EPAPER
Kirrak Couples Episode 1

Tribe: కట్టప్ప బతుకులు.. గాయపడిన వేటగాళ్లు ..

Tribe: కట్టప్ప బతుకులు.. గాయపడిన వేటగాళ్లు ..

Tribe Life Style:రాజ్యాల రక్షణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన వీరోచిత జాతి వారిది. భూజాలు కుంగిపోయేలా ప్రభువుల పల్లకీలు మోసిని చేతులు వారివి. నేరస్ధులైన తెగగా బ్రిటిష్ ప్రభుత్వం ముద్రవేసి.. ప్రభుత్వ ఉద్యోగాలకు దూరంచేసినా వెరవక తెగువ చూపిన ధీరులువారు. అచ్చంగా చెప్పాలంటే తమను నమ్మిన వారికోసం ప్రాణాలు సైతం అర్పించే ఆధునిక కట్టప్పలే.. వాల్మీకి బోయలు.


నిజానికి బోయలు అడవి బిడ్డలు.వనాలే లోకంగా బతికిన బోయలను మైదాన ప్రాంతాలకు రప్పించింది నాటి రాజరిక వ్యవస్ధే. క్రూరమృగాల నుంచి గ్రామాల రక్షణ కోసం.. కాపలా వీరులుగా బోయలను నియమించేవారు. అలా క్రమంగా అడవులకు దూరమైన బోయలు రాజుల అంగరక్షకులుగా మారారు. మౌర్యుల నుంచి విజయ నగర సామ్రాజ్యం దాకా అనేక రాజులు,చక్రవర్తులకు రక్షణకవచం బోయలే.

బోయలు విశ్వసనీయతకు మారుపేరు. పల్లకీ మోసే సేవకులుగానే కాదు..సైనికులుగా, అంగరక్షలుగా బోయలకు తగిన ప్రాధాన్యం ఉండేది.రాజులు,రాజ్యలు పోయాక కూడా స్వతంత్రోద్యమ కాలంలో కూడా పోరాట పటిమ చూపారు బోయలు.వీరి తిరుగుబాటు స్వభావానికి బెదిరిన బ్రిటీష్ సర్కారు 1871లో బోయ తెగని క్రిమినల్ ట్రైబ్ గా ముద్రవేసింది. కొన్నేళ్ల తర్వాత బోయల చరిత్రను గుర్తించిన బ్రిటిష్ సర్కారు నేరస్థజాతుల చట్టం నుంచి వీరిని తొలగిస్తూ డీనోటిఫైడ్ చేసింది. మన దేశానికి స్వాతంత్రం సిద్ధించాక కూడా బోయల బతుకులు మారలేదు. వీరి పోరాటశక్తిని తమ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకున్నాయి భూస్వామ్య వర్గాలు.తరతరలా ఫ్యాక్షన్ చరిత్రలో సమిధలుగా మార్చాయి.


1956 పూర్వం వరకు బోయలు ఎస్టీలుగానే ఉన్నారు. కానీ భాషా ప్రయుక్తరాష్ట్రాల ఏర్పాటు బోయలకు అశనిపాతంగా మారింది. 1956లో ఏపీ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి వీరిని ఎస్టీ జాబితా నుంచి తొలగించారు. కేవలం ఏజెన్సీ ప్రాంతాల్లోని బోయలకు మాత్రమే ఎస్టీ గుర్తింపు వర్తిస్తుందని తేల్చిచెప్పారు. ఇతరులందరినీ బీసీ Aలో చేర్చారు. దీంతో నాటి నుంచి నేటివరకు ఆరున్నర దశాబ్దాలుగా రిజర్వేషన్లకు దూరమయ్యారు బోయలు. ఓ వైపు రిజర్వేషన్లు లేక మరోవైపు చేసుకునేందుకు వృత్తంటూ లేక సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాల్లో వెనకబాటుకు గురయ్యారు. భారమైన బతుకులను నెట్టుకొచ్చేందుకు ఎవరో ఒకరి పంచన కూలీలుగా జీవిస్తున్నారు.

తెలంగాణలో అత్యధిక సంఖ్యలో బోయలు నివసించే జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్. దాదాపు 4 లక్షల మంది ఇక్కడ బతుకున్నారు. మిగతా అన్ని ప్రాంతాల్లో కలిపి మరో 2 లక్షల మంది ఉంటారు. రాష్ట్రజనాభాలో బోయలది కేవలం ఒక్కశాతమే. ఇప్పటికి ఎన్నో బోయ కుటుంబాలు దుర్బర జీవితాలను గడుపుతున్నాయి. ఏ కొందరికో ఎకరమో, అరకరమో పొలం ఉంది. అది కూడా అమ్ముకోవడానికి వీలు లేని సీలింగ్ పట్టా భూమి. దీంతో.. రెక్కల కష్టం తప్ప మరేమి లేని దుస్థితి. ఆ ఉన్న కాసింత పొలంలోనే వ్యవసాయం చేస్తూ పశువులు, గొర్రెలు, కోళ్లు పెంచుతూ జీవిస్తున్నారు. మరికొందరు పొట్టచేతపట్టుకొని వలస బాటపడుతున్నారు.

బోయలకు ఒక వృత్తి అంటు లేకపోవడం వ్యవసాయ భూములు కూడా పెద్దగా లేకపోవడం వల్ల కూలి పని ద్వారా వచ్చే ఆదాయ వనరులే దిక్కు. చాలా కుటుంబాల్లో పొట్టకు బట్టకు కరువే. ఏ రోజు కారోజు జీవితం గడిస్తే చాలు అనే పరిస్థితే. ఇక ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ ఇంట్లో పిల్లాడు చదువు మాని గాసానికి పోవాల్సిందే. గాసం అంటే ఏడాదిపాటు ఒక ఇంటికి కూలిగా పోవాల్సిందే. వెట్టిచాకిరీ చేయాల్సిందే!

రంగస్వామి జోగులాంబ జీల్లాలోని సాతర్ల గ్రామవాసి. కూతురు పెళ్లికి రూ.3 లక్షలు అప్పుచేశాడు. ఆ అప్పు తీర్చడానికి కొడుకును గత నాలుగు సంవత్సరాలుగా గాసం పెట్టాడు. ఈ ఏడాదికి కూడా రంగస్వామి తన కోడుకును లక్షా పదిహేను వేలకు ఒక ఇంట్లో గాసం పెట్టాడు. ఒక్క రంగస్వామే కాదు చాలామంది బోయ కుటుంబాల్లో ఇదే పరిస్థితి.

పేదరికంలో మగ్గిపోతున్న బోయలకు కోళ్లు,మేకలు,ఎడ్లే జీవనాధారం. ఆపతి సోపతికి అక్కరొచ్చేవి ఇవే. అవసరమైనా, అనారోగ్యమైనా పెంచుకున్న కోళ్లు, మేకలను అమ్మకానికి పెట్టుబడే పెద్ద అవసరాలకు ఎద్దును అమ్మి తమ అవసరాలను తీర్చుకుంటారు. ఎందుకిలా అని ప్రశ్సిస్తే వారి నుంచి వచ్చిన సమాధానం మనసును కలిచి వేస్తుంది. తమకు ఆస్తులు పొలాలు ఉండవు కాబట్టి ఏం చూసి మీకు అప్పు ఇవ్వాలి అనే సమాధానమే అందరి నుంచి వస్తుందని దీంతో ఆపత్కాలంలో అక్కరొచ్చేందుకు జీవాలను పెంచుతుంటారు.

మరికొన్ని కుటుంబాలకు నిలువ నీడకూడా కరువే. ఈమె పేరు సుజాత. సొంత ఇళ్లుగానీ పొలం కానీ లేదు. భర్త కూలి పనికి వెళ్తాడు. స్థలాన్ని అద్దెకి తీసుకొని గుడిసె వేసుకొని బతుకుతున్నారు. ఇద్దరు ఆడపిల్లలు. మధ్యలోనే చదువు ఆపేసి తమ పెళ్లి ఖర్చుల కోసం రోజు కూలికి వెల్లాల్సిన దుస్థితి.

బోయల బతుకంతా బుక్కెడు బువ్వకోసం పోరాటం చేయడమే. పొద్దంతా పనిచేస్తే వచ్చే ఆదాయం రోజువారి అవసరాలకే సరిపోదు. దాంతో ఎప్పుడైనా మాంసం తినాలనిపిస్తే ఉచ్చు తీసుకొని సమీప అడవిలోకి వెళ్తారు. అడవి పందులను, కుందేళ్లను వేటాడి తెచ్చుకొని తింటారు. వీరికి వైద్యానికి కూడా దేవుడే దిక్కు. ఆపతొస్తే జమ్ములమ్మను వేడుకుంటారు. ఈత కల్లును ఎల్లమ్మ దేవత ప్రసాదంగా భావించి తాగుతారు. అదే వారికి తెలిసిన సర్వరోగ నివారిణి మందు. వీరి తిండి కూడా మారలేదు. ఆర్థిక ఇబ్బందుల వల్ల కూరగాయలు లేనప్పుడు అన్నంలో నీరుపోసుకొని ఉల్లిగడ్డ పచ్చి మిరపకాయలతో సరిపెట్టుకుంటారు. ప్రభుత్వం సిలిండర్లు ఇచ్చినప్పటికి వాటి మీద వంట తమ ఆర్థిక పరిస్ధితికి సరిపోక పోవడంతో మళ్లీ కట్టెల పొయ్యె వంటకే మారారు.

బోయల్లో చాలా వరకు నిరక్షరాస్యులే.పేదరికం, బతుకు దెరువుకోసం వలసలతో వీరి పిల్లలు కూడా విద్యకు దూరమవుతున్నారు. మెత్తం బోయ సామాజికవర్గ అక్షరాస్యత కేవలం 15 శాతంలోపే. ఎవరో కొంతమంది తప్పితే చాలామందికి తమ పిల్లల చదువుల పట్ల కనీస అవగాహలేదు.

అన్నికాలాల్లో తమ గ్రామాల్లో బతుకు తెరువు ఉండక పోవడం వల్ల చాలామంది బోయలు చింతపులుసు దేశాలకు వలసపోతుంటారు. ఇంతకీ ఏంటీ చింతపులుసు దేశం. చింతపులుసు దేశాలకు వలసపోయేటప్పుడు బోయల గోస వర్ణానాతీతం. గ్రామాలలో చిన్న పిల్లలను చూసుకునే పెద్దవారు ఉంటే వారి దగ్గర వదిలి పోతుంటారు. లేదంటే గుడిసెలకు తాళం పెట్టి తమ బిల్లలను చంకనెత్తుకొని పరాయి ప్రాంతాలకు పోతారు.

కొందరు రాజకీయ నాయకుల అనాలోచిత నిర్ణయాలు తమ జాతికి శాపంగా మారాయని వాపోతున్నారు బోయలు. తమను ఎస్టీల నుంచి తొలగించి తమ గొంతుకోసారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రం తొలి మఖ్యమంత్రి సంతకం తమ తలరాతను తల్లకిందులు చేసిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నాకు. కనీసం తెలంగాణ వచ్చాకైనా తమ బతుకులు మారుతున్నాయని ఆశపడ్డారు. ఎందరో నాయకుల కాళ్లు పట్టుకున్నారు. తమ సామాజిక వెనకబాటుతనం పోవాలన్నా తమ బిడ్డల భవిష్యత్ బాగుపడాలన్నా బోయలను తిరిగి ఎస్టీలలో కలిపి రిజర్వేషన్ వర్తింప చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

బోయల దుస్థితిని తెలుసుకున్న సీఎం కేసీఆర్ వారిని ఎస్టీలలో చేర్చి న్యాయం చేస్తామన్నారు. ఇది ఇప్పటి మాటకాదు. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లది. అంతేకాదు 2015లోనే చెల్లప్ప కమిషన్ కూడా వేశారు. ఈ త్రిసభ్య కమిషన్ కు నివేదిక ఇవ్వడానికి 6 నెలలు సమయం ఇచ్చారు. ఆ తదుపరి మరో ఆరు నెలలు పొడిగించారు. ఆ తర్వాత చెల్లప్ప కమిషన్ తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో తిరిగి.. బోయల పరిస్థితులను అధ్యయనం చేసింది. బోయలను కాయతి లంబాడీలను ఎస్టీలుగా గుర్తించాలని సూచించింది. వీరిని కలిపి మెత్తం ఎస్టీ రిజర్వేషన్లు 12 శాతం వరకు అమలుచేయాలని పేర్కొంది. దీన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం తదుపరి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బోయలకిచ్చిన హమీ నెరవేరుస్తామని చెప్పారు. ఐతే ఆ మాట ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. కేసీఆర్ మళ్లీ ఆ ప్రస్తావనే తేలేదు.

ఈ మధ్య కాలంలో జీవో నెంబర్ 33 తీసుకువచ్చి ఎస్టీ రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచారు. ఐతే బోయలను ఎస్టీల్లో కలపడం విస్మరించారు. దీంతో బోయ నేతలు ఎన్నోమార్లు అధికారులకు, మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చారు. వేడుకున్నారు. అటు ఆన్ లైన్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తులు పంపారు. మోదీ సర్కారు మాత్రం మీ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం పంపలేదని తేల్చిచెప్పింది. ముందు వాళ్లు తీర్మానం పంపితే మేం పరిశీలిస్తామని సమాధానం చెప్పింది.

ఎనిమిదేళ్లుగా ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వాలు స్పందించకపోవడంతో బోయలు పోరుబాట పట్టారు. జిల్లా కేంద్రాల్లో టెంట్లు వేసుకొని మరీ ఆందోళన చేశారు. దీంతో.. తప్పని సరై ప్రభుత్వం స్పందించింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో బోయలు సమావేశం అయ్యేలా చేశారు. బోయలను ఎస్టీల్లో కలిపే అంశానికి సంబంధించి త్వరలోనే అసెంబ్లీ సమావేశాలలో బిల్లు పెట్టి తీర్మానం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికే ఇటువంటి ఎన్నో హమీలను చూసి విసిగిపోయి ఉన్న బోయు పోరాటం మాత్రం వీడమంటున్నారు. అసెంబ్లీ సమావేశాలలో తీర్మానం జరిగేదాకా నమ్మే పరిస్థితి లేదంటున్నారు. ఈసారైనా కేసీఆర్ సర్కారు మాట నిలబెట్టుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. కానీ ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదు.మొత్తంగా గాయపడిన వేటగాళ్ల చరిత్రను తిరగరాసే పోరాటాన్ని చేస్తున్నారు బోయలు. ఎస్టీల్లో చేర్చి రిజర్వేషన్లు అమలు చేయాలన్న వారి ఆకాంక్ష నెరవేరాలని ఆశిద్ధాం.

Related News

మేఘా అవినీతి ముసుగులో అధికారులు..!

TDP MLA Koneti Adimulam Case: నా ఇష్టంతోనే ఆ పని! ఆదిమూలం బాధితురాలు సంచలనం

Mossad Secret Operations : టార్గెట్ చేస్తే శాల్తీ లేవాల్సిందే.. ప్రపంచాన్నిషేక్ చేస్తున్న ఇజ్రాయెల్ మొసాద్

Tirupati Laddu Controversy: 300 ఏళ్ల చరిత్రకి మరకలు పడ్డాయా.. తిరుపతి లడ్డూ గురించి ఎవరికీ తెలియని నిజాలు

Kutami Strategy: ఎన్నికల ప్రచారంలో పవన్ చేసిన ఛాలెంజ్ నిజమవుతోందా ? సీనియర్లు ఏమంటున్నారు ?

BRS BC Plan: బీసీ మంత్రాన్ని జపిస్తోన్న బీఆర్ఎస్.. కాంగ్రెస్ పోస్ట్ తో కేటీఆర్ కామెంట్స్ వైరల్

Young India Skill University: ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ తో స్కిల్ హబ్ గా తెలంగాణ..

Big Stories

×