EPAPER

Rythu Bandhu : రైతు బంధు విడుదలకు ఈసీ గ్రీన్‌ సిగ్నల్‌.. తెరవెనుక కేసీఆర్ కుట్రలు

Rythu Bandhu : రైతు బంధు విడుదలకు ఈసీ గ్రీన్‌ సిగ్నల్‌.. తెరవెనుక కేసీఆర్ కుట్రలు
ec telangana

Rythu Bandhu : బీజేపీ-బీఆర్ఎస్‌ ఒక్కటే అనే విమర్శలకు మరో బలం చేకూర్చే నిర్ణయం వెలువడింది. కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో ఎన్నికల సంఘం పనిచేస్తోందనే ఆరోపణలు నిజమే అనేలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. రైతు బంధు నిధుల విడుదలపై ఈసీ డెసిషన్సే ఇందుకు కారణం. అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్ రైతు బంధు నిధుల విడుదలకు అనుమతిచ్చిన తీరు అనుమానాలకు బలం చేకూర్చేదిగా మారింది. కేసీఆర్‌ ప్లాన్‌ చేసినట్లుగానే పోలింగ్‌ డేట్‌కు దగ్గరగా రైతుల ఖాతాల్లో నగుదు జమ చేసేలా ఈసీ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం కలకలం రేపుతోంది. బీఆర్ఎస్‌ ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోవడం వల్ల రైతు బంధు సహా రుణమాఫీ నిధులు విడుదల చేయలేదు.


ఇదే విషయంపై కొద్ది రోజులుగా కాంగ్రెస్‌ పార్టీని బద్నాం చేసేందుకు బీఆర్ఎస్‌ ప్రయత్నిస్తోంది. రైతుల ఖాతాల్లో డబ్బులు పడకుండా కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారని కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌రావు గులాబీ అగ్రనేతల త్రయం తప్పించుకునే ప్రయత్నం చేసింది. దీనికి గట్టిగా బదులిచ్చిన కాంగ్రెస్‌ నేతలు ఎన్నికల నోటిఫికేషన్‌ రాకముందే ఎందుకు వేయలేదని నిలదీశారు. హైడ్రామా మధ్య అసలు తమ అనుమతి కోరుతూ బీఆర్ఎస్ నుంచి ఎలాంటి విజ్ఞప్తి రాలేదనే జవాబు వచ్చింది. ఈ ప్రకటనతో ఘోరమైన డ్యామేజ్‌ నుంచి బయటపడేందుకు గులాబీ పార్టీ ఈసీ తలుపు తట్టింది. దీనిపై రియాక్టైన ఎన్నికల సంఘం రైతుల ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు జమ చేస్తారో డేట్స్‌ ఇవ్వాలని సూచించింది. నెపం కాంగ్రెస్‌పై నెట్టేసి తప్పించుకుందామనుకుంటే ఈ పరిణామం బీఆర్ఎస్‌కు సంకటంగా మారింది. ఇక్కడే సరిగ్గా గులాబీ బాస్‌ ఈసీ నుంచి సానుకూల ఫలితం వచ్చేలా చక్రం తిప్పారనే ఆరోపణలు వస్తున్నాయి.

ఈ యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధు పంట పెట్టుబడి ఎప్పుడో రైతుల ఖాతాల్లో జమ కావాలి. నిధుల కొరత కారణంగా సీఎం కేసీఆర్ ఆ ఊసే ఎత్తలేదు. పోలింగ్‌కు రెండు రోజుల ముందు ఆర్థిక సాయం విడుదల అయ్యేలా కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలపడం అనుమానాలకు తావిచ్చేదిలా మారింది. రైతుబంధు సాయాన్ని ఖాతాల్లో డీబీటీ పద్ధతిలో విడుదల చేసేందుకు ఈసీ అనుమతిచ్చింది. ఇందులో కూడా కేసీఆర్‌ మాస్టర్‌ ప్లాన్‌ అమలు చేశారు. కొద్ది రోజుల క్రితం కేటీఆర్‌ కూడా ఇదే చెప్పారు. పోలింగ్‌కు ముందు చక్రం తిప్పుతామని కామెంట్స్‌ చేశారు. రైతుల ఖాతాల్లో చివరి నిమిషంలో డబ్బులు వేస్తామని అన్నారు.


ఇప్పుడు ఈసీ నుంచి రైతు బంధు నిధుల విడుదలకు లభించిన మద్దతు కూడా కేటీఆర్ వ్యాఖ్యలను బలపరుస్తోంది. పోలింగ్ ముందు రోజు అంటే ఈనెల 29న, పోలింగ్ రోజు అంటే ఈనెల 30న రైతు బంధు పంపిణీ డబ్బులు అకౌంట్లలో వేయకూడదని ఈసీ ఆదేశించింది. ఈ నిర్ణయం కూడా బీఆర్ఎస్‌కు పూర్తిగా కలిసి వచ్చేలా ఉంది. మూడు రోజులు వరుసగా బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ఎన్నికలకు ముందే డబ్బులు రైతుల అకౌంట్లలో జమ చేయాలంటే ఈ నెల 28 లోపు పంపిణీ పూర్తి చేయాలి. అంటే అఫీషియల్‌గా అన్నదాతలను ప్రలోభపెట్టే కుట్రకు ఈసీ కూడా సపోర్ట్‌ చేసిందని క్లియర్‌గా కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.

గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఎకరా చొప్పున అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ చేసేది. ముందు ఒక ఎకరా ఉన్న రైతులకు నగదు జమ చేస్తూ వరుసగా రెండు, మూడు, నాలుగు ఎకరాల చొప్పున పంపిణీ జరిగేది. మరి ఈనెల 28న ఒకేరోజు అవకాశం ఉండటం వల్ల ఈ ఎత్తుగడను కూడా బీఆర్ఎస్‌ తమకు అనుకూలంగా మార్చుకుంటుందా అనే టాక్‌ నడుస్తోంది. ఈనెల 28న ఎంతమంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తారనేదే తేలాల్సి ఉంది. నిధులు లేకపోయినా రైతు బంధు జమ చేసేందుకు ప్రయత్నించామని జనంలో సానుకూలత వ్యక్తమయ్యేలా చేస్తారా అనే చర్చ జరుగుతోంది. ఒక్క ఎకరం ఉన్న రైతుల ఖాతాల్లోనే డబ్బులు వేసి చేతులు దులుపుకుంటారా అనేది తేలాల్సి ఉంది. నాలుగు లేదంటే ఐదు ఎకరాల వరకు ఎక్కువ మంది రైతులు లబ్ధిదారులుగా ఉన్నారు.

అంతవరకు ఒకే రోజు ఖాతాల్లో నగదు జమ చేసేందుకు కేసీఆర్‌ సర్కార్‌ వ్యూహాలు రచిస్తోందనే టాక్‌ కూడా వినిపిస్తోంది. లేదంటే గతానికి భిన్నంగా ఒకేసారి నిధులు మొత్తం అన్నదాతల ఖాతాల్లో వేసి ప్రలోభ పెట్టి ఓట్లు దండుకుంటుందా అనేది తేలాల్సి ఉంది. ఎకరానికి 5 వేల చొప్పున మొత్తం 70 లక్షల రైతుల ఖాతాల్లో దాదాపు 7 వేల 700 కోట్లను జమ చేయాల్సి ఉంటుంది. ఈ సారి పోడు భూముల రైతులకు కూడా రైతు బంధు అందిస్తామని బీఆర్‌ఎస్ ప్రభుత్వం చెబుతోంది.

రైతుల పట్ల బీఆర్ఎస్‌కు ఎంత చిత్తశుద్ధి ఉందనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. రుణ మాఫీ విషయంలో ఈసీని అనుమతి కోరకపోవడం ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. రుణమాఫీపై ఐదేళ్లుగా చేతులెత్తిసిన బీఆర్ఎస్‌ ప్రభుత్వం చివర్లో ప్రక్రియ మొదలు పెట్టి డ్రామాను రక్తికట్టించింది. చివరకు నిధులు లేక నెపం కాంగ్రెస్‌పై మోపింది. రైతు బంధుపైనా ఇలాగే తప్పుడు ప్రచారం చేసింది. రైతు బంధుకు అనుమతి తెచ్చుకున్న కేసీఆర్‌ రుణమాఫీ అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదని కాంగ్రెస్‌ పార్టీ ప్రశ్నిస్తోంది. ఎన్నికల సంఘం తీరును పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి తప్పుపట్టారు. రైతుల్ని ప్రభావితం చేసేలా పోలింగ్‌కు 4 రోజుల ముందు రైతుబంధు నిధుల విడుదలకు అనుమతి ఇచ్చిందని ఫైరయ్యారు. రైతుబంధు నిధులు ముందుగానే విడుదల చేయాలని కాంగ్రెస్‌ కోరినా ఈసీ పట్టించుకోలేదన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటే అని రుజువైందన్నారు. కేసీఆర్‌ను జేసీబీలు, క్రేన్లు పెట్టి లేపాలని మోడీ ప్రయత్నించినా ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలవదని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఈ టైంలో రైతుబంధు నిధుల విడుదల వల్ల రైతులకు 5 వేల రూపాయల నష్టం జరుగుతోందన్నారు రేవంత్‌రెడ్డి. రైతుబంధు డబ్బులు అకౌంట్లో పడ్డాయని రైతులు ప్రభావితం కావొద్దని కోరారు. కాంగ్రెస్‌ అధికారలోకి రాగానే హామీ మేరకు మరో 5 వేలు ఎక్కువ వచ్చేవని బాధపడొద్దని సూచించారు. ఇప్పుడు కేసీఆర్‌ ఇచ్చే 5 వేలు తీసుకోవాలని.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక జనవరిలో హామీ నెరవేరుస్తామని రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు.

Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×