EPAPER

AUS vs NED: నెద‌ర్లాండ్స్ పై 309 ప‌రుగుల తేడాతో ఆసీస్‌ ఘ‌న విజ‌యం…

AUS vs NED: నెద‌ర్లాండ్స్ పై 309 ప‌రుగుల తేడాతో ఆసీస్‌ ఘ‌న విజ‌యం…

AUS vs NED: పెద్ద జట్లు చిన్న జట్లపై రెచ్చిపోయి ఆడుతుంటే, చిన్నజట్లు కూడా పెద్ద జట్లకు ఝలక్ లు ఇస్తున్నాయి. అయితే 2023 వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఆస్ట్రేలియా-నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ ఏకపక్షంగా సాగిపోయింది. మొదట ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో ఏకంగా 399 పరుగులు చేసింది. లక్ష్యం పెద్దదిగా ఉండటంతో నెదర్లాండ్ బ్యాట్స్ మెన్ ప్రతి బాల్ ని హిట్టింగ్ చేస్తూ త్వరత్వరగా 90 పరుగులకి ఆలౌట్ అయిపోయారు. ప్రపంచ కప్ చరిత్రలో 309 పరుగుల భారీ తేడాతో గెలిచి ఆస్ట్రేలియా అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది.


టాస్ గెలిచి ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ తీసుకుంది. ఓపెనర్లు మార్ష్, డేవిడ్ వార్నర్ వచ్చారు. మార్ష్ (9) త్వరగా అవుట్ అయిపోయాడు. ఫస్ట్ డౌన్ స్టీవ్ స్మిత్ వచ్చాడు. రిటైర్మెంట్ కి దగ్గరగా ఉండి, వరుస వైఫల్యాలతో తడబడుతూ ఈ మ్యాచ్ లో మళ్లీ ట్రాక్ లో పడ్డాడు. 71 పరుగులు చేసి ఆర్యన్ దత్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అప్పటికి 23.3 ఓవర్లు గడిచాయి. ఆస్ట్రేలియా 2 వికెట్ల నష్టానికి 160 పరుగులతో పటిష్టమైన స్థితిలో ఉంది. తర్వాత లబూషేన్ వచ్చి 47 బాల్స్ లో 62 పరుగులు చకచకా చేసి బాస్ డీ లిడే బౌలింగ్ లో అవుట్ అయిపోయాడు.

అప్పుడు వచ్చాడండీ మొనగాళ్లకు మొనగాడు మ్యాక్స్ వెల్…వచ్చీరాగానే బట్టలని బండకేసి బాదినట్టు..బాల్ ని పట్టుకుని ఎడా పెడా బాదేశాడు. బౌలర్లు ఎలా వేసినా సరే, మామూలుగా కాదు చాకిరేవు పెట్టేశాడు. 40 బంతుల్లో సెంచరీ చేసి వరల్డ్ కప్ లో అత్యంత వేగంగా చేసిన బ్యాట్స్ మెన్లలో నెంబర్ వన్ స్థానానికి చేరాడు. అలా 44 బంతుల్లో 106 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.


అయితే అంతకుముందు ఓపెనర్ గా వచ్చిన డేవిడ్ వార్నర్ మరో సెంచరీ చేసి మళ్లీ తగ్గేదేలే అన్నాడు. అదే స్టయిల్, అవే ఎక్స్ ప్రెషన్స్  తో రెచ్చిపోయాడు.
ఇలా ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లు ఒక్కరు తప్ప అందరూ పసికూన నెదర్లాండ్ పై ప్రతాపాన్ని చూపించారు. ఈ నేపథ్యంలో బాస్ డి లెడే ప్రపంచకప్ లో అత్యంత చెత్త బౌలింగ్ వేసిన రికార్డ్ మూటగట్టుకున్నాడు. 10 ఓవర్లలో 2 వికెట్లు తీసి 115 పరుగులు సమర్పించుకున్నాడు. వీటిలో ఎక్కువ మాక్స్ వెల్ కొట్టినవే ఉన్నాయి. మొత్తానికి 8 వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 399 పరుగులు చేసింది.

నెదర్లాండ్ బౌలర్లలో వాన్ బీక్ 4, బాస్ డీ లెడే 2, ఆర్యన్ దత్ 1 వికెట్టు పడగొట్టారు.

400 పరుగుల భారీ లక్ష్యసాధనకు దిగిన నెదర్లాండ్ జట్టు ఏ దశలోనూ పోరాట పటిమ చూపించలేదు. ఉత్తినే ఏదో ప్రాక్టీస్ మ్యాచ్ కి వచ్చి ఆడినట్టు ఆడేసి వెళ్లిపోయారు. ఓవర్ కి 8 పరుగుల లక్ష్యం కావడం, ఒక్క ఓవర్ డిఫెన్స్ ఆడినా రన్ రేట్ అమాంతం పెరిగిపోయే అవకాశం ఉండటంతో, ఇక చావో రేవో అన్నట్టే దిగారు. తగిలితే మ్యాక్స్ వెల్ లా క్లిక్ కాకపోతామా? అన్నట్టు ఆడారు. ఒకరి తర్వాత ఒకరు చాప చుట్టేశారు. 21 ఓవర్లలో 90 పరుగులకి ఆలౌట్ అయ్యారు.

ఓపెనర్ విక్రమ్ జిత్  సింగ్ ఒక్కరే 25 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా ఉన్నారు. మాక్స్ ఔడౌడ్ (6), అకెర్మాన్ (10), బాస్ డీ లీడే (4), మన తెలుగువాడైన తేజ నిడమనూరు (14) వాన్ బీక్ (0), వాన్ డెర్ మెర్వే (0), ఆర్యన్ దత్ (1), వాన్ మీకెరన్ (0) ఒకరి తర్వాత ఒకరు క్యూ కట్టుకుంటూ పెవెలియన్ బాట పట్టారు.
నువ్వు ఒకటంటే నేనేం తక్కువా అన్నట్టు ఒకరిని మించి ఒకరు అవుట్ కావడంలో తొందర పడ్డారు. చివరికి వికెట్ కీపర్ ఎడ్వర్డ్ (12) నాటౌట్ గా నిలిచారు.
ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా 4, మార్ష్ 2, స్టార్క్, హేజిల్ వుడ్, కమిన్స్ ఒక్కో వికెట్టు తీశారు.
అయితే ‘పసికూనల మీదా మీ పెతాపము’ అని ఆస్ట్రేలియాపై నెట్టింట అప్పుడే మీమ్స్ వచ్చేస్తున్నాయి. ‘అంత సంతోషం పనికిరాదురా అబ్బాయిలూ..అది పిల్ల జట్టు’ అని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×