EPAPER

MLC : మే 1 లోపు 21 ఎమ్మెల్సీ ఖాళీలు.. అన్ని స్థానాలు వైసీపీకే దక్కుతాయా..?

MLC : మే 1 లోపు 21 ఎమ్మెల్సీ ఖాళీలు.. అన్ని స్థానాలు వైసీపీకే దక్కుతాయా..?

MLC : ఏపీలో శాసన మండలి ఎన్నికల సందడి మొదలుకాబోతోంది. మే 1 లోపు 21 స్థానాలు ఖాళీకానున్నాయి. మొత్తం స్థానాలన్నీ కైవసం చేసేందుకు సీఎం వైఎస్ జగన్ వ్యూహ రచన చేస్తున్నారు. ఎమ్మెల్యేల కోటాలో 7 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వాటిలో వైసీపీకి చెందిన ఐదుగురు, టీడీపీ సభ్యులు ఇద్దరు ఉన్నారు. 151 ఎమ్మెల్యేలున్న వైసీపీ మొత్తం ఈ ఏడు స్థానాలను కైవసం చేసుకునే ఛాన్స్ ఉంది. స్థానిక సంస్థల కోటాలో 9 మంది సభ్యుల పదవీకాలం ముగియనుంది. ఈ 9 మంది సభ్యులు టీడీపీకి చెందినవారే. వాటిని కైవసం చేసుకునేందుకు వైసీపీ అధిష్టానం పావులు కదుపుతోంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు 85 శాతం సీట్లు వైసీపీ సాధించింది. దీంతో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాల గెలుపు ఖాయమనే నిర్ణయానికి వచ్చింది.


మొత్తం 21 ఎమ్మెల్సీ ఖాళీలుండగా.. సీఎం జగన్ వాటిలో ఒకటి ఎస్టీలకు కేటాయిస్తారని వార్తలు వస్తున్నాయి. బీసీల్లోనూ ఇప్పటివరకూ అవకాశం దక్కని సామాజికవర్గాలకు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికైన డొక్కా మాణిక్య వరప్రసాద్‌, పోతుల సునీత, గంగుల ప్రభాకర్‌రెడ్డి, సూర్యనారాయణరాజు, దివంగత చల్లా భగీరథరెడ్డి పదవీ కాలం మార్చి 29తో ముగియనుంది. వీరిలో డొక్కా, పోతుల సునీతను మళ్లీ కొనసాగించే అవకాశముందని అంటున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన సూర్యనారాయణరాజును కొనసాగించడం అనుమానమేనని వైసీపీ వర్గాలు అంటున్నాయి. అదే జిల్లా నుంచి ఆయన సామాజిక వర్గానికే చెందిన రఘురాజు ఎమ్మెల్సీగా ఉన్నారు.

తండ్రి చల్లా రామకృష్ణారెడ్డి మృతితో ఆయన ఎమ్మెల్సీ పదవినే భగీరథరెడ్డికి ఇచ్చారు. ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులకు అవకాశమిస్తారనే చర్చ జరుగుతోంది. భగీరథరెడ్డి భార్య చల్లా శ్రీలక్ష్మి ఇటీవలే సీఎం జగన్‌ను కలిశారు. ఆమె కుటుంబానికి ఎమ్మెల్సీ అవకాశమిస్తే.. గంగుల ప్రభాకర్‌రెడ్డి కొనసాగింపుపై ప్రభావం పడనుంది. ఇదే కోటాలో టీడీపీకి చెందిన బచ్చుల అర్జునుడు, నారా లోకేశ్‌ పదవీ కాలం మార్చి 29నే ముగియనుంది. గన్నవరంలో టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పుడు వైసీపీ సమన్వయకర్తగా ఉన్నారు. టికెట్‌ విషయంలో ఆయనతో యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు పోటీ పడుతున్నారు. గన్నవరంలో యార్లగడ్డ లేదా దుట్టాల్లో ఒకరికి ఎమ్సెల్సీ ఇవ్వచ్చన్న చర్చ జరుగుతోంది.


అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు సీఎం జగన్ కొందరికి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తారంటున్నారు. విజయవాడ తూర్పులో దేవినేని అవినాష్‌కు టికెట్‌ ఖరారు చేశారు. గత ఎన్నికల్లో అక్కడ నుంచి పోటీ చేసిన బొప్పన భవకుమార్‌ ను పిలిచి జగన్ మాట్లాడారు. మండపేటలో తోట త్రిమూర్తులును అభ్యర్థిగా ఖరారు చేశారు. అక్కడ కీలకంగా ఉన్న పట్టాభిరామయ్య చౌదరిని సీఎం పిలిచి మాట్లాడారు. వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

పర్చూరు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త పదవి నుంచి రావి రామనాథంబాబును తొలగించి ఆమంచి కృష్ణమోహన్‌ను ఇటీవల నియమించారు. ఆ తర్వాత రామనాథంబాబు.. సీఎం జగన్ ను కలిసినప్పుడు ఎమ్మెల్సీ పదవిపై భరోసా ఇచ్చారంటున్నారు. మర్రి రాజశేఖర్‌, మేకా శేషుబాబు, నర్తు రామారావు, జంకె వెంకటరెడ్డి ఆశావహుల జాబితాలో ఉన్నారు. మొత్తంమీద ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మండలిలో వైసీపీ బలం మరింత పెరగనుంది. అదే సమయంలో టీడీపీ సభ్యుల సంఖ్య బాగా తగ్గనుంది. ఇప్పటికే ఏపీలో రాజకీయాలు కాకమీదున్నాయి. మరి వేసవిలో జరిగే ఎమ్మెల్సీ పోరు రాష్ట్ర రాజకీయాలను మరింత హీటెక్కించడం ఖాయం.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×