EPAPER

Abid Hasan : జైహింద్ నినాదం వెనక.. మన హైదరాబాదీ..!

Abid Hasan : జైహింద్ నినాదం వెనక.. మన హైదరాబాదీ..!

Abid Hasan  : ‘జైహింద్‌’ అనే నినాదానికి ప్రాణం పోసింది.. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌. అయితే.. మనలో చాలామంది ఈ నినాదాన్ని సుభాష్ చంద్రబోస్ ఎంపిక చేశాడని భావిస్తుంటారు. కానీ.. ఇది ముమ్మాటికీ నిజం కాదు. నిజానికి ఈ నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి పేరు.. అబిద్‌ హసన్‌ సేఫ్రానీ.


ఈయన 1912లో హైదరాబాద్‌లో జన్మించారు. అబిడ్స్ సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్‌లోనే చదువుకున్నారు. అసలు పేరు జైనుల్‌ అబిదీన్‌ హసన్‌ కాగా.. దాన్ని అబిద్‌ హుసేన్‌‌గా మార్చుకున్నారు. ‘సేఫ్రానీ’ అనే పదం ఆయన పేరులో తర్వాత వచ్చి చేరింది.

ఈయన తల్లి ఫక్రుల్‌ హజియా బేగం. తండ్రి ఆమీర్‌ హసన్‌. ఆమీర్‌.. కలెక్టర్‌‌గా పనిచేసేవారు. అయితే.. ఆ రోజుల్లో నిజాం సంస్థానంలో జాతీయోద్యమానికి గానీ, కాంగ్రెస్‌కు గానీ స్థానం లేదు. నిజాం పాలకులు.. ముస్లిం నాయకుడైన కాంగ్రెస్ నేత మహమ్మద్ అలీ జిన్నానూ ఇక్కడ అడుగుపెట్టనివ్వలేదు.


కానీ.. కలెక్టర్ భార్యగా ఉన్నప్పటికీ.. అబిద్ హుస్సేన్ తల్లి ఫక్రుల్ హజియా బేగం.. స్వాతంత్ర్య పోరాటాన్ని నగరంలో ప్రారంభించి, దానిని చురుగ్గా నిర్వహించేది. నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరున్న సరోజినీ నాయుడు ఈమె శిష్యురాలే. గాంధీ, నెహ్రూ వంటి నేతలంతా హజియా బేగంను ‘అమ్మా జాన్’ అని గౌరవంగా పిలిచేవారు. అబిద్ పెద్దన్న బద్రుల్ హసన్ 1925లో గాంధీజీ నడిపిన ‘యంగ్ ఇండియా’ పత్రిక ఎడిటర్‌గా పనిచేశారు.

శాసనోల్లంఘన ఉద్యమ సమయంలో చదువుకు స్వస్తి చెప్పి, 1931లో సబర్మతి వెళ్లి కొద్దికాలం గాంధీజీ బోధనలు విన్నారు. దండి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించారు. ఆ సమయంలోనే సబర్మతి ఆశ్రమంలో ‘హిందువులతో బాటు ఇతర మతాల ప్రార్థనలుండాలి’ అని సూచించారు. ఆ తరువాతే ‘రఘుపతి రాఘవ రాజారాం’ అక్కడి ప్రార్థనా గీతం అయింది.

బ్రిటిష్ వారి దమనకాండకు స్వాతంత్ర్య సమరవీరులు ప్రాణాలు కోల్పోవటం చూసి, కాంగ్రెస్‌ ఉద్యమ పంథాలో ఆయన ఇమడలేక పోయారు. మళ్లీ హైదరాబాద్ చేరుకుని, నాటి ట్రెండ్‌ను అనుసరించి, కొందరు మిత్రులతో కలసి జర్మనీలో ఇంజనీరింగ్ చదివేందుకు వెళ్లారు. అప్పటికే జర్మన్, ఫ్రెంచ్, ఇంగ్లిష్, అరబిక్, సంస్కృతం, పర్షియన్, హిందీ, ఉర్దూ, తెలుగు భాషలపై పట్టు సాధించారు.

అక్కడే 1941లో అబిద్‌ జీవితం గొప్ప మలుపు తిరిగింది. భారత్‌ నుంచి రహస్యంగా బయటపడిన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జర్మనీ వచ్చిన సంగతి తెలుసుకుని, భారతీయ యువకులతో కలిసి సుభాష్‌ను కలిశారు. ఉద్యమంలో చేరమని బోస్ కోరగా, ఇంజనీరింగ్ పూర్తయ్యాక వస్తానని చెప్పారు. ‘గొప్ప ఆశయం కోసం చిన్న చిన్న త్యాగాలకు సిద్ధం కావాలి’ అనే బోస్ అభిప్రాయం మేరకు చదువును పక్కనబెట్టి.. ఆజాద్ హింద్ ఫౌజ్‌లో చేరారు.

రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ వలస దేశంగా యుద్ధంలో భారతీయ సైనికులూ పాల్గొన్నారు. ఈ క్రమంలో శత్రువుకు శత్రువు మిత్రుడు.. అనే సిద్ధాంతం ప్రకారం.. బోస్ జర్మనీ పక్షం వహించారు. ఆ సమయంలో జర్మనీ తరపున పోరాడే సైనికుల్లో ఉత్తర ఆఫ్రికా వారూ ఉండేవారు. ఆ సమయంలోనే సిక్కు, రాజపుత్‌ ఇలా వేర్వేరు రెజిమెంట్లను బోస్ ఏర్పాటు చేశారు.

అక్కడి సైనికుల్లో ముస్లింలు సలామాలేకుం అనీ, సిక్కులు ‘సత్ శ్రీ అకాలే’ అని, హిందువులు ‘రామ్ రామ్’ అని పలకరించుకునేవారు. కానీ అందరినీ ఒకటిచేసే పదాన్ని సూచించమని అబిద్‌ను బోస్ కోరగా.. ‘హలో’ అనే పదాన్ని సూచించగా, బోస్ దానికి నో చెప్పారు. మర్నాడు.. అబిద్‌ను వెంటబెట్టుకుని రెజిమెంట్ల సందర్శనకు వెళ్లినప్పుడు చాలామంది ‘జై రామ్‌రామ్‌కీ’ అని పలకరించుకోవటం బోస్ గమనించారు. దీనిని కొంత మార్చి ‘జై హిందుస్తానీ’ చేస్తే ఎలా ఉంటుందని అబిద్ సూచించటం, చివరికి అది ‘జైహింద్‌’ కావటం జరిగిపోయాయి.

ఆ తర్వాత.. ఆజాద్ హింద్ ఫౌజ్‌ జెండా రూపకల్పన ప్రస్తావన వచ్చింది. ఈ క్రమంలో హిందువులు కాషాయం రంగుకావాలని, ముస్లింలు ఆకుపచ్చ రంగే ప్రధానమనీ పట్టుబట్టారు. కానీ.. తర్వాత హిందూ సైనికులు తమ డిమాండ్‌ను వెనక్కి తీసుకున్నారు. దేశం కోసం తమ కోరికను మానుకున్న హిందూ సైనికుల తీరుకు సంతోష పడిన అబిద్.. తన పేరులో కాషాయ(శాఫ్రాన్) రంగును సూచించేలా తన పేరుచివర సేఫ్రానీ అనే పదాన్ని పెట్టుకున్నారు.

బోస్‌ మరణం తర్వాత ఎర్రకోటలో ఆజాద్ హింద్ ఫౌజ్ ఖైదీగా విచారణను ఎదుర్కొని, కొంతకాలం శిక్షను అనుభవించి, హైదరాబాద్ తిరిగొచ్చి, కాంగ్రెస్ పార్టీలో చేరి నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. కానీ కాంగ్రెస్ నేతల వైఖరి నచ్చక.. బెంగాల్‌ ల్యాంప్స్‌ అనే సంస్థలో చేరి, కరాచీ వెళ్లిపోయారు. స్వాతంత్య్రం వచ్చాక.. తిరిగి జన్మస్థలమైన హైదరాబాద్‌ వచ్చారు. నెహ్రూ పిలుపు మేరకు ఆయన విదేశాంగ శాఖలో చేరి 1969లో రిటైర్ అయ్యారు. 1984లో హైదరాబాద్‌లోనే కన్నుమూశారు. అబిద్‌ పర్షియన్‌, ఉర్దూ కవిత్వం కూడా రాసిన అబిద్.. జనగణమన గీతాన్ని ఉర్దూలోకి అనువదించారు.

భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న గొప్ప ముస్లిం యోధుల్లో ఒకరిగా, భారత మాత ప్రియ పుత్రుల్లో ఒకరిగా అబిద్ హసన్ సేఫ్రానీ చరిత్రలో నిలిచిపోయారు.

Tags

Related News

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Big Stories

×