EPAPER

Ranthambore: ఉత్తరాల దేవుడు.. ఈ గణపయ్య..!

Ranthambore: ఉత్తరాల దేవుడు.. ఈ గణపయ్య..!

Ranthambore: మనదేశంలో అనేక విశేషమైన దేవాలయాలున్నాయి. వాటిలో రణథంబోర్‌లోని త్రినేత్ర గణపతి ఆలయం ఒకటి. జీవితంలో ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చి, దానికి పరిష్కారం లభించని పక్షంలో ఈ స్వామికి ఓ ఉత్తరం ముక్క రాసి పడేస్తే చాలు. మీ సమస్యకు పరిష్కారం చూపే బాధ్యత ఆ గణపయ్యే తీసుకుంటాడు.


రాజస్థాన్ రాష్ట్రంలోని సవాయి మాధోపూర్ జిల్లాలోని రణథంబోర్‌లో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని రణభన్వర్ ఆలయం అనీ అంటారు. భారతదేశంలోని తొలి గణేశ ఆలయంగా దీనిని చెబుతారు.

ఆరావళి, వింధ్య పర్వతాల సంగమ స్థానంలో ఈ కోవెల ఉంది. ఇంట్లో ఏ శుభకార్యం చేపట్టినా ముందుగా ఆహ్వానం ఈ స్వామికి పంపటమే గాక.. ఏ సమస్య వచ్చినా భక్తులు ఇక్కడి గణపయ్యకి ఓ ఉత్తరం రాసి పంపుతారు.


సంపూర్ణ విశ్వాసంతో స్వామికి లిఖిత పూర్వకంగా విన్నవించుకునే అనేక సమస్యలకు చక్కని పరిష్కారాలను ఆ స్వామి సూచిస్తాడని భక్తుల నమ్మకం.

1299-1301 మధ్యకాలంలో స్థానిక పాలకుడైన మహారాజా హమీర్ దేవ్ చౌహాన్, ఢిల్లీ పాలకుడైన అల్లావుద్దీన్ ఖిల్జీలకు మధ్య ఘర్షణ కారణంగా, ఖిల్జీ సేనలు నెలల తరబడి రణథంబోర్ కోటను ముట్టడించాయి.

దీంతో కొండమీద కోటలోని నిత్యావసరాలన్నీ నిండుకున్నాయి. ఆ కష్టకాలంలో గణేశుడు.. రాజుగారికి కలలో కనిపించి కోటగోడలో అజ్ఞాతంగా ఉన్న తన విగ్రహాన్ని తీసి పూజించమని ఆదేశించాడట.

ఆ ప్రదేశాన్ని కనుగొన్న రాజు కోట గోడను పగలకొట్టించగా, అక్కడ గణపతి విగ్రహం కనిపించిందట. విచిత్రంగా ఆ మరునాడే.. విసిగిపోయిన ఖిల్జీ సేనలు ఈ ప్రాంతం నుంచి స్వచ్ఛందంగా వెనుదిరిగాయట.

రుక్మిణీదేవిని వివాహమాడే సమయంలో శ్రీకృష్ణుడు.. విఘ్నాధిపతిని ఆహ్వానించటం మరిచిపోయాడట. దీంతో ఆ వివాహానికి బయలుదేరిన కృష్ణుని రథాన్ని ముందుకుపోనీయకుండా.. దారి పొడవునా కోతులు పెద్దపెద్ద గుంతలు తవ్వాయట. దీనికి కారణం తెలుసుకున్న కృష్ణడు గణపయ్యను క్షమాపణ కోరటంతో బాటు తన వివాహపు శుభలేఖను ఆయనకు అందించాడట.

బుధవారం స్వామి దర్శనం కోసం పెద్దసంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఈ ఆలయం రణథంబోర్ టైగర్ రిజర్వ్ ప్రాంతం మధ్యలో ఉండటంతో భక్తులు ఇక్కడి అరుదైన వృక్షసంపద అందానికి ముగ్ధులవుతుంటారు.
రైలులో సవాయి మాధోపూర్ స్టేషన్‌లో దిగితే.. అక్కడి నుంచి 10 కి.మీ దూరంలో ఈ ఆలయం ఉంటుంది.
మీరూ మీ సమస్యను, ఆహ్వానాన్ని స్వామికి పంపాలనుకుంటే.. రణథంబోర్ త్రినేత్ర గణేశ ఆలయం, సవాయి మాధోపూర్, రాజస్థాన్ – 322021 అనే అడ్రస్‌కు పంపి ఆ గణపయ్య ఆశీస్సులను పొందొచ్చు.

Related News

Shukra Gochar 2024: తులా రాశితో సహా 5 రాశుల వారికి ‘శుక్రుడు’ అపారమైన సంపద ఇవ్వబోతున్నాడు

Shani Margi 2024 Effects: దీపావళి తరువాత కుంభ రాశితో సహా 5 రాశుల వారి జీవితంలో డబ్బే డబ్బు..

Shradh 2024: మీ పూర్వీకులు కోపంగా ఉన్నారని సూచించే.. 7 సంకేతాలు ఇవే

Vastu Tips: వంట గదిలో ఈ 2 వస్తువులను తలక్రిందులుగా ఉంచితే ఇబ్బందులే..

Bhadra Mahapurush Rajyog Horoscope: ఈ రాశి వారిపై ప్రత్యేక రాజయోగంతో జీవితంలో భారీ అభివృద్ధి

Dussehra 2024 Date: ఈ ఏడాది దసరా పండుగ ఏ రోజున జరుపుకుంటారు? శుభ సమయం, ప్రాముఖ్యత వివరాలు ఇవే

Sun Transit Horoscope: సూర్యుని దయతో ఈ రాశుల వారికి గోల్డెన్ టైం రాబోతుంది

Big Stories

×