EPAPER

POLALLO ISUKASAMADHULU: కేసీఆర్ మానస పుత్రిక.. ఆ రైతులకి శాపంగా మారిందా?

POLALLO ISUKASAMADHULU: కేసీఆర్ మానస పుత్రిక.. ఆ రైతులకి శాపంగా మారిందా?
telangana news live

POLALLO ISUKASAMADHULU(Telangana news live):


వ్యవసాయం అక్కడ సంక్షోభంలోకి చేరిపోయింది. పంటపొలాలపై ఇసుక సమాధులు వెలిచి ముళ్లచెట్ల మాటున ఎందరో రైతుల జీవితాలు చేరిపోయాయి. పక్కనే గోదావరి తమ పొలాల్లో పారుతుందనుకుంటే తమ గుండేలను ముంచి తమ బతుకులను ప్రశ్నార్ధకం చేస్తుందని ఊహించని ఆ బడుగు రైతులు తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దమని వేడుకుంటున్నారు. ఎవరా రైతులు వారి కొచ్చిన ఆపదేంటో తెలుసుకుందాం.

తెలంగాణలో భూములు కోట్లు పలుకుతున్నాయి.అర్ధ ఎకరమున్నా ఏ రైతైనా కోటీశ్వరుడేనన్నమాట. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ పదేపదే చెబుతున్నదే.ఎంత మంచి ముచ్చటనో కదా. మరి ఎకరాలకు ఎకరాలున్న రైతులు ఎంత సంతోషంగా ఉండాలి. కింగ్ లాగా ఉండాలి కదా. కానీ కొన్ని జిల్లాల్లో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. మా భూములు తీసుకో కేసీఆర్ మాకు కనీస ధర చెల్లించినా చాలని బతిమిలాడుకోవాల్సన దుస్థితి. అంటే అక్కడి అన్నదాతలు ఎంత భయంకర పరిస్థితిని అనుభవిస్తున్నారో ఊహించగలమా.


ఏ రైతుకైనా పొలమంటే తల్లితో సమానం. పొలం అండగా ఉంటే భవిష్యత్ కు భరోసా ఉంటుంది. ఓ ఏడు ఎండినా మరో ఏడు పండుతుందిలే అనే ధైర్యం ఉంటుంది. ఆపతి సాపతికి అప్పు పుడుతుంది. అవసరానికో ఆడబిడ్డల పెళ్లిలకో ఎకరం అమ్ముకోవచ్చులేనన్న దీమానిస్తది. చేతనైనన్ని నాళ్లు సొంత సేద్యం చేవలేని నాడు కౌలుకు ఇచ్చుకుంటే జీవితం జరిగిపోతుంది. నల్లరేగడి పొలాలు కాబట్టి ఎకరాకు 20 వేలు ఎటుపోవు. ఏ గింజ వేసినా సిరులు పండుతాయి. ఇదీ ఒకప్పటి అక్కడి రైతుల విశ్వాసం. కానీ ఇప్పుడు పరిస్థితి తల్లకిందులైంది. ఇప్పుడు తమ పొలాలను చూస్తేనే వారికి గుండెతరుక్కుపోతోంది. సారవంతమైన భూములు సముద్రతీరంలా మారిపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి. సాగుకు పనికిరాదు అమ్ముదామంటే ఆఖరికి సర్కారు కూడా కొనట్లేదు.ఇదీ రైతు రాజ్యమని చెప్పుకుంటున్న తెలంగాణలోనే మంచిర్యాల,పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కొందరు అన్నదాతలు అరిగోస దృశ్యం.ఇంతకీ ఈ రైతుల ఇక్కట్లకు కారణమెవరు?

ఓ పక్క గోదావరి మరో పక్క ప్రాణహిత. రెండు నదులుండగా తమ బతుకులకేం ఢోకా ఉండదనుకున్నారు. తరాలుగా వ్యవసాయాన్నే జీవనాధారంగా చేసుకున్నారు. నల్లరేగడి భూముల్లో ఏటా రెండు నుంచి మూడు పంటలు పండించుకున్నారు.ఉన్నంతలో హాయిగా బతికేవారు ఆ రైతులకు కాళేశ్వరం ప్రాజెక్టు శాపంగా మారింది. వారి జీవనోపాధిని,జీవితాలనూ తలకిందులు చేసింది. నల్లబంగారం అనుకున్న పొలాలను ఎడారిగా మార్చిపారేసింది. గుండెలు తడారిపోయేంతగా తల్లి గోదావరి తమను గోస పెడుతుందని వారెన్నడూ ఊహించలేదు.దీంతో కాళేశ్వరం బ్యాక్ వాటర్ కారణంగా కళ్లెదుటే ఇసుక సమాధుల్లా మారిన పొలాలను చూసి ఏమీ చేయలేక తల్లడిల్లుతున్నారు ముంపు ప్రాంత రైతులు.

కనుచూపుమేరంతా ఇసుక. ఎక్కడికక్కడ మెలిచిన తుమ్మలు. ఎడారి ముళ్లమెక్కలతో నడుములోతు ఇసుకమేటలు.దానికింద సమాధి చేయబడ్డ పొలాలు. ఇవీ మంచిర్యాల,పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మనకు కనిపించే పరిస్థితులు. గతంలో ఏపుగా పెరిగిన పత్తి, మిర్చి లాంటి వాణిజ్య పంటలతో కళకళలాడిన ఈ ప్రాంతం.ఇప్పుడు వరదతాకిడి అతలాకుతలమైంది.గంగ ముంచిన నేలలో బతుకు భారమై రైతులు ఆదుకునే వారి కోసం ఎదురుచూస్తున్నారు.

వీరంతా చిన్న సన్నకారు రైతులు. భూమిని నమ్ముకొని బతికిన వీరి జీవితాలు ఇప్పుడు ఆగమైపోయాయి. పొలాల్లో పేరుకుపోయిన ఇసుక కుప్పల్లాగానే అప్పులు కూడా పెరిగి భరించలేనంత మోపవుతున్నాయి. పంటలేక, పనిలేక,పైసా సంపాదన లేక అవస్థలు పడుతున్నారు. మరికొందరు కూలీ పనులుకు పోతున్నారు. ఇతర చోట్ల కౌలు రైతులుగా బతుకులు వెళ్లదీస్తున్నారు.

మంచిర్యాల జిల్లా గోదావరి ప్రాణహిత పక్కన ఉన్న కొల్లురు ,రావులపల్లి గ్రామాలకు చెందిన రైతుల పంటపొలాలు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ సమస్య వల్ల మంచి సారవంతమైన భూములు ఇసుకమేటలేశాయి. నాలుగేళ్గుగా సాగు సాగని పరిస్థితి.ఇసుక మేటలను తొలగించుకోవాలన్నా లక్షల రూపాయలు ఖర్చుచేయాల్సిందే.పోనీ అప్పో సొప్పో చేసి ఆ పనిచేద్దామన్నా అదెంతో కాలం సాగని పరిస్థితి. కాళేశ్వరంలో నీరు నిలువచేసిన ప్రతీసారీ ఇక్కడ బ్యాక్ వాటర్ ముంచెత్తుతాయి.పెరిగిన పంట,గొడ్డూ,గాద అంతటిని ముంచెత్తుతాయి. కొన్నాళ్లకు వరద తగ్గినా అప్పటికే అన్నదాతలు చెమటోడ్చి పండించిన పంటలు గంగార్పణమై పోతాయి.చుట్టుపక్కల భూములన్నింటినీ ఆక్రమించుకొన్న ఇసుకతో పొలాలు బీచ్ లుగా మారిపోతాయి.

గతంలో కూడా ప్రతీ ఏడాది గోదావరి పోటెత్తి వరద ముంచెత్తేది. ఐతే వర్షాలు తగ్గగానే నీరంతా పోయి మళ్లీ సాధారణ స్థితికి వచ్చేది.ఆ పొలాల్లో పంటలు కూడా మంచిగా పండేవి. కానీ ఎప్పుడైతే మేడిగడ్డ ప్రాజెక్టు కట్టారో అప్పుడు ఇక్కడి పరిస్థితులు మారిపోయాయి. మేడిగడ్డ వద్ద నీటిని స్టోరేజ్ చేయడం మెుదలు పెట్టడంతో బ్యాక్ వాటర్ ఈ ప్రాంతాన్ని ముంచెత్తుతోంది. ప్రాజెక్టులో నీటిని నెలలపాటు నిల్వచేస్తున్నారు. ప్రాజెక్టులో నీళ్లున్నన్నినాళ్లూ ముంపు ప్రాంతంలోని పొలాలు జలసమాధి అవుతున్నాయి. మేడిగడ్డ ఒక్కటే కాదు అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల పరిధిలోని ముంపు ప్రాభావిత ప్రాంతాల రైతులదీ ఇదే తండ్లాట. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టామని గొప్పలు చెప్పుకుంటున్నా తమ జీవితాలను మాత్రం ఆగం చేసిందని వాపోతున్నారు ఇక్కడి రైతులు.

వెంకటేష్ అనే రైతు 4 ఎకరాల పొలానికి ఆసామి. ఈ భుమి అంతటా ఇసుకమేటలేసింది. దీంతో మూడేళ్లుగా పొలాన్ని పడావుపెట్టాడు. ప్రస్తుతం మరొకచోట పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నాడు. పొలాలు ఇసుకదిబ్బల్లా మారిపోయిన రైతులందరి పరిస్థితి ఇదే. ఇంకొందరైతే కూలీపనులు చేసుకుంటూ పొట్ట పోషించుకుంటున్నారు.

ఇసుకబారిన పొలాలు ఎందుకూ పనికిరావట్లేదు. నల్లరేగడి మట్టిలో ఇసుక చేరడంతో క్రమంగా భూమి తన గుణాన్ని కోల్పోంది. ఏమి పండని ఈ పొలాన్ని ఏం చేసుకోవాలో తెలియదు. బ్యాక్ వాటర్ ముంపు ప్రాంత రైతులను ఆదుకోవాల్సిన సర్కారుకు ఆ సోయే లేదు. కనీసం ఎవరైనా అడ్డికి పావుసేరుకైనా అమ్ముకుందామన్నా కొనేదిక్కులేని దుస్థితి. ఉన్నట్టూ కాక లేనట్టూ కానీ ఈ పొలాలను ఏం చేసుకోవాలని ఆవేదన చెందుతున్నారు రైతులు.

ఓపక్క ఇసుక మేటలతో పడావు పడ్డ పంటపొలాలు మరోపక్క రోజురోజుకూ పెరిగిపోతున్న అప్పుల కుప్పలు. వాటిని ఎలాతీర్చాలో పాలుపోని స్థితి. పిల్లల చదువులకే కానాకష్టంగా సాగుతోంది. ఇక పెళ్లిల్లు, ఇతర కార్యక్రమాలైతే ఎలా అన్న ఊహకు కూడా భయపడుతున్నారు రైతులు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ బాధిత రైతాంగాన్ని ఎవరిని కదిలించినా ఇదే బాధ. ఇదే గాథ.

జనతా గ్యారేజ్ టీం పరిశీలనో అనేక విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పొలాలు ఎందుకూ పనికిరాకుండా పోయాయన్నది వాస్తవం. లక్షలాది రూపాయలు ఖర్చుతో వేసుకున్న బోర్లు మునిగిపోయాయి. కరెంటు స్తంభాలు విరిగిపోయాయి. ఎవరి పొలం హద్దు ఎక్కడ ఉందో కూడా తెలుసుకోలేని పరిస్థితి. మరికొన్ని చోట్ల దట్టంగా మెలిచిన దుబ్బగడ్డితో బీడుభూముల్లా మారిపోయాయి. ఇంకోన్ని చోట్ల వరదలు తడి ఆరక.. పొలాలు బురదగుంటలుగా మారాయి.

గోదావరి వరద ఎంత బీభత్సంగా ఉంటుందో దాని తాకిడికి బలైన ప్రాంతాలు ఇప్పటికీ కళ్లకు కడుతున్నాయి. బొబ్బరి చెలుక, దేవులవాడ ప్రాంతాల్లో సగానికిపైగా తారు రోడ్డులు కోట్టుకుపోయాయి. వందలాది ఎకరాల్లో పంటనష్టమైంది. వరద తగ్గగానే రైతులు పంటలు వేయడం.. ప్రాజెక్టుల్లో నీళ్లు నిండగానే బ్యాక్ వాటర్ పోటెత్తడం నిత్యకృత్యమైంది. అలా ఇప్పటికి నాలుగు పంటల పెట్టుబడి నష్టపోయారు రైతులు. దీనికి తోడు దళారుల కూడా రైతులను మోసాలతో నిలువుదోపిడీ చేశారు. ప్రభుత్వం మీ పొలాలను మంచి ధరతో కొనేలా చేయిస్తాం అని.. రైతుల నుంచి ఎకరాకు 50 వేల చొప్పున వసూలు చేసి ఉడాయించారు.

ఐదు సంవత్సరాలుగా గోదావరి పై కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ,అన్నారం ,సుందిళ్ల జలాశయాల బ్యాక్ వాటర్ సమాస్య తలెత్తుతున్నది. మంచిర్యాల ,పెద్దపల్లి ,జయశంకర్ భూపాలపల్లి జిల్లాలలోని 32గ్రామాలకు చెందిన రైతులు సమస్యని ఎదుర్కుంటున్నారు. .ప్రతిఏటా ఈ సమస్య వల్ల వేలాది ఎకరాల పంటలు మునిగి పోయి.. రైతులు ఇక్కట్లు పడుతున్నారు. ఇది తెలిసినా కేసీఆర్ సర్కారుకు చీమకుట్టనట్టైనా లేదు. పేరుకు నేనూ రైతునే అని చెప్పుకునే సీఎం.. 32 గ్రామాల రైతులు అరిగోస అనుభవిస్తున్నా కనీసం పట్టించుకోవడం లేదు. మంచిర్యాల జిల్లా చెన్నురు , కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో దాదాపు 7 గ్రామాలలో, జైపూర్ మండలంలో 3 గ్రామాలు ,జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్ పూర్ మండలంలో 13 గ్రామాలు, కాటారం మండలంలో 5 గ్రామాలు ,పెద్దపల్లి జిల్లా మంధని లో 3 గ్రామాలు..కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో జలదిగ్బంధనం అవుతున్నాయి. పంటలకు తీవ్రనష్టం వాటిల్లుతున్నది. బ్యాక్ వాటర్ ముంపు ప్రభావంపై సరైన అంచనా లేకుండా మేడాగడ్డ, సుందిళ్ల, అన్నారం డ్యాంల నిర్మాణ పనులు చేపట్టారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయినీటిని అంటే ఎఫ్.టీ.యల్ నిల్వచేస్తే ఎంతవరకు ఈ జలాలు విస్తరిస్తాయి. ఇక వరద వచ్చే సమయంలో ఎంతమేరకు ముంపు ఉంటుందన్న కనీస లెక్కలు కూడా తీసుకోలేదంటున్నారు. దీంతో ఈ డ్యామ్ ల ప్రారంభం నుంచి తమ పంట భూములు మునిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఆందోళనలతో ముంపు ప్రాంతంపై రెవిన్యో యంత్రాంగం.. తూతూమంత్రంగా పలుమార్లు సర్వేచేశారు. చేతులు దులుపుకున్నారు తప్ప.. పైసా సాయం చేయలేదు. దీంతో రైతులు కలెక్టరేట్ల ముందు ధర్నాకు దిగారు. ఐతే.. వారికి న్యాయం చేయాల్సిన సర్కారే వారిపై దౌర్జన్యానికి దిగింది. అరెస్టులు చేసింది కానీ.. ఆదుకున్న పాపాన పోలేదు.

గత మూడేండ్లుగా వడగండ్లు, భారీ వర్షాలు, బ్యాక్ వాటర్ కారణంగా రైతులు పంటలు నష్టపోతున్నారు. వారికి వెన్నుదన్నుగా నిలిచే వ్యవస్థే లేదు. పంటభీమా పధకం ఊసేలేదు. కనీసం కేంద్ర ప్రభుత్వ ఫసల్ బీమా యోజనలో కూడా తెలంగాణ సర్కారు చేరలేదు. దీంతో అనుకోని విపత్తులు వస్తే రైతు గతి అధోగతే. ఏటా ఇలాంటి పరిస్థితి రైతులు ఎదుర్కొంటున్నా కేసీఆర్ సర్కారు మాత్రం సోయిలోకి రావడం లేదంటున్నారు వ్యవసాయ నిపుణులు.

ఇక ఊర్లు, పొలాలు మునిగినప్పుడల్లా .. రెవిన్యో అధికారులు వచ్చి వివరాలు సేకరించడం ఆనవాయితీగా మారింది. కాని ఇప్పటికి పరిహారం కింద మాత్రం ఏ రైతుకు రూపాయెత్తు సాయం కూడా అందలేదు. ప్రభుత్వ విధానం వల్ల తాము నష్టపోతున్నామని.. గంగ ముంచిన తమ బతుకులకు భరోసా ఇచ్చేదెవరు ప్రశ్నిస్తున్నారు బాధితరైతులు. తమకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు.

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×