EPAPER

VVS Laxman : ఆ ఒక్క ఇన్నింగ్స్ తో చరిత్రను మార్చేశాడు.. వెరీ వెరీ స్పెషల్ క్రికెటర్..

VVS Laxman : ఆ ఒక్క ఇన్నింగ్స్ తో చరిత్రను మార్చేశాడు.. వెరీ వెరీ స్పెషల్ క్రికెటర్..

VVS Laxman : ఆరోజు 2001 సంవత్సరం, మార్చి 11
కోల్ కతా ఈడెన్ గార్డెన్స్..
ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా 2 టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది.
అంతవరకు ఎవరికీ అక్కడ ఒక ప్రపంచ రికార్డ్ ఆవిష్కరణ జరగబోతోందని తెలీదు.
మ్యాచ్ ప్రారంభమైంది.
ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసి 445 పరుగులు చేసింది.
రెండో రోజు ఇండియన్స్ ఫస్ట్ బ్యాటింగ్ స్టార్ట్ అయ్యింది.
212 పరుగులకి అంతా క్యూ కట్టేశారు.
దీంతో ఫాలో ఆన్ లో పడి మళ్లీ సెకండ్ బ్యాటింగ్ స్టార్ట్ చేశారు.
ఐదురోజుల టెస్ట్ మ్యాచ్ లో రెండురోజులు గడిచిపోయాయి.
మూడోరోజు ఫాలో ఆన్ స్టార్ట్ అయ్యింది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యాక 3 వికెట్ల నష్టానికి 115 పరుగుల దగ్గర భారత్ కష్టాల కడలిలో ఈదుతోంది.


అప్పుడు క్రీజులోకి మన తెలుగువాడు ఒకడు నడుచుకుంటూ వచ్చాడు.

అతనే వీవీఎస్ లక్ష్మణ్…వంగివరపు వెంకట సాయి లక్ష్మణ్ …ఈ ఒక్క ఇన్నింగ్స్ తో…ఆ పేరు కాస్తా వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్ గా మారిపోయింది. ఇంతకీ ఆ పేరు పెట్టింది మరెవరో కాదు… ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఇయాన్ ఛాపెల్…
మొత్తానికి మార్చి 14 వచ్చింది. ఆట నాలుగోరోజు సాగుతోంది. ఈడెన్ గార్డెన్ లో ఆస్ట్రేలియా బౌలర్లు చెమటలు కక్కుతున్నారు. ఫీల్డర్లు అలసిపోతున్నారు. కానీ వీవీఎస్ లక్ష్మణ్ అవుట్ కావడం లేదు. అటువైపు నుంచి ది గ్రేట్ వాల్ రాహుల్ ద్రవిడ్ వికెట్లకి అడ్డంగా నిలబడిపోయాడు. అంతే ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం లిఖించబడింది.

అలా భారత పతాకం మరోసారి సగర్వంగా రెపరెపలాడింది. వెరీ వెరీ స్పెషల్ గా మారిన లక్ష్మణ్ ఆరోజు 281 పరుగులు చేశాడు. మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ 180 పరుగులు చేశాడు. ఇద్దరూ కలిసి రికార్డు భాగస్వామ్యంలో 375 పరుగులు చేశారు. మొత్తానికి ఫాలో ఆన్ లో పడిన ఇండియా చివరికి 657 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.


చివరిరోజు స్పిన్ మాంత్రికుడు హర్భజన్ సింగ్ 6 వికెట్లు తీసి ఆస్ట్రేలియా నడ్డివిరిచాడు. అతనికి మాస్టర్ సచిన్ సహకారం అందించాడు. తను 3 వికెట్లు పడగొట్టాడు. వెంకటపతిరాజు 1 వికెట్టు తీశాడు. అంతే చారిత్రాత్మక విజయం భారత్ కళ్ల ముందు నిలిచింది. ఓడిపోతారనుకున్న మ్యాచ్, ఫాలో ఆన్ లో పడిన మ్యాచ్ ని విజయ తీరాలకు చేర్చిన వీవీఎస్ లక్ష్మణ్ పేరు మొట్టమొదటిసారి ప్రపంచ క్రికెట్ లో మార్మోగిపోయింది.

ఆ ఒక్క ఇన్నింగ్స్ తో తను వెనుతిరిగి చూడలేదు. అలా భారత క్రికెట్ లో 134 టెస్ట్ మ్యాచ్ లు ఆడాడు. 225 ఇన్నింగ్స్ తో 8,781 పరుగులు చేశాడు. 45.97 సగటుతో టెస్ట్ క్రికెట్ లో తనదైన ముద్ర వేశాడు. ఇందులో 17 సెంచరీలు, 2 డబుల్ సెంచరీలు, 56 ఆఫ్ సెంచరీలు ఉన్నాయి. 86 వన్డేలు ఆడి 2338 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 10 ఆఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ లో 20 మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. 282 పరుగులు చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది.

1974 నవంబర్ 1 హైదరాబాద్ లో శాంతారామ్, సత్యభామ దంపతులకు వీవీఎస్ లక్ష్మణ్ జన్మించాడు. దేశవాళీ క్రికెట్ లో హైదరాబాద్ జట్టుకి ఆడాడు. ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్ లో లాంక్ షైర్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. తర్వాత ఐపీఎల్ లో దక్కన్ ఛార్జర్స్ కు నాయకత్వం వహించాడు. 2011లో లక్ష్మణ్ కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. 2004లో శైలజను వివాహం చేసుకున్నాడు. ఒక పాప, ఒక బాబు ఉన్నారు.

వీవీఎస్ లక్ష్మణ్ 1996లో దక్షిణాఫ్రికాతో అహ్మదాబాద్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఆరంగ్రేటం చేశాడు. ఫస్ట్ మ్యాచ్ లో 50 పరుగులు చేసి శుభారంభం చేశాడు. కానీ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లో తన స్థానాన్ని నిలుపుకోలేక పోయాడు. 1997లో దక్షిణాఫ్రికా మ్యాచ్ లో ఓపెనింగ్ కి పంపిస్తే అక్కడ కూడా విఫలమయ్యాడు. ఇలా చాలాసార్లు లక్ష్మణ్ మీద బోర్డు నమ్మకం పెట్టుకుంది. మూడేళ్లు అవకాశం ఇస్తూ వచ్చింది. చివరికి 2000 సంవత్సరంలో సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ లో 167 పరుగులు చేసి తన సత్తా చాటాడు.

ఇంక అక్కడ నుంచి తన ఆటతీరు మారిపోయింది. 2001లో కోల్ కతా లో జరిగిన రెండో టెస్ట్ తో వీవీఎస్ లక్ష్మణ్ పేరు భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ప్రపంచంలోని అత్యుత్తమ ఇన్నింగ్స్ లో ఇది ఆరోదిగా గుర్తింపు అందుకుంది. ఆ ఒక్క ఇన్నింగ్స్ తో తన కెరీర్ ని ముందుకు నడిపించాడు. అలా కొన్నేళ్లు టెస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ డౌన్ స్థానం తనకే రాసిచ్చేశారు. ఆస్ట్రేలియా పర్యటనలో మరో రెండు సెంచరీలు చేశాడు. తర్వాత రాహుల్ ద్రవిడ్ తో కలిసి మరోసారి 300 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించాడు.

2004 తర్వాత నెమ్మదిగా లక్ష్మణ్ ప్రభ మసకబారింది. తన ఆటతీరు కూడా విమర్శలపాలైంది. పరుగులు తీయడానికి తడబడేవాడు. దీంతో 2005 గ్రెగ్ ఛాపెల్ కోచ్ గా వచ్చిన తర్వాత లక్ష్మణ్ నాసిరకం ఫీల్డింగ్ కారణంగా వన్డే జట్టులోంచి తొలగించారు. 2006లో గంగూలీతో పాటు లక్ష్మణ్ కూడా దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికయ్యాడు. అలా 1996 నుంచి 2012 వరకు జాతీయ జట్టుకు లక్ష్మణ్ సేవలందించాడు. చివరి టెస్ట్ 2012 జనవరి 24న ఆస్ట్రేలియాతో ఆడాడు.

ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ నకు సిద్ధమయ్యే టీమ్ ఇండియా జట్టుకి కోచ్ గా లక్ష్మణ్ బాధ్యతలు తీసుకోనున్నాడు. వరల్డ్ కప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం పూర్తవనుంది. తర్వాత నుంచి లక్ష్మణ్ భారత జట్టుతో మమేకం అవుతాడు. ఇప్పుడు తన నుంచి మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం. మొత్తానికి భారత క్రికెట్ లో ఎంతోమంది గొప్పగొప్ప ఆటగాళ్లు ఉన్నారు. కానీ వారందరిలో వీవీఎస్ లక్ష్మణ్ మాత్రం నిజంగా వెరీవెరీ స్పెషల్ అని చెప్పాలి.

Related News

India vs Bangladesh Test Match: అదరగొట్టిన భారత్.. 149కే బంగ్లా ఆలౌట్

IND vs BAN 1st Test: కపిల్, ధోనీ సరసన.. అశ్విన్

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్.. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన భారత్..

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Big Stories

×