EPAPER

Telangana Elections : టార్గెట్‌ 90! కాంగ్రెస్‌ ప్రచార హోరు..

Telangana Elections : టార్గెట్‌ 90! కాంగ్రెస్‌ ప్రచార హోరు..

Telangana Elections : కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తోంది. ఆరు గ్యారెంటీ స్కీంలు, అభయ హస్తం మేనిఫెస్టోను ప్రజల్లోకి మరింత వేగంగా తీసుకుపోయోలా ప్రణాళిక రెడీ చేసింది. ఏఐసీసీ ఆగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్, భూపేష్ బగెల్, సుఖ్విందర్ సింగ్ సుక్కు, మాజీ ముఖ్యమంత్రి మాజీ కేంద్రమంత్రులు, ఎఐసీసీ ముఖ్య నేతలు ప్రచారంతో హోరెత్తించనున్నారు. ఈనెల 24 నుంచి 28 వరకు తెలంగాణలోనే మకాం వేయనున్నారు. ఒక్కో నేత రోజుకు 4 నియోజకవర్గాల చొప్పున మొత్తం 90 నియోజకవర్గాలను చుట్టేసేలా ప్లాన్ చేశారు. జంట నగరాల్లో రాహుల్ గాంధీ భారీ రోడ్ షోలు నిర్వహించనున్నారు. మరోవైపు ప్రియాంక షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 24, 25, 27న ఆమె విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తారు.


ఇప్పటి వరకు ఒకలెక్క.. ఇక నుంచి మరో లెక్క.. అన్నట్లుగా తెలంగాణ ప్రచారం హోరెత్తనుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణ పోలింగ్‌ చివర్లో ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. తెలంగాణను కాంగ్రెస్‌ పార్టీ టాప్‌ ప్రయార్టీగా భావిస్తూ ముందు నుంచే ప్రచారం చేస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల తర్వాత నుంచే రాష్ట్రానికి రాహుల్‌, ప్రియాంక గాంధీ అనేక సార్లు వచ్చారు. ఈ రెండేళ్లుగా విస్తృతంగా బహిరంగ సభలకు హాజరయ్యారు. ఇటీవల CWC సమావేశాలను కూడా హైదరాబాద్‌ కేంద్రంగా నిర్వహించి హస్తం హైకమాండ్‌ తమకు తెలంగాణ ఎంత ప్రయార్టీ అనేది క్లారిటీ ఇచ్చారు.

స్వయంగా సోనియా గాంధీ చేతుల మీదుగా విడుదల చేసిన అభయ హస్తం ఆరు గ్యారెంటీలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. అధికార బీఆర్ఎస్‌ కూడా వాటిని కాపీ కొట్టింది. ఓటమి భయం పట్టుకొని వణికిపోతోంది. కర్ణాటకను ప్రస్తావిస్తూ తప్పుడు ప్రచారానికి తెరలేపుతోంది. కేసీఆర్‌ ప్రచారం మొత్తం చేసింది చెప్పుకోవడం కాకుండా.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పథకాలు ఆగిపోతాయంటూ దుష్ప్రచారానికే పరిమితం అవుతున్నారు. వీటన్నింటిని గట్టిగా తిప్పికొట్టేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సహా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ మరోసారి రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఓ దఫా ఈ ఇద్దర కన్నడ నేతలు కర్ణాటకలో హామీల అమలుపై స్పష్టత ఇచ్చారు. దమ్ముంటే కేసీఆర్‌ కర్ణాటక రావాలని ఐదు గ్యారెంటీల అమలును నేరుగా చూపిస్తామని సవాల్‌ విసిరారు.


రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్‌ ఖర్గే వరుస ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి అగ్రనేతలు ఈనెల 24 నుంచి 28 వరకు రంగంలోకి దిగనున్నారు. ఎన్నికల ప్రచారం ముగిసే వరకు ఇక్కడే ఉండనున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రియాంక గాంధీ టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 24, 25, 27న ఆమె తెలంగాణలో పర్యటించనున్నారు. మూడు రోజుల్లో 10 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు.

ఇందులో భాగంగా 24న ఉదయం 11 గంటలకు పాలకుర్తి, మధ్యాహ్నం 2 గంటలకు హుస్నాబాద్, సాయంత్రం 4 గంటలకు ధర్మపురి సభల్లో ప్రచారం చేస్తారు. 25న పాలేరు, ఖమ్మం, వైరా, మధిర నాలుగు నియోజకవర్గాలలో ప్రచారం నిర్వహిస్తారు. 27న 11 గంటలకు మునుగోడు, 2 గంటలకు దేవరకొండ, 4 గంటలకు గద్వాల ప్రచార సభలకు హాజరవుతారు. ఇప్పటికే ప్రియాకం నిర్వహించిన సభలకి మంచి స్పందన లభించింది. కాంగ్రెస్‌ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. నాయనమ్మ ఇందిరను తలపించేలా ప్రియాంక సభలు సాగుతున్నాయి.

ప్రియాంకతో కలిసి రామప్ప ఆలయం నుంచి తొలి విడత బస్సుయాత్ర ప్రారంభించిన రాహుల్‌ గాంధీ.. ఈ ప్రాంతంతో తమది కుటుంబ బంధమంటూ ప్రజల మనసులను చూరగొన్నారు. మరోసారి ప్రచారానికి రానుండగా కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 90 అసెంబ్లీ సెగ్మెంట్‌లలో విస్తృతంగా ప్రచారం చేయనుంది. ఈ నెల 22 నుంచి ఏఐసీసీ అగ్రనేతల వరుస పర్యటనలు మొదలు కానున్నాయి. ఒక్కో నేత ఐదు సెగ్మెంట్‌ల చొప్పున ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో పాటు మేనిఫెస్టోను తుది దశ ప్రచారంలో ప్రతి గడపకు చేర్చడంపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుత వేవ్‌ను కొనసాగిస్తూనే ఎన్నికల్లో గెలిచేందుకు ప్రజలను నేతలు కన్విన్స్ చేయనున్నారు.

పార్టీ చేసే కార్యక్రమాలతో పాటు కేసీఆర్ వైఫల్యాలను ప్రజలకు వివరించనున్నారు. మూడోసారి కేసీఆర్ సీఎం అయితే వచ్చే నష్టాలు, ప్రజలను వెన్నాడే సమస్యలపై వివరించనున్నారు. తెలంగాణ తుది దశ ప్రచారానికి కనీసం ఒక్కసారైన వచ్చివెళ్లాలని రాష్ట్ర పార్టీ.. సోనియా గాంధీని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. నీళ్లు, నిధులు, నియామకాలు నీరు గారిపోయాయనే సందేశాన్ని సోనియా ఇస్తారని ఏఐసీసీ నేతలు చెబుతున్నారు. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పవర్‌లోకి రానుందని ఇంటర్నల్ సర్వేల్లో తేలిందని నేతలు చెబుతున్నారు.

కాంగ్రెస్‌ ప్రచారం హోరుతో బెంబేలెత్తుతున్నారు గులాబీ నేతలు. ఏఐసీసీ అగ్రనేతలంతా ఒక్కసారిగా మీద పడిపోతే ఫలితాలు పూర్తిగా వన్‌సైడ్‌ అవుతాయని ఆందోళన చెందుతున్నారు. దీనికి దీటుగా కేసీఆర్‌ సభలకు కూడా మరిన్ని ఏర్పాటు చేసేలా కసరత్తు చేస్తున్నారు. అటు పూర్తిగా వెనుకబడిపోయామనే అపవాదు మూటగట్టుకున్న కమలం పార్టీ కూడా అగ్రనేతలని రంగంలోకి దింపేలా కసరత్తు చేస్తోంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సహా కీలక నేతలు ప్రచారానికి రానున్నారు. ప్రధాని మోడీతోనూ చివర్లో రోడ్‌ షోలు, లేదంటే వీలైనన్ని ఎక్కువ సభల్లో పాల్గొనేలా వ్యూహం రచిస్తున్నారు.

.

.

Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×