Spirituality: మనిషి తన జీవితంలో ఐదింటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. అవి..
వాక్ శుద్ధి: వేలకోట్ల ప్రాణులను సృష్టించిన ఆ భగవంతుడు కేవలం మనిషికి మాత్రమే మాట్లాడే శక్తినిచ్చాడు. కనుక వాక్కును దుర్వినియోగం చేయకూడదు. పగ, కసి, ద్వేషంతో ఎవరినీ నేరుగా లేదా పరోక్షంగా నిందించరాదు. ప్రేమగా, ఆదరణగా అందరినీ పలకరించాలి. చెడు మాట్లాడేవారికి దూరంగా వెళ్లటం మంచిది.
దేహశుద్ధి: మన శరీరం జీవాత్మ కొలువైన దేవాలయం వంటిదే. కనుక దానిని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు రెండుపూటలా స్నానం చేయాలి. ఉన్నంతలో మంచి బట్ట కట్టుకోవాలి. చిరిగిన, అపరిశుభ్రమైన వస్త్రాలను ధరించరాదు.
భాండ శుద్ధి: శరీరానికి కావలసిన శక్తిని ఇచ్చేది ఆహారం. అందుకే ఆ ఆహారాన్ని వండే, నిల్వచేసే పాత్ర పరిశుభ్రంగా ఉండాలి. స్నానం చేసి, పరిశుభ్రమైన పాత్రల్లో వండిన ఆహారం అమృతతుల్యమైనది.
కర్మశుద్ధి: చేపట్టిన కర్మను ఆచరించటం మనిషి బాధ్యత. ఆ పనిని మధ్యలో ఆపినవాడు అధముడు. అసలు పనినే ప్రారంభించనివాడు అధమాధముడు. తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తిచేసినవాడు ఉన్నతుడు.
మనశ్శుద్ధి: మనస్సును ఎల్లప్పుడూ ధర్మ, న్యాయాల దిశగా నిలపాలి. మనస్సు చంచలమైనది కనుక అది చెడువైపు త్వరగా ఆకర్షితమవుతూ ఉంటుంది. దీంతో మనిషి కష్టాల పాలవుతుంటాడు. కనుక ఎవ్వరికీ హాని చేయని మనస్తత్వం కలిగివుండటమే మనఃశుద్ధి.