EPAPER

Ramagundam Politics : రామ”గుండం” పాలిటిక్స్.. కోరుకంటికి అగ్నిపరీక్ష.. వారి ఓట్లే కీలకం ?

Ramagundam Politics : రామ”గుండం” పాలిటిక్స్.. కోరుకంటికి అగ్నిపరీక్ష.. వారి ఓట్లే కీలకం ?
latest political news telangana

Ramagundam Politics(Latest political news telangana):

కోల్ బెల్ట్ ఏరియాలో రసవత్తర రాజకీయాలకు కేరాఫైన రామగుండంలో వేవ్ ఎలా ఉంది? ఇప్పుడు ఎన్నికల వేళ రాజకీయ అగ్నిగుండంలా మారిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉంది.. ప్రత్యర్థుల సత్తా ఎంత? కాక రేపిన రెబల్స్ ఎన్నికల్లో అధికారపార్టీకి సహకరిస్తారా? షాకిస్తారా? అధికార బీఆర్ఎస్ లో రామగుండం నేతలు రగిల్చిన చిచ్చు ఏంటి?


రామగుండం రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ప్రధాన పార్టీలన్నీ బలంగా ఢీ అంటే ఢీ అంటూ ఎంత ఖర్చుకైనా వెనుకాడని రోజుల్లో సైతం.. ఇక్కడి కార్మికవర్గం అనుకుంటే ఓ ఇండిపెండెంట్ నైనా గెలిపించే ఒక ప్రత్యేకత కోల్ బెల్ట్ ఏరియా సెగ్మెంట్ రామగుండంలో కనిపిస్తుంది. ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థిగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు ఎమ్మెల్యే కోరుకంటి చందర్. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి.. చివరి నిమిషంలో AIFB నుంచి టిక్కెట్ పొంది గెల్చిన తర్వాత గులాబీ కండువా కప్పుకుని కారెక్కేశారు చందర్. ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే.. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా సోమారపు సత్యనారాయణ దిగారు. ఈసారి చందరే గెలుపు గుర్రమని భావించిన కేసీఆర్ ఆయన్నే రంగంలోకి దింపింది.

2018లో ఎమ్మెల్యేగా గెలిచిన కోరుకంటి చందర్ కు ఎంత పేరు వచ్చిందో.. అదే స్థాయిలో విమర్శలు కూడా ఖాతాలో జమయ్యాయి. ముఖ్యంగా పార్టీలో క్యాడర్ తో పొసగకపోవడం పెద్ద మైనస్ పాయింట్ గా మారింది. చాలాకాలంగా గులాబీపార్టీకే మద్దతు తెలుపుతున్న కోల్ బెల్ట్ ఏరియాలో.. నాయకుల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరిగిపోయింది. అయితే.. ఎమ్మెల్యేగా గెలిచాక కోరుకంటి చందర్ మిగిలిన అందరితో కలిసిపోలేకపోవడంతో.. అ వివాదం కాస్తా ముదిరింది. మొన్నటిదాకా చందర్ కు టిక్కెట్ ఇవ్వొద్దంటూ రామగుండం బీఆర్ఎస్ లో కీలక నేతలైన కందుల సంధ్యారాణి, మిరియాల రాజిరెడ్డి, కొంకటి లక్ష్మీనారాయణ వంటి నేతలు ర్యాలీలు నిర్వహించడం.. బహిరంగంగా కామెంట్లు చేయడం, ఆ పంచాయితీ అంతా మంత్రి కేటీఆర్ దాకా వెళ్లడం.. ఆ తర్వాత సద్దుమణిగినట్టు కనిపించింది. కానీ మరికొద్ది రోజుల్లో పోలింగ్ జరుగుతుందనగా.. మళ్లీ రెబల్స్ సవాళ్లు విసురుతున్నారు. దీంతో ఈసారి రామగుండంలో బీఆర్ఎస్ గెలుపు అంత ఈజీ అయితే కాదన్న టాక్ వినిపిస్తోంది.


వాళ్లే కీలకం..

రామగుండంలో అభ్యర్థుల గెలుపోటములను శాసించేది సింగరేణి కార్మిక కుటుంబాలే. ఇక్కడ పురుషులు 1 లక్షా 8 వేల 233 మంది ఉండగా, మహిళా ఓటర్లు 1 లక్షా 6 వేల 716 మంది ఉన్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 2 లక్షల 14 వేల 974 మంది ఉన్నారు. 80 శాతం పట్టణ ప్రజలు, 20 శాతం మాత్రమే గ్రామీణ ప్రాంత ప్రజలు ఉన్నారు. ప్రభుత్వ పరంగా వచ్చే నిధుల కన్నా కూడా.. ఇక్కడ స్థానిక సంస్థలే సామాజిక బాధ్యత కింద అభివృద్ధి పనులు చేస్తుండటం కూడా ఇక్కడి స్వయం ప్రతిపత్త ఆలోచనలకు నిదర్శనం. ఆ ప్రభావమే పోలింగ్ పై కూడా చూపిస్తుంటుంది. వీటిలో సింగరేణి, ఎన్టీపీసీ వంటి యాజమాన్యాలు కీలకపాత్ర పోషిస్తాయి. గత ఎన్నికల్లో కోరుకంటి చందర్ కు 61 వేల 400 ఓట్లు రాగా.. తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణకు 34 వేల 981 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ ఠాకూర్ కు 27 వేల 181 ఓట్లు పోలయ్యాయి. గతంలో మూడోస్థానంతో సరిపెట్టుకున్న రాజ్ ఠాకూర్ వైపు ఈసారి సానుభూతి పవనాలు వీస్తున్నాయంటున్నారు. వరుసగా పోటీ చేస్తున్నా.. విజయం దక్కకపోవడంతో ఈసారి రామగుండం ప్రజల ఆశీర్వాదం కోసం రాజ్ ఠాగూర్ గట్టిగానే ఇంటింటా తిరుగుతున్నారు.

రామగుండంలో ఈసారి చతుర్ముఖ పోటీ కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలవగా.. కాంగ్రెస్ నుంచి తనకున్న సానుభూతి పవనాలతో రాజ్ ఠాకూర్ సవాల్ విసురుతున్నారు. ఇక బీజేపీకి రాజజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఇండిపెండెంట్ గా, లేదా గత ఎన్నికల్లో చందర్ కు కలిసివచ్చిన సింహం గుర్తు పార్టీ ఏఐఎఫ్బీ నుంచి బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామగుండం ఎమ్మెల్యే మాకొద్దంటూ ర్యాలీలు తీసి చర్చనీయాంశంగా మారి బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన రెబల్ నేత.. పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి బీజేపీలో చేరారు.

రామగుండాన్ని దత్తత తీసుకుంటానని కేటీఆర్ ప్రకటించారు. అయితే ఈ స్టేట్ మెంట్ ను జనం ఎంత వరకు నమ్ముతారన్నది కీలకంగా మారింది. ఎందుకంటే గతంలో చాలా ఊళ్లను కేసీఆర్, కేటీఆర్ దత్తత తీసుకుంటామని చెప్పారు. అయితే వాటిని ఆ స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయారన్న విమర్శలున్నాయి. ఐటీ పార్క్ కోసం నిధులు తీసుకురావడం, సింగరేణి మెడికల్ కాలేజ్ ఏర్పాటు, గోదావరిఖనిలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, బీసీబంధు, దళితబంధు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు, కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ వంటి పథకాలనే బీఆర్ఎస్ నమ్ముకుంది.

బీఆర్ఎస్ అభ్యర్థి చందర్ కు ప్రతికూల అంశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రామగుండం ఫర్టిలైజర్ కార్పోరేషన్ ఓపెన్ అయ్యాక.. నిరుద్యోగుల నుంచి చందర్ అనుచరులు డబ్బులు వసూల్ చేశారన్న ఆరోపణలు ఎన్నికల ముందు హాట్ టాపిక్ అయ్యాయి. కొందరు అనుచరులపై తాత్కాలికంగా పెట్టీ కేసులు పెట్టించి.. ఆ తర్వాత వాటని కొట్టేయించి.. మళ్లీ తనతో తిప్పుకుంటున్నారన్న అపవాదు చందర్ పై ఉందంటున్నారు. మరోవైపు ఎన్టీపీసీ నిర్వహణలో ఉండే యాష్ పాండ్ నిర్వహణకు సంబంధించి టెండర్లు వేద్దామని ఎన్టీపీసీ భావించినా.. దాన్ని రద్దు చేయించి.. ఎమ్మెల్యే అనుచరులే దాన్ని నిర్వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అలాగే ఇసుకమాఫియా మరకలు కూడా ఉన్నాయన్న టాక్ ఉంది. మరోవైపు ఓపెన్ కాస్ట్ బావుల విస్తరణతో గోదావరిఖని పట్టణమే మొత్తం బొందలగడ్డగా మారుతుందన్న ప్రచారం సిట్టింగ్ ఎమ్మెల్యేను కలవరపెడుతోంది.

మరోవైపు సింగరేణి ఎన్నికలను యాజమాన్యం, ప్రభుత్వం గత నాలుగేళ్లుగా నిర్వహించకపోవడం.. కార్మికసంఘాలు కోర్టుకెక్కడం.. తీరా అసెంబ్లీ ఎన్నికల వేళ సింగరేణి ఎన్నికల నోటిఫికేషన్ రావడం కూడా అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. గతంలో 2017లో సింగరేణి ఎన్నికల తర్వాత అధికార బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధికారిక గుర్తింపు సంఘంగా ఎన్నికైనప్పటికీ.. ఆ తర్వాత 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు పదికి పైగా సెగ్మెంట్లలో అధికార బీఆర్ఎస్ ఓటమిపాలైంది. సుమారు 15 నియోజకవర్గాలపై ప్రభావం చూపే సింగరేణి ఎన్నికలు.. అసెంబ్లీ ముందు నిర్వహిస్తే దాని ఫలితాలు మరోతీరుగా ఉంటాయన్న ఆందోళన అధికార పార్టీలో కనిపించింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ ఠాకూర్ కు అనుకూలంగా వ్యవహారం నడుస్తోందా.. లేదంటే అనుభవం ఉన్న సోమారపు మళ్లీ గేమ్ లోకి వస్తారా ? రెబెల్ గా మారిన కందుల సంధ్యారాణి సత్తా చాటుతారా ? అన్నది కీలకంగా మారింది.

Related News

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Jani Master: అవును.. నేను చేసింది తప్పే.. పోలీసుల ముందు నేరం అంగీకరించిన జానీ..!

Star Heroine: ఈ హీరోయిన్ క్రేజ్ మామూలుగా లేదుగా.. 50 సెకండ్ల కోసం రూ.5కోట్లా..?

Fear Teaser: సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫియర్ టీజర్.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో హైప్ పెంచేసిన వేదిక.!

Jani Master : ‘మాస్టర్ అమాయకుడు’ రోజురోజుకు పెరుగుతున్న మద్దతు… ఎంత మంది సపొర్ట్ చేశారంటే..?

Bigg Boss 8 Day 19 Promo: కఠిన నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్..సైలెంట్ అయిన కంటెస్టెంట్స్ ..!

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Big Stories

×