EPAPER
Kirrak Couples Episode 1

Revenue Vocabulary : ఈ రెవెన్యూ పదాలకు అర్థాలు తెలుసా?

Revenue Vocabulary : ఈ రెవెన్యూ పదాలకు అర్థాలు తెలుసా?
Revenue Vocabulary

Revenue Vocabulary : మనదేశంలో భూమి స్వరూపం, స్వభావాన్ని బట్టి మొఘలుల నుంచి బ్రిటిషర్ల వరకు వాటిని వేర్వేరు కేటగిరీలుగా విభజించి, ఆ భూమిపై శిస్తు విధించి వసూలు చేసేవారు. పాలకులు మారినా.. నేటికీ మన గ్రామంలో వీఆర్‌ఏ.. వీఆర్వోలు, గిర్ధావర్‌.. తహసీల్దార్లు ఇవే పదాలను వాడుతున్నారు. ఈ పదాలు విన్నప్పుడు తెలిసినట్లే ఉంటాయి గానీ.. వాటి అసలు అర్థం మాత్రం క్లారిటీగా చాలామందికి తెలియదు. ఆ పదాలు..వాటి వివరాల మీద ఓ లుక్కేద్దాం.


పంచరాయి: గ్రామంలో పశువుల మేతకోసం కేటాయించిన ప్రభుత్వ భూమిని పంచరాయి అంటారు. గ్రామానికి దూరంగా అందరి పశువులకు మేతకోసం ఉపయోగించుకుంటారు. ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి. దీనిపై ఎవరికీ అధికారాలుండవు.

హోమ్‌స్టడ్‌: హోమ్‌స్టడ్‌ అంటే గ్రామం లేదా పట్టణంలో భూమిలేని కూలీలు, వృత్తిపనుల వారు… ఇతరుల భూములపై 14-08-1975 నాటికి నివాసం ఏర్పచుకున్న స్థలాన్ని హోమ్‌స్టడ్‌ అంటారు. అలాంటి భూముల్లో నివాసమున్నవారికి అధికారులు తాత్కాలికంగా అనుమతులు ఇస్తారు.


బిల్‌ మక్తా.. : సాధారణ శిస్తుకంటే తక్కువ శిస్తు నిర్ణయించిన భూమి, లేదా గ్రామాన్ని బిల్‌ మక్తా అంటారు.

చలానా: దీన్నే ఇర్సాలు నామా అనీ అంటారు. ప్రభుత్వానికి చెల్లించిన భూమి శిస్తు, వగైరాలను వసూలు చేసి నిర్ణీత తేదీల్లో ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తారు.

ఎండార్స్‌మెంట్‌ : గ్రామంలో ప్రజలు….ప్రభుత్వ అధికారులకు ఏదైనా దరఖాస్తు చేసుకుంటే దానిపై నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని తెలియ చేసేవిధానం.

ఇజారా : ప్రభుత్వానికి చెందిన భంజరు భూములను వ్యవసాయానికి కానీ, నివాసం ఉండటానికానీ కొంత నిర్థిష్టమైన పన్ను చెల్లించే పద్ధతిపై లీజుకు ఇవ్వడాన్ని ‘ఇజారా’అంటారు.

చల్క: మట్టిలో ఎక్కువ భాగం ఇసుకతో కూడుకున్నది. సాధారణంగా ఈ భూముల్లో నీరు తక్కువగా అవసరం ఉండే పంటలు పండిస్తుంటారు.

గట్‌ నంబర్‌ : సాగుభూమిని నిరుపయోగంగా వదిలేయడాన్ని గట్‌ నంబర్‌ అంటారు. దీనిని బీడు భూమి అనికూడా అంటారు.

ఆబాదీ/గ్రామ కంఠం : గ్రామంలో నివసించడానికి కేటాయించిన భూమినే గ్రామ కంఠం అంటారు. ఇది గ్రామానికి చెందిన ఉమ్మడి స్థలం. దీనిలో ప్రభుత్వ సభలు, సమావేశాలు నిర్వహించుకోవచ్చు.

అసైన్డ్‌ భూమి : భూమి లేనిపేదలకు ఇల్లు కట్టుకునేందుకు, సాగు చేసుకునేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన భూమిని అసైన్డ్‌ భూమి అంటారు. ఈ భూమిని వారసత్వ సంపదగా అనుభవించి తప్ప మరొకరికి అమ్మేందుకు, బదలాయించేందుకు వీలుకాదు. కానీ..ఇటీవల కొన్ని ప్రభుత్వాలు నిర్ధారిత సమయం తర్వాత దాన్ని అమ్ముకునేందుకు వీలు కల్పిస్తు్న్నాయి.

చుక్కల భూమి: దీన్నే డాటెడ్‌ ల్యాండ్‌ అంటారు. ఖాళీగా ఉన్న బంజరు భూమికి భూమిశిస్తు కట్టలేని కొందరు పూర్వం వీటిని తమవి అని క్లెయిం చేసుకోలేదు. దీంతో అప్పటి అధికారులు.. అనుభవదారులు వచ్చినప్పుడు వారికి హక్కులు ఇద్దామనే ఉద్దేశంతో రికార్డులో ఆ భూమి ఎదురుగా చుక్కలు పెట్టి వదిలేశారు.

డైగ్లాట్‌: రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో సర్వే పూర్తి చేసి ఆ వివరాలను నమోదు చేసే రిజిస్టర్. ఇందులో సర్వే నెంబర్లు, విస్తీర్ణం, అవి సర్కారు/ఈనాం భూములా, మాగాణియా/మెట్టా వంటి వివరాలు, శిస్తు, తదితర వివరాలుంటాయి. ఈ రిజిస్టర్‌ను ఇంగ్లిష్‌లో, తెలుగులో రాస్తారు. అందకే దీనికి ‘డైగ్లాట్‌’ అంటారు. దీనినే శాశ్వత ‘ఏ’ రిజిస్టర్‌గా పరిగణిస్తారు. ఈ రిజిస్టర్‌ మిగతా గ్రామ రెవెన్యూ రికార్డులన్నింటికీ మూలస్తంభం లాంటిది.

ఏడబ్ల్యూ భూములు : శిస్తును నిర్థారించిన ప్రభుత్వ భూములు లేదా అసైన్డ్‌ వేస్ట్‌ల్యాండ్‌ అంటారు. శిస్తు కట్టిన ఏడబ్ల్యూ భూములు మెట్ట భూములైతే ల్యాండ్స్‌ అంటారు. వీటిని భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేసే అవకాశం ఉంటుంది.

అసామి షిక్మీ: భూ యజమానికి పన్ను చెల్లించే నిబంధనపై భూమిని కౌలుకు తీసుకుని చేసుకుంటున్న వ్యక్తి.

బంజరు భూమి : గ్రామం, మండల పరిధిలో ఖాళీగా, నిరుపయోగంగా ఉన్న భూములను బంజరు భూములుగా గుర్తిస్తారు. వీటిని రెవెన్యూ రికార్డులలో ప్రత్యేక గుర్తులతో సూచిస్తారు.

అగ్రహారం : పూర్వం బ్రాహ్మణులకు శిస్తు లేకుండా తక్కువ శిస్తుతో ఈనాముగా(బహుమతిగా) ఇచ్చిన గ్రామం లేదా అందులో కొంత భాగాన్ని అగ్రహారం అంటారు.

అడంగల్‌/ పహాణీ : దీనినే పహాణి అనీ అంటారు. గ్రామంలోని సాగు భూముల వివరాలు ఈ రిజిస్టర్‌లో రికార్డు చేస్తారు. దీన్నే గ్రామ లెక్కల మూడో నంబరు రిజిస్టర్‌ అంటారు. ఆంధ్రాలో దీనిని అడంగల్‌ అనీ, తెలంగాణలో పహాణీ అంటారు.

చిట్టా : రోజువారీ వసూళ్లు తెలిపే రిజిస్టర్‌ను చిట్టా అంటారు. దీన్ని గ్రామ లెక్క నంబరు-6 అంటారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన నీటి పన్ను, భూమి శిస్తు వగైరాలను ఇంటి/భూ యజమానుల వారీగా వసూలు చేసి ఈ రిజిస్టర్‌లో నమోదు చేస్తారు.

జమాబందీ : భూమి శిస్తు, నీటి పన్ను, తదితర బకాయిలను సరిగ్గా లెక్కతేల్చటమే జమాబందీ. అంటే గ్రామంలోని పన్ను కట్టాల్సిన వారి వివరాలు రికార్డుకు ఎక్కాయా? వసూలవుతున్న పన్ను మొత్తాలు.. కరెక్టుగానే ఉన్నాయా అని ఆడిట్ చేయటం అన్నమాట. దీనికోసం గ్రామ, మండల రెవెన్యూ సిబ్బంది ఎప్పటికప్పడు తనిఖీలు చేస్తుంటారు.

అజమాయిషీ : భూమికి సంబంధించి గ్రామ రెవెన్యూ అధికారి నిర్వహించే గ్రామపు లెక్కలను తనిఖీ చేయటాన్నే అజమాయిషీ అంటారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, వీఆర్వో రాసిన లెక్కల్లోని వివరాలను తహశీల్దారు, ఉప తహశీల్దారు తనిఖీలు నిర్వహించాలి. తనిఖీ చేసిన వివరాలను గ్రామ లెక్కనంబరు 3లో నమోదు చేయాలి. ఇలా ఏటా అజమాయిషీని నిర్వహిస్తారు.

దస్తావేజు : భూముల కొనుగోళ్లు, అమ్మకాలు, కౌలు, ఇతర లావాదేవీలకై రెవెన్యూ శాఖ వారు ముద్రించే పేపరునే దస్తావేజు అంటారు. భూ బదలాయింపుల సమయంలో ఆస్తి విలువను బట్టి సదరు మొత్తాన్ని ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఫీజుగా కట్టి బదిలీ చేయించుకోవాలి.

ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ (ఈసీ) : భూ స్వరూపాన్ని తెలియజేసే ధ్రువపత్రం. ఒక భూమి 32 కాలంలో ఎందరి చేతులు మారిందనే వివరాలను ఇది తెలియజేస్తుంది.

ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ బుక్‌ (FMB) : దీనిని ఎఫ్‌ఎంబీ టిప్పన్‌ అని కూడా అంటారు. గ్రామ రెవెన్యూ రికార్డులలో ఎఫ్‌ఎంబీ ఒక భాగం. దీనిలో గ్రామంలోని అన్ని సర్వేనంబర్లు, పట్టాలు, వాటికొలతలు ఉంటాయి.

బందోబస్తు: వ్యవసాయ భూములను సర్వేనిర్వహించి వర్గీకరణ చేపట్టడాన్ని బందోబస్తు అంటారు.

బీ మెమో : ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్న వ్యక్తికి శిస్తు చెల్లించాలని ఆదేశిస్తూ ఇచ్చే నోటీసు. సాగుకు వీరు అర్హులైతే ఆ భూమిని శిస్తు కట్టించుకొని కొనసాగిస్తారు. అనర్హులైతే వారి నుంచి భూమిని స్వాధీనం చేసుకుంటారు.

ఫసలీ : జులై 1 నుంచి మరుసటి ఏడాది జూన్‌ 30 వరకు ఉన్న 12 నెలల కాలాన్ని ‘ఫసలీ’ అంటారు. ఈ పదం మొఘల్‌ చక్రవర్తుల కాలం నుంచి వాడుకలో ఉంది.

ఎకరం : ఇది భూమి విస్తీర్ణానికి కొలమానం. 4,840 చదరపు గజాల స్థలం లేదా 100 సెంట్లు (సెంటు అంటే 48.4 గజాల స్థలం) లేదా 40 కుంటలు (కుంట అంటే 121 చదరపు గజాల స్థలం).

Tags

Related News

President Draupadi Murmu : రేపు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము.. ఈ మార్గాల్లో వెళ్తే అంతే సంగతులు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జోలికొచ్చి బుక్కైన నానీలు..

Russia Vs Ukraine War: దూసుకొస్తున్న రష్యా మిస్సైల్? వణికిపోతున్న ఉక్రెయిన్

YS Jagan vs Botsa Satyanarayana: వైసీపీ నేతల పార్టీ మార్పు వెనుక బొత్స వ్యూహం ఉందా?

Irregularities: జూబ్లీహిల్స్‌లో బయటపడ్డ మరో భారీ బాగోతం.. 36 ఏండ్ల నుంచి..

Alla Nani: వైసీపీ రాజీనామా నేతలకు జనసేన డోర్లు తెరుచుకుంటాయా ? ఆళ్ల నాని పరిస్థితి ఏంటి ?

Hydra Demolitions: కూల్చివేతలపై భిన్న స్వరాలు.. కేసీఆర్ అలా.. కేటీఆర్ ఇలా..

Big Stories

×