EPAPER
Kirrak Couples Episode 1

Henry Kissinger : అలుపెరగని రాయబారి.. కిసింజర్..!

Henry Kissinger : అలుపెరగని రాయబారి.. కిసింజర్..!
Henry Kissinger

Henry Kissinger : హెన్రీ కిసింజర్‌… ఈ తరంలో చాలామందికి తెలియని పేరు! అమెరికా మాజీ విదేశాంగ మంత్రి. ఆ దేశ చరిత్రలో లింకన్‌లాంటి మాజీ అధ్యక్షులకు ఉన్నంత పేరు ప్రఖ్యాతులున్న రాజకీయ శక్తి! ఇప్పటికీ చైనా ఎంతో గౌరవించే దౌత్యయుక్తి కిసింజర్‌! కారణం- 1970ల్లో ప్రచ్ఛన్నయుద్ధం వేళ… కమ్యూనిస్టు సోవియట్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా మావోయిస్టు చైనాతో క్యాపిటలిస్టు అమెరికాకు స్నేహం కుదిర్చింది ఆయనే! 1971లో అమెరికా జాతీయ భద్రత సలహాదారు హోదాలో బీజింగ్‌లో పర్యటించిన కిసింజర్‌ రెండు దేశాల మధ్య బంధానికి బీజం వేశారు. 1979లో అమెరికా, చైనా పరస్పరం గుర్తించుకొని.. దౌత్యబంధాన్ని బలోపేతం చేసుకుంటూ వచ్చాయి. నాడు ఆయన వేసిన స్నేహ విత్తనమే మొలకెత్తి దాదాపు 50 ఏళ్లపాటు కొనసాగింది. అంతటి పేరు ప్రఖ్యాతులున్న కిసింజర్ పరిపూర్ణ జీవితాన్ని అనుభవించి నేడు.. తన 100వ ఏట కన్నుమూశారు.


కిసింజర్ 1923 మే 7న జర్మనీలో ఒక యూదు కుటుంబంలో జన్మించారు. హిట్లర్ ధాటికి భయపడి, ప్రాణాలను అరచేత బట్టుకుని తన 15వ ఏట కుటుంబ సభ్యులతో కలిసి ముందుగా ఇంగ్లాండ్, తర్వాత అమెరికాలోని న్యూయార్క్‌లో సెటిలయ్యారు. న్యూయార్క్‌లోని సిటీ కాలేజీలో చేరిన కిసింజర్.. అక్కడి షేవింగ్ బ్రష్‌ల తయారీ ఫ్యాక్టరీలో పార్ట్ టైం జాబ్ చదివాడు. 1943లో అమెరికా పౌరసత్వాన్ని పొందాడు. కొంతకాలం అమెరికా సైన్యంలోని గూఢఛారి విభాగంలో సేవలందించారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత, కొంతకాలం ఆక్రమిత జర్మనీలో జిల్లా అధికారిగానూ బాధ్యతలు నిర్వహించాడు.

తిరిగి అమెరికా చేరిన కిసింజర్.. 1946లో హార్వర్డ్ వర్సిటీలో చేరి.. 1950లో డిగ్రీని పొందాడు. 1954లో ఐరోపాలోని రాజకీయ వ్యూహాలు, విదేశాంగ విధానం అనే అంశంపై తర్వాత Ph.D పొందాడు. అదే వర్సిటీలో 17 ఏళ్ల పాటు ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆ సమయంలోనే ఆయన ప్రభుత్వ ఏజెన్సీలకు సలహాదారుగా పరిచేశారు. వియత్నాంలోని అమెరికా విదేశాంగ శాఖకు కుడిభుజంగా నిలిచారు.


నాటి అధ్యక్షుడు లిండన్‌ జాన్సన్‌ అడ్మినిస్ట్రేషన్‌లోని సత్సంబంధాలను ఉపయోగించుకొని అక్కడి సమాచారాన్ని నిక్సన్‌ వర్గాలకు చేరవేసేవారు. వియత్నాం యుద్ధానికి ముగింపు పలుకుతానని ప్రకటించి అధికారంలోకి వచ్చిన నిక్సన్‌.. ఆయనకు జాతీయ భద్రతా సలహాదారు పదవిని అప్పగించారు. 1973లో విదేశాంగ మంత్రిగానూ బాధ్యతలూ చేపట్టారు. ఆ సమయంలోనే అమెరికాకు కొత్త మిత్రుల అన్వేషణ దిశగా అడుగులు వేసి.. అమెరికా దౌత్యనీతిలో మార్పులు తీసుకొచ్చారు.

సరిగ్గా 50 ఏళ్ల కిందట.. 1973, అక్టోబరు 6న ఒకవైపు నుంచి ఈజిప్టు, మరోవైపు నుంచి సిరియా.. ఇజ్రాయైల్‌పై దాడి చేశాయి. కొత్తగా ఏర్పడి.. అమెరికా, పాశ్చాత్య దేశాల మద్దతుతో 3 సార్లు అరబ్‌ దేశాలను ఓడించి ఇజ్రాయెల్‌ మంచి ఊపుమీదున్న దశలో అనూహ్యంగా ఈ యుద్ధం వచ్చింది. ఇక్కడా అమెరికా ఇజ్రాయెల్‌కు అండగా నిలిచింది. యుద్ధం 12వ రోజుకు చేరుకోగానే అరబ్‌ దేశాలు చమురు ఉత్పత్తిని తగ్గించటంతో బాటు అమెరికాకు సరఫరాను నిలిపేయటంతో చమురు ధరలకు రెక్కలొచ్చాయి. వెంటనే నాటి విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్‌ రంగంలోకి దిగి, ఇజ్రాయెల్, అరబ్‌ దేశాల మధ్య చక్కర్లు కొడుతూ యుద్ధాన్ని ఆపించి…ప్రపంచపు అత్యుత్తమ, శక్తిమంతమైన దౌత్యవేత్తగా పేరుగాంచారు. అది కిసింజర్‌ ‘షటిల్‌ దౌత్యం’గా (కాళ్లకు బలపం కట్టుకుని తిరుగుతూ చేసిన దౌత్యం) పేరొందింది.

వియత్నాం యుద్ధానికి ముగింపు పలికి శాంతిని నెలకొల్పినందుకు గానూ 1973లో హెన్రీ కిసింజర్ నోబెల్ శాంతి పురస్కారాన్ని అందుకున్నారు. 1971లో భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధ కాలంలో తొలి దశలో పాక్‌కు మద్దతు తెలిపిన అమెరికా వైఖరిని చివరి నిమిషంలో మార్చుకునేలా చేయటంలో కిసింజర్ కీలక పాత్ర వహించారు. తాము భారత్‌కు అండగా నిలిచి ఉంటే బాగుంటేదని తర్వాతి రోజుల్లో ఆయన పశ్చాత్తాపపడ్డారు.

1971లో తన మాటను లెక్క చేయకుండా నాటి ప్రధాని ఇందిరాగాంధీ బంగ్లా యుద్ధానికి సిద్దపడటం, అద్భుత విజయాన్ని అందుకున్న సమయంలో ఆమెపై నాటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. ‘ ఆమె ఓ ముసలి మంత్రగత్తె’ అనే ఆయన నాడు వ్యాఖ్యానించారు. అయితే.. ఆమె అంటే తమకు ఎంతో గౌరవమని, ఆ వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నానీ కిసింజర్ తర్వాత బాధపడ్డారు.

Related News

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంకోర్ట్‌కి కేంద్రం ఏం చెప్పబోతోంది?

Irregularities: ఆగమవుతున్న తెలంగాణ టూరిజం.. ఇష్టారీతిన దోచేసిన మాజీ ఎండీ

TDP VS BJP: కూటమిలో చిచ్చు పెట్టిన కమిషనర్‌! ఆ అధికారి ఎవరు ?

BRS Leaders: ఏదో చేద్దాం అనుకున్నారు కానీ.! అడ్డంగా బుక్కయ్యారు

Janasena Party: బాలినేని అండతో జనసేనలోకి మరో వైసీపీ మాజీ ఎమ్మెల్యే?

Sahithi Infrastructure Fraud: ల‌క్ష్మీనారాయణ లీల‌లు.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే

Real Estate Fraud: బూదాటి పాపం పండింది..! లెక్కలతో సహా ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్

Big Stories

×