EPAPER

Seabird : తుఫానులో సీబర్డ్ 11 గంటల పయనం

Seabird : తుఫానులో సీబర్డ్ 11 గంటల పయనం
seabird

Seabird : వలస వెళ్లే పక్షులకు తమ ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లకు లెక్కేలేదు. అనుకూలించని పవనాలు, గాలివానలు, తుఫాన్లు, ఆఖరికి విమానాల వల్ల కూడా ప్రమాదమే. వాతావరణంలో మార్పుల కారణంగా తీవ్రమైన తుఫాన్లు అధికమయ్యాయి. మరి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో పక్షుల వలసలు ఏ మేర ప్రభావితమవుతున్నాయి? ఈ ఆసక్తికర ప్రశ్నకు శాస్త్రవేత్తలు సమాధానం వెతికే ప్రయత్నం చేశారు.


పసిఫిక్ సముద్రంలో వచ్చే తుఫాన్లు విహంగాలపై చూపే ప్రభావాన్ని వారు కొంత మేరకు అంచనా వేయగలిగారు. తమ పరిశోధనలో భాగంగా షియర్ వాటర్స్ అనే సముద్ర పక్షులను ఎంపిక చేసుకున్నారు శాస్త్రవేత్తలు. 2019లో 14 సముద్ర పక్షులకు జీపీఎస్ పరికరాలను అమర్చారు. ఆ పక్షుల గమనాన్ని ట్రాకర్లు నిత్యం రికార్డు చేస్తుంటాయి.

15 నిమిషాలకు ఒకసారి రేడియో కమ్యూనికేషన్ల వ్యవస్థ ద్వారా సమాచారాన్ని చేరవేస్తుంటాయి. బ్రీడింగ్ కాలనీల్లో నెలకొల్పిన రిసీవర్లకు ఈ సమాచారం మొత్తం చేరుతుంటుంది. పక్షులు తిరిగి తమ బ్రీడింగ్ కాలనీకి తిరిగి చేరుకునేంత వరకు వివరాల నమోదు ప్రక్రియ కొనసాగుతుంటుంది.


2019లో పశ్చిమ పసిఫిక్ సముద్రంలో తుఫాను ఏర్పడింది. గంటకు 13 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. జపాన్‌ను చుట్టుముట్టిన అతి భయంకర తుఫాన్లలో అదొకటి. పరిశోధకులు వదిలిన 14 సముద్ర పక్షుల్లో 9 పక్షులు ఆ తుఫాను నుంచి బయటపడగలిగాయి. మరో మూడు ఆ గాలులను ఎలాగోలా అధిగమించి.. ఇంటిదారి పట్టాయి.

ఒకే ఒక్క షియర్‌వాటర్స్ విహంగం మాత్రం ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు పెద్ద పోరాటమే చేసింది. ఎంతగానో శ్రమించి.. ఎట్టకేలకు దానిని అధిగమించినట్టు రిసెర్చర్లు గమనించారు. జీపీఎస్ టైమ్‌లైన్‌ను వారు గమనించినప్పుడు ఎన్నో ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి.

ఆ సమయంలో పక్షి పయనించిన మార్గం, తుఫాను మార్గం ఓవర్‌లాప్ అయ్యాయి. 50-80 కిలోమీటర్ల వ్యాసం ఉన్న వర్తులాకారంలో అపసవ్యదిశలో ఆ పక్షి ఐదు సార్లు చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. వాస్తవానికి షియర్ వాటర్స్ బర్డ్స్ గంటకు 10-60 కిలోమీటర్ల వేగంతో పయనిస్తాయి. పక్షి కదలికలను నమోదు చేసిన జీపీఎస్ ట్రాకర్ మాత్రం 90-170 కిలోమీటర్ల వేగాన్ని చూపడం పరిశోధకులను విస్మయపరిచింది.

బహుశా తుఫాను కన్నులో చిక్కుకుపోవడం వల్ల..ఆ పక్షి గమనవేగం ప్రభావితమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అదీగాక సాధారణ పరిస్థితులకు భిన్నంగా ఎక్కువ ఎత్తులో ఎగిరినట్టు గుర్తించారు. షియర్ వాటర్స్ పక్షులు 600-3 వేల మీటర్ల ఎత్తులో ఎగురుతుంటాయి. అయితే ఆ సమయంలో మాత్రం ఆ పక్షి అంతకుమించి.. అంటే 4700 మీటర్ల ఎత్తులో ఎగరడం పరిశోధకుల దృష్టికి వచ్చింది. మామూలుగా అయితే సముద్ర ఉపరితలానికి సమీపంలోనే ఇవి ఎగురుతుంటాయని పరిశోధకులు తెలిపారు.

తుఫానుతో పాటే ఆ పక్షి 11 గంటల పాటు 1,146 కిలోమీటర్లు పయనించిందన్నారు. తుఫాను నుంచి బయటపడిన అనంతరం ఐదు గంటల పాటు సముద్రంపై చక్కర్లు కొడుతూ సేదదీరిందని వివరించారు. ఒక రకంగా ఆ పక్షి మృత్యువు అంచుల వరకు వెళ్లి వచ్చినట్టుగానే భావిస్తున్నట్టు వెల్లడించారు. క్లైమేట్ ఛేంజ్ ప్రభావం ఆ పక్షి గమనాన్ని ప్రభావితం చేసిందనే చెప్పాలని పరిశోధకులు అంటున్నారు.

పర్యవసానంగా షియర్ వాటర్స్ లాంటి సముద్ర పక్షులకు వాతావరణ మార్పులతో పెనుప్రమాదమే పొంచి ఉందని భావిస్తున్నారు. ఈ పక్షులు ఎక్కువ సమయం సముద్ర ఉపరిలంపైనే గడుపుతాయని, బ్రీడింగ్ కోసం నేలపైకి వస్తుంటాయి. ప్రతికూల వాతావరణం లేదా తుఫాన్ల నుంచి బయటపడగలిగే సత్తా ఉన్నప్పటికీ.. తరచుగా, మరింత పెద్దగా సంభవించే హరికేన్ల నుంచి అవి భద్రంగా ఉండటం దాదాపు అసాధ్యం కావొచ్చని పరిశోధకులు అనుమానిస్తున్నారు.

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×