్‌ నుంచి అడారి ఆనంద్‌, ఇచ్చాపురంలో ఓ బీసీకి టికెట్‌ ఇవ్వనున్నారని టాక్‌ వినిపిస్తోంది. పాతపట్నంలో రెడ్డిశాంతిని మార్చి.. ఎచ్చెర్లలో చిన్నశ్రీను, బెల్లం చంద్రశేఖర్‌ పేర్లు జగన్‌ పరిశీలనలో ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి దువ్వాడ వాణిని బరిలో దింపే అవకాశాలను జగన్‌ పరిశీలిస్తున్నారు. ఆముదాలవలస నుంచి తమ్మినేనిని మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఎస్‌కోట సిట్టింగ్‌ ఎమ్మెల్యే శ్రీనివాసరావు, రాజాం నుంచి కంబాల జోగులును జగన్‌ తప్పిస్తారని జిల్లాలో ప్రచారం ఉంది.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి, సత్యవేడు, చంద్రగిరి, మదనపల్లి, పలమనేరు, పూతలపట్టు స్థానాల్లో అభ్యర్థుల మార్పు ఉంటుందని జిల్లాలో జోరుగా ప్రచారం. తిరుపతి నుంచి భూమన తనయుడు అభినయ్‌కు ఛాన్స్‌ ఇవ్వనున్నారు. సత్యవేడులో ఆదిమూలం, మదనపల్లిలో నవాజ్‌ బాషాను తప్పిస్తారని.. తెలుస్తోంది. చంద్రగిరి నుంచి చెవిరెడ్డి స్థానంలో ఆయన కుమారునికి అవకాశం ఇస్తారని టాక్‌ ఉంది. పలమనేరులో ఎమ్మెల్యే వెంకట్‌ గౌడ్‌, జడ్పీ ఛైర్మన్‌ వాసు మధ్య పోటీ నెలకొంది. ఇక పూతలపట్టు టికెట్‌ కోసం మాజీ ఎమ్మెల్యే సునీల్ ప్రయత్నిస్తున్నారు. వెస్ట్‌ గోదావరి జిల్లాలో చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజాతో పాటు పోలవరం ఎమ్మెల్యే బాలరాజు మారుస్తారని ప్రచారం ఉంది. ఇక కైకలూరులో సిట్టింగ్‌ ఎమ్మెల్యే దూళం నాగేశ్వరరావు స్థానంలో జయమంగళంకు అవకాశం ఇస్తారని చర్చ నడుస్తోంది.

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కదిరి, మడకశిర, పెనుకొండ, హిందుపురం, రాయదుర్గం, కళ్యాణ దుర్గం, పుట్టపర్తి నియోజకవర్గాల్లో మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉమ్మడి కడప జిల్లాలో కమలాపురం, మైదుకూరు,బద్వేలు నియోజకవర్గాల్లోనూ ఛేంజెస్‌ పక్కా అని చర్చ నడుస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లా కొడమూరు, నంది కొట్కూరు, ఆదోని, పత్తికొండ నియోజకవర్గాల్లో మార్పులకు అవకాశం ఉందని తెలుస్తోంది. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబును కాకినాడ ఎంపీగా పంపే ఛాన్స్‌ ఉంది. పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు స్థానంలో వంగా గీతకు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. అమలాపురంలో విశ్వరూప్ స్థానంలో ఆయన కొడుకు శ్రీకాంత్‌కు టికెట్‌ ఇస్తారని చర్చ ఉంది. విజయవాడ సెంట్రల్‌, విజయవాడ పశ్చిమ, తిరువూరు, పెడన, నందిగామ, పామర్రు, మైలవరం ఎమ్మెల్యేలను కూడా మార్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఎన్నికల కదనరంగంలో గట్టి పోటీ వైసీపీ, టీడీపీ-జనసేన మధ్యే. దీంతో జనసేనాని గతంలో పోటీ చేసిన గాజువాక నియోజకవర్గం, లోకేష్‌ బరిలో నిలిచిన మంగళగిరిని ప్రధానంగా టార్గెట్‌ చేశారు జగన్‌. ఆ రెండు నియోజకవర్గాల్లోనూ వైసీపీ హవా నడిచిన్పటికీ.. ఈసారి కొత్త ఇన్‌చార్జ్‌లను రంగంలోకి దించడం హాట్‌ టాపిక్‌ అయింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పవన్, లోకేష్‌కు ప్లస్‌ కాకూడదన్నది జగన్ వ్యూహం. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎమ్మెల్యేల పని తీరుపై జగన్ ఫోకస్‌ పెట్టారని తెలిసిపోతోంది. గడిచిన 6 నెలలుగా 6సార్లు సర్వేలు నిర్వహించారు. ప్రతీ సర్వేలో ఆళ్లకు 30 శాతం మాత్రమే ఫలితాలు రావడం.. లోకేష్‌కు 40 నుంచి 56 శాతం అనుకూలంగా ఉన్నట్టు ఫలితాలు రావడంతో ఆళ్లను పక్కన పెట్టాలన్న నిర్ణయానికి వచ్చారు జగన్‌. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన ఆర్కే రాజీనామా చేసి తప్పుకున్నారు. అయితే ఆర్కే రాజీనామా వెనక డిఫరెంట్‌ వెర్షన్స్‌ వినిపిస్తున్నాయి.

కిందటి ఎన్నికల్లో నారా లోకేశ్‌ను ఓడించింది ఆళ్ల రామకృష్ణారెడ్డే! గత కొద్ది కాలంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నిజానికి ఆళ్ల మంత్రి పదవి ఆశించారు. మంత్రి పదవి ఇస్తానని జగన్‌ కూడా హామీ ఇచ్చారు. కాని ఇచ్చిన హామీని జగన్‌ నిలబెట్టుకోలేదు. ఆళ్లకు మంత్రి పదవి ఇవ్వలేదు. అప్పట్నుంచే ఆళ్లలో అసంతృప్తి బీజం పడింది. తర్వాత తన సోదరుడు ఆళ్ల ఆయోధ్య రామిరెడ్డికి రాజ్యసభ సభ్యత్వాన్ని ఇవ్వడంతో కొన్నాళ్ల పాటు పార్టీ పట్ల విధేయుడిగానే ఉన్నారు. మంత్రి వర్గ విస్తరణలో తనకు తప్పక అవకాశం లభిస్తుందని భావించారు. అప్పుడు కూడా ఆళ్లకు నిరాశే ఎదురయ్యింది. ఆ తర్వాత ఆయన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీ పట్ల, అధినేత పట్ల అసంతృప్తితో ఉన్నారనే వార్తలు చాలానే వచ్చినప్పటికీ ఎప్పుడూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, జగన్‌కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

పార్టీలో తనకు బాగానే ఉందని, జగన్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, పార్టీ టికెట్‌ ఇస్తే మళ్లీ పోటీ చేస్తానని రామృష్ణారెడ్డి పలు సందర్భాలలో చెప్పిన విషయం తెలిసిందే. ఆళ్ల అసంతృప్తికి మంత్రి పదవో, మరోటో కాదు. తనకు తెలియకుండా నియోజకవర్గానికి సంబంధించి, నియోజవర్గంలో పార్టీకి సంబధించిన కొన్ని నిర్ణయాలు తనకు తెలియకుండా జరుగుతున్నాయన్నది ఆళ్ల రామకృష్ణారెడ్డి భావన. గంజి చిరంజీవి నియోజకవర్గంలో చక్రం తిప్పడం.. తనకు తెలియకుండ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం లాంటి పనులతో ఆళ్ల రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఆళ్ల వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసి ఉండవచ్చని తన సోదరుడు అయిన అయోధ్యరామిరెడ్డి చెప్పడం ఇక్కడ గమనించాల్సిన విషయం.

మొత్తంగా సార్వత్రిక ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయని సర్వేల్లో తేలడంతో వైసీపీ పెద్దల్లో కలవరం కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందనుకున్నచోట, బలమైన టీడీపీ నేతలు పోటీ చేస్తున్న చోట్ల సిట్టింగులను పక్కకు పెట్టాలని డిసైడ్ అయ్యారు. అయితే వారిని కనీసం సంప్రదించకుండా మార్పు చేస్తుండడంతో వారు జీర్ణించుకోలేకపోతున్నారనేది ఇంటర్నల్‌ టాక్‌. కానీ వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలవదని భావించేవాళ్లే బయటకు వెళ్తున్నారనే మరోవాదన కూడా వినిపిస్తోంది.

.

.

Related News

Waiting For Help: సీఎం గారూ.. నా కొడుకును బ్రతికించండి, ఓ తల్లి కన్నీటి వ్యథ

Cm Chandrababu : శభాష్… చాలా మంచి పని చేశారు, ప్రజలను మెచ్చుకున్న సీఎం చంద్రబాబు

Pawan Kalyan: పవన్‌కు అస్వస్థత, ఆ సమస్య తిరగబడిందా?

Kadambari jethwani case : ముంబయి నటి కాదంబరి కేసులో కీలక పరిణామం… నేడో రేపో సీఐడీ చేతికి ?

AP Govt: దసరాకు సూపర్ కానుక ప్రకటించిన ప్రభుత్వం.. మీరు మాత్రం మిస్ చేసుకోవద్దు

Home Minister: కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా?.. అయితే ఈ శుభవార్త తెలుసా..?

Pawan Klayan: వైసీపీకి ఝలక్ ఇచ్చిన పవన్.. విచారణ ఎదుర్కోవాల్సిందే.. రెడీగా ఉండండి అంటూ ప్రకటన

Big Stories

×