EPAPER

MahabubNagar: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా.. కాంగ్రెస్‌ క్లీన్‌ స్వీప్‌

MahabubNagar: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా.. కాంగ్రెస్‌ క్లీన్‌ స్వీప్‌
MahabubNagar News

MahabubNagar News(Telangana politics):

రేవంత్‌ రెడ్డి సొంత జిల్లా అయిన ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ దూసుకెళ్లింది. మొత్తం 14 నియోజకవర్గాలు ఉండగా 12 స్థానాల్లో సత్తా చాటింది. గత ఎన్నికల్లో 13 చోట్ల గెలిచిన బీఆర్‌ఎస్‌.. ఈ సారి కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఇద్దరు మంత్రులతో పాటు ఓ చీఫ్ విప్‌ను కూడా ఓడించింది హస్తం పార్టీ. కొడంగల్‌లో రేవంత్ రెడ్డి, కల్వకుర్తిలో కసిరెడ్డి నారాయణరెడ్డి, కొల్లాపూర్‌లో జూపల్లి లాంటి ప్రముఖులు విజయం సాధించగా.. కొత్తగా మేఘా రెడ్డి, పర్ణికా రెడ్డి, రాజేశ్ రెడ్డి, శ్రీహరి లాంటి నాయకులు తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు పట్టం కట్టిన ఉమ్మడి పాలమూరు ఓటర్లు.. ఈ సారి కాంగ్రెస్‌కు జై కొట్టారు.


ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని నాగర్ కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. జిల్లా కేంద్రమైన నాగర్ కర్నూల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్థన్ రెడ్డిపై కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడైన రాజేశ్ రెడ్డి 5వేల 248 ఓట్ల తేడాతో విజయం సాధించి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన సీనియర్ లీడర్ కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తిలో విజయం సాధించారు. సమీప బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారిపై 5వేల 410 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక కొల్లాపూర్ ఓటర్లు మరోసారి జూపల్లి కృష్ణారావుకే పట్టంకట్టారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన జూపల్లి.. ఈ సారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇక్కడ జూపల్లి దాదాపు 30వేల ఓట్లతేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డిపై గెలుపొందారు.

అచ్చంపేటలో చీఫ్ విప్ గువ్వల బాలరాజుపై కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గెలుపొందారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వరుసగా రెండుసార్లు ఓటమి పాలైన వంశీకృష్ణ ఈ సారి ఏకంగా 50వేలకు పైగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్‌కు బలమైన ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ.. గువ్వల బాలరాజు ఒంటెద్దు పోకడలతో క్యాడర్ దెబ్బతిన్నట్లు అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఈ కారణంగానే అచ్చంపేటలో బాలరాజు ఓడిపోయారనే ప్రచారం కొనసాగుతోంది.


కొడంగల్, నారాయణపేటలో కాంగ్రెస్ సత్తా చాటింది. కొడంగల్ నియోజకవర్గంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భారీ మెజారిటీని సాధించారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన రేవంత్ రెడ్డి.. ఈ సారి పట్నం నరేందర్ రెడ్డికి షాకిచ్చారు. ఆయనపై రేవంత్ రెడ్డి 32 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక నారాయణపేటలో కూడా కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక్కడి నుంచి పోటీ చేసిన చిట్టెం పర్నిక రెడ్డి దాదాపు 8వేల ఓట్లతేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి రాజేందర్ రెడ్డిపై గెలుపొందారు.

గత ప్రభుత్వంలో ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి ఇద్దరు మంత్రులుగా పనిచేశారు. ఒకరు మహబూబ్‌నగర్ నుంచి శ్రీనివాస్ గౌడ్ కాగా, వనపర్తి నుంచి సీనియర్ లీడర్ నిరంజన్ రెడ్డి. వ్యవసాయ మంత్రిగా నిరంజన్ రెడ్డి, ఎక్సైజ్ మంత్రిగా శ్రీనివాస్ గౌడ్ పనిచేశారు. అయితే ఈ సారి ఆ ఇద్దరిని ఇక్కడి ఓటర్లు ఓడించారు. ముఖ్యంగా నిరంజన్ రెడ్డికి కోలుకోలేని షాక్‌ ఇచ్చారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మేఘా రెడ్డి చివరి నిమిషంలో టికెట్ దక్కించుకొని విజయం సాధించారు. అప్పటికే సీనియర్ లీడర్ చిన్నారెడ్డికి టికెట్ ఇవ్వగా.. ఆ తర్వాత మేఘా రెడ్డి టికెట్ దక్కించుకొని అధిష్టానానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో మేఘా రెడ్డి 25 వేల 320 ఓట్ల తేడాతో మంత్రి నిరంజన్ రెడ్డిపై గెలుపొందారు. మరోవైపు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ఓటమి పాలయ్యారు. మహబూబ్‌నగర్ నుంచి ప్రాతినిథ్యం వహించిన శ్రీనివాస్ గౌడ్‌ను యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఓడించారు. శ్రీనివాస్ గౌడ్‌పై యెన్నం 18వేల 738 ఓట్ల తేడాతో గెలుపొందారు.

ఉమ్మడి మహబూబ్ నగర్‌లోని గద్వాల జిల్లాలో కారు జోరు కొనసాగింది. గద్వాల, అలంపూర్ స్థానాలను బీఆర్ఎస్ కాపాడుకుంది. గద్వాలలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 7వేల 36 ఓట్ల తేడాతో సమీప కాంగ్రెస్ అభ్యర్థి సరితపై గెలుపొందారు. ఇక అలంపూర్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేకి కాకుండా మరో అభ్యర్థికి టికెట్ ఇచ్చినప్పటికీ.. బీఆర్ఎస్ ఆ స్థానాన్ని కాపాడుకుంది. విజేయుడు 30వేల 573 ఓట్లతేడాతో కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్‌పై గెలుపొందారు.

జడ్చర్ల, షాద్‌నగర్, మక్తల్, దేవరకద్ర నియోజకవర్గాల్లో కాంగ్రెస్ దూసుకెళ్లింది. ఈ నాలుగు నియోజక వర్గాల్లో ఉన్న బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ విజయఢంకా మోగించింది. షాద్‌నగర్‌లో బి. శంకరయ్య 7వేల 128 ఓట్ల తేడాతో సమీప బీఆర్ఎస్ అభ్యర్థి అంజయ్యపై గెలుపొందారు. ఇక జడ్చర్లలో సీనియర్ లీడర్ లక్ష్మారెడ్డికి కూడా ఓటమి తప్పలేదు. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి అనిరుద్ రెడ్డి 15వేల 171 ఓట్ల తేడాతో లక్ష్మారెడ్డిపై విజయం సాధించారు. అలాగే మక్తల్‌లో వాకిటి శ్రీహరి సీనియర్ లీడర్ చిట్టెం రాంమోహన్ రెడ్డిపై గెలుపొందారు. ఆయన 17 వేల 525 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక దేవరకద్రలో ఆల వెంకటేశ్వర్ రెడ్డికి షాకిచ్చారు కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి. ఆయన 13వందల 92 ఓట్ల తేడాతో ఆల వెంకటేశ్వర్ రెడ్డిపై గెలుపొందారు.

Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×