EPAPER

Kaleshwaram Project : మేడిగడ్డ.. అసలు ఏం జరిగింది..?

Kaleshwaram Project : మేడిగడ్డ.. అసలు ఏం జరిగింది..?

Kaleshwaram Project : 2008 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం, జలయజ్ఞం పథకంలో భాగంగా డా బీ.ఆర్ అంబేడ్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసింది. పదిహేడువేల కోట్ల బడ్జెట్‌తో ప్రాణహిత నది నుండి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మెదక్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో 16.4 లక్షల ఎకరాలకు 160 టీఎంసీల నీటిని అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ని డిజైన్ చేసారు. అందుకు అనుగుణంగా ప్రాణహిత నదిపై తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ నిర్మించి, కాలువల ద్వారా ఎల్లంపల్లికి తరలించాలనే ఉద్దేశంతో 1600 కోట్లతో పనులు ప్రారంభించింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ సర్కార్ కాళేశ్వరం రీడిజైన్ పేరిట తమ్మిడిహట్టి దగ్గర కాకుండా ప్రాణహిత గోదావరి నదుల అనుసంధానానికి దిగువన మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మించి అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌ల ద్వారా నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు లిఫ్ట్ చేసే, ఈ ప్రాజెక్ట్‌కు కాళేశ్వరం అని పేరు పెట్టారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు ఇప్పటివరకు ప్రభుత్వం లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. దీని ఆయకట్టు 18.25 లక్షల ఎకరాలు. పదహారు వేల కోట్ల తో 16.4 లక్షల ఎకరాలకు నీరందించే ప్రాజెక్ట్‌ను రీడిజైన్ పేరిట లక్షా ఇరవై వేల కోట్లతో 18.25 లక్షల ఎకరాలకు నీరందించే ప్రతిపాదన చేసారంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవాల్సిందే.


కాళేశ్వరం, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నఈ ప్రాజెక్ట్ నుండి మొత్తం 240 టీఎంసీల నీటిని లిఫ్ట్ చెయ్యడానికి 7 లింక్‌లు, 28 ప్యాకేజీలుగా ఈ ప్రాజెక్ట్‌ని విభజించింది. అందులో మేడిగడ్డ బ్యారేజీ నుండి 195 టీఎంసీలు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుండి 20 టీఎంసీలు , గ్రౌండ్ వాటర్ నుండి 25 టీఎంసీలు లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో 169 టీఎంసీలు నీటిపారుదల కోసం, 30 టీఎంసీలు హైదరాబాద్ మున్సిపల్ నీటికి, ఇతర పారిశ్రామిక అవసరాలకు 16 టీఎంసీలు, సమీప గ్రామాల్లో తాగునీరు అవసరాలకోసం 10 టీఎంసీల నీటిని వినియోగించేలా ప్రాజెక్ట్ రూపకల్పన చేసారు.

లింక్-1లో భాగంగా మూడు బ్యారేజ్‌లను నిర్మించారు. అవే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితమిస్తూ ఈ మూడు బ్యారేజ్‌లకు పేర్లు మార్చారు. మేడిగడ్డను లక్ష్మి బ్యారేజ్‌గా, అన్నారంను సరస్వతి బ్యారేజ్‌గా, సుందిళ్లను పార్వతి బ్యారేజ్‌గా పేర్లు మారుస్తూ సీఎం కెసిఆర్ నిర్ణయం తీస్కున్నారు. ఈ మూడు బ్యారేజ్‌లలో అతి ముఖ్యమైనది మేడిగడ్డ బ్యారేజ్. ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహాదేవపూర్ మండలంలోని మేడిగడ్డ గ్రామంలో ఈ లక్ష్మి బ్యారేజ్‌ను నిర్మించారు. ప్రాణహిత , గోదావరి సంగమం జరిగే కాళేశ్వరం దిగువన ఈ బ్యారేజ్‌ని నిర్మించారు. మొత్తం 16.17 టీఎంసీల కెపాసిటీ తో నిర్మించిన ఈ బ్యారేజ్ నుండి గోదావరి నది ఎగువన నిర్మించిన అన్నారం బ్యారేజ్‌కు రోజుకి రెండు టీఎంసీల నీటిని, మొత్తంగా 195 టీఎంసీల నీటిని లిఫ్ట్ చెయ్యడానికి ఈ ప్రాజెక్ట్‌ను రూపకల్పన చేసారు. ఈ వాటర్‌ని లిఫ్ట్ చెయ్యడానికి కన్నెపల్లిలో పుంపుహౌస్ నిర్మించారు.అలా అన్నారం బ్యారేజ్ నుండి సుందిళ్లకు అక్కడ నుండి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కి నీటిని లిఫ్ట్ చేస్తారు.ఈ కన్నెపల్లి పుంపుహౌస్‌ను బాహుబలి పుంపుహౌస్ అని పిలుస్తారు. ఇందులో మొత్తం 17 మోటార్స్ ఉన్నాయి. 40 మెగావాట్ల సామర్థ్యంతో ఒక్కో యూనిట్‌ 60 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసే విధంగా దీన్ని నిర్మించారు.గోదావరి నదికి 91 మీటర్ల ఎత్తులో ఈ పుంపుహౌస్‌ను నిర్మించారు.


కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు మేడిగడ్డ బ్యారేజ్ అతి ముఖ్యమైనది. ఈ మేడిగడ్డ బ్యారేజ్.. 110 మీటర్ల పొడవుతో, 4 మీ-6 మీ. వెడల్పుతో, 25 మీ. ఎత్తు ఉన్న భారీ కాంక్రీట్ పిల్లర్ల మధ్య 85 హైడ్రో మెకానికల్ రేడియల్ గేట్‌లను అమర్చారు. ఈ బ్యారేజ్ కోసం వాడిన కాంక్రీట్ పరిమాణం ఏడు బుర్జ్ ఖలీఫాలను నిర్మించడానికి సమానం. ఈ బ్యారేజ్ కోసం వాడిన ఉక్కు పరిమాణం 15 ఈఫిల్ టవర్‌లను నిర్మించడానికి సమానం. తవ్విన భూమి పరిమాణం ఈజిప్ట్‌లోని ఆరు గీజా పిరమిడ్లకు సమానం. ఈ బ్యారేజ్ కోసం కేవలం 24 గంటల్లో 32,315 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌ను వాడి ప్రపంచ రికార్డ్ నెలకొల్పారు.

ఇక ఈ ప్రాజెక్ట్‌లో భాగమైన రెండో బ్యారేజ్.. అన్నారం బ్యారేజ్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని అన్నారం గ్రామంలో నిర్మించిన ఈ సరస్వతి బ్యారేజ్ పూర్తి సామర్థ్యం 11.9 టీఎంసీలు. మేడిగడ్డ నుండి లిఫ్ట్ చేసిన నీటిని అన్నారం సరస్వతి పుంపుహౌస్.. సుందిళ్ల పార్వతి బ్యారేజ్‌కు లిఫ్ట్ చేస్తుంది. ఈ అన్నారం సరస్వతి పుంపుహౌస్‌లో మొత్తం 8 మోటార్లు ఉన్నాయి. ఈ మోటార్లు ప్రతిరోజు రెండు టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఇక సుందిళ్లలోని పార్వతి బ్యారేజ్ నీటిని పార్వతి పుంపుహౌస్ ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు నీటిని లిఫ్ట్ చేస్తారు. పార్వతి బ్యారేజ్ పూర్తి సామర్థ్యం 8.83 టీఎంసీలు.

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుండి మిడ్ మానేర్ రిజర్వాయర్‌కు నీటిని తరలించే పనులను ప్రాజెక్ట్ లింక్ -2లో పూర్తిచేశారు. ఇందులో భాగంగా మేడిగడ్డ నుండి లిఫ్ట్ చేసిన నీటితో మేడారం చెరువును నింపుతారు. ఈ లింక్‌లో ఎలాంటి ఆయకట్టు లేదు. ఇది కేవలం మేడిగడ్డ నుండి లిఫ్ట్ చేసిన నీటిని మిడ్ మానేరు రిజర్వాయర్ తరలించడానికి మాత్రమే. ఇక లింక్-3లో మిడ్ మానేరు రిజర్వాయిర్ నుండి మల్కపేట్ రిజర్వాయిర్‌ని అనుసంధానం చేస్తూ, ఈ నీటిని అప్పర్ మానేరుకు తరలిస్తారు.ఈ లింక్-3 ద్వారా ఎనభై ఆరు వేల నూట యాభై ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా ప్రతిపాదించారు.

లింక్-4లో మిడ్ మానేరు నీటిని మల్లన్నసాగర్ మీదుగా కొండపోచమ్మ రిజర్వాయర్‌కు తరలించడం జరుగుతుంది. ఈ లింక్‌లోనే అనంతగిరి, రంగనాయక్ సాగర్‌కి నీటిని తరలించేవిధంగా దీనిని డిజైన్ చేసారు.ఈ లింక్-4 ద్వారా ఐదు లక్షల ఎనభై తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా ప్రతిపాదించారు. లింక్-5లో కొమురవెల్లి మల్లన్నసాగర్ నుండి గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయిర్‌లకు నీటిని తరలిస్తారు. ఈ లింక్-5 ద్వారా రెండు లక్షల యాభై ఒక్క వేల ఎనమిది వందల ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా ప్రతిపాదించారు.

లింక్-6లో కొమురవెల్లి మల్లన్నసాగర్ నుండి సింగూరు జలాశయానికి నీటిని తరలిస్తారు. లింక్-6 మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల నలభై రెండు ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా ప్రతిపాదించారు. లింక్-7లో మొత్తం మూడు సబ్ లింక్‌లు ఉన్నాయి.అందులో, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుండి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఒకటి; ప్యాకేజీ -27లో నిర్మల్ జిల్లాకు ఒకటి , ప్యాకేజీ-28లో ముథోల్ ప్రాంతానికి ఒకటి. మొత్తం ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఎనమిది ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా ఈ లింక్-7 ద్వారా ప్రతిపాదించారు.

ఈ 7 లింక్స్ లో భాగంగా మొత్తం మూడు బ్యారేజ్‌‌లను , 17 రిజర్వాయిర్‌లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అతి ముఖ్యమైంది కొమురవెల్లి మల్లన్న సాగర్ రిజర్వాయిర్. దీని పూర్తి సామర్థ్యం 50 టీఎంసీలు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా మేడారం, రంగనాయకసాగర్, అనంతగిరి, కొండపోచమ్మ సాగర్, గంథమల్ల, బస్వాపూర్ రిజర్వాయిర్‌లు నిర్మించారు.

గత ఏడాది గోదావరి నది వరదల తాకిడికి కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని కన్నెపల్లి లక్ష్మి పంప్ హౌస్, అన్నారం సరస్వతి పుంపుహౌస్ పూర్తిగా నీటమునిగాయి. ని వలన దాదాపు నలభై కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తే ప్రతిపక్షాలు మాత్రం ఇది దాదాపు వెయ్యి కోట్ల నష్టం అని ఆరోపించారు.

ఇదిలా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కు లైఫ్ లైన్ అని చెప్పే మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్ పరిస్థితి వేరు. రికార్డులు సృష్టించిన ఈ బ్యారేజ్ నేడు గడ్డు పరిస్థితిని ఎదురుకుంటుంది. కనీస వయస్సు తీరకుండానే కాలం చెల్లేలా కనిపిస్తుంది. ఇందుకు నిదర్శనం అక్టోబర్ 21 రాత్రి 5-8 బ్లాక్‌ల మధ్య 15-20 పిల్లర్స్ కుంగిపోవడమే. పిల్లర్లకు పగుళ్లు ఏర్పడటంతో దిగువ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఏ క్షణాన బ్యారేజ్ కు ఎం జరుగుతుందో అని తెలంగాణ ప్రజలు భయాందోళనలో ఉన్నారు.పిల్లర్స్ కుంగిపోయిన సమయానికి బ్యారేజ్ లో 10 టీఎంసీల నీరు ఉంది. ఎలాంటి ప్రమాదం జరగకూడదనే ముందుజాగ్రత్తగా అధికారులు 57 గేట్లను ఎత్తి ఈ నీటిని దిగువ గోదావరికి వొదిలారు. అయితే ఈ పిల్లర్స్ కుంగిపోవడానికి కారణం ఇసుక ఫౌండేషన్ అని అధికారులు చెప్తున్నారు. ఇసుక ఫౌండేషన్‌లో కాల వ్యవధిలో వాయిడ్స్ ఏర్పడి, పిల్లర్స్ కుంగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా ప్రాజెక్ట్‌లు నిర్మించేటప్పుడు రాక్ ఫౌండేషన్ వాడేవారు. కానీ ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా ఫౌండేషన్‌లు కూడా మారుతున్నాయి. అందుకే ప్రస్తుతం ఇసుక ఫౌండేషన్ పద్ధతులు ట్రెండ్‌లోకి వచ్చాయి. ఈ ఇసుక ఫౌండేషన్‌లో పిల్లర్లు నిర్మించడానికి భూమిని తవ్వుతారు. ఈ తవ్వకాలు నీటి పట్టిక దిగువన వుంటే నీటిని మోటర్ల ద్వారా బయటకు పంపిస్తారు. అలా తవ్విన తర్వాత ఫౌండేషన్‌కు నాలుగు వైపుల షీట్‌లను అతికిస్తారు. ఈ షీట్లు మట్టి జరగకుండా చూసుకుంటుంది. టెర్జ్‌గీ ఈక్వేషన్‌ను ఉపయోగించి క్రిటికల్ డెప్త్‌ను కనుగొని సాయిల్ ప్రెషర్ ఎక్కడైతే తగ్గుతుందో అక్కడ ఫౌండేషన్ నిర్మాణం చేస్తారు. సాయిల్ బేరింగ్ కెపాసిటీ ,సాయిల్ షీర్ స్ట్రెంగ్త్‌ను వాడి క్రిటికల్ డెప్త్‌ను కనుగొంటారు.

ఈ నిర్మాణం‌లో ఏ చిన్న లోపం చేసినా పిల్లర్ల‌లో పగుల్లు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మేడిగడ్డ ప్రాజెక్ట్ లో ఇసుక‌లో శూన్యం ఏర్పడి ఇసుక కొట్టుకపోయిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సరైన ప్లానింగ్ లేనందువల్లే ఈ ప్రాజెక్ట్ ఇలా ఎఫెక్ట్ అయ్యింది అని నిపుణులు చెప్తున్నారు. ఒక సంవత్సరం నిర్మాణ కాలానికి కనీసం రెండు సంవత్సరాల ప్రణాళిక అవసరం అని చెప్తున్నారు. ఇసుక ఫౌండేషన్‌ని వాడటం వలన ఇలాంటివి సాధ్యమే అని అధికారులు చెప్తున్నారు.గతంలో గంగా నది పైన బ్యారేజ్‌ల పైన, గోదావరి నదిపై ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఇలాంటివి జరిగినట్టు అధికారులు చెప్పడం శోచనీయం.

కానీ విషయం ఏంటంటే ఆ బ్యారేజ్‌లలో వాడిన టెక్నాలజీ కానీ వాటి డిజైన్‌లో ఉన్న పరిపూర్ణత వలన కానీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. గంగా నది పైన బ్యారేజ్‌లలో పరిస్థితి, ధవళేశ్వరం బ్యారేజ్ పరిస్థితి మేడిగడ్డ కి పూర్తి భిన్నం.త్వరగా పూర్తి చెయ్యాలని తపననో లేదా ప్లానింగ్ లో లోపమో మేడిగడ్డ బ్యారేజ్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇంకా ఇలాగె వుంటే పెద్ద విపత్తు తప్పదేమో..

ఇక్కడ మనం అర్ధంచేసుకోవాల్సింది గోదావరి నది పారివాహక ప్రాంతం అంతా కోల్ బెల్ట్ . బొగ్గు నిల్వలు ఉండటం వల్ల అసలు ఈ ప్రాజెక్ట్ భౌగోళికంగా ఎంత వరకు కరెక్ట్ అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది.ప్రభుత్వం గొప్పలకు పోయి కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను త్వరత్వరగా పూర్తి చెయ్యాల్సి వచ్చింది. భౌగోళిక ప్రమాదాలను సరిగ్గా అంచనా వేయలేకపోవడం వలన ఇలాంటి వైఫల్యాలు జరుగుతాయి. ఎప్పటికైనా ప్రాజెక్టులు సరిగ్గా ప్లాన్ చేసి పక్కాగా అమలు పరిస్తేనే భావితరాలకు ఉపయోగకరంగా ఆశాజనకంగా ఉంటాయి.

.

.

Related News

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Big Stories

×