Sambhaji Bhide news(Telugu news headlines today): హిందువులు ఎంతోగానో ఆరాధించే సాయిబాబాపై మహారాష్ట్రకు చెందిన శంభాజీ భిడే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సాయిబాబా దేవుడు కాదని, హిందువులెవరూ ఆయన గుడికి వెళ్లకూడదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు సాయిబాబా హిందూ దేవుడు కాదని అన్నారు. హిందువులు సాయిబాబాను పూజిస్తారని, కానీ ఆయన నిజంగా అందుకు అర్హుడేనా అని పరిశీలించాలని సూచించారు. అక్కడితో ఆగలేదు శంభాజీ.. హిందువులు ముందుగా సాయిబాబా ఫొటోలు, విగ్రహాలను ఇళ్లలో నుంచి తొలగించాలన్నారు. తాను పిచ్చి పిచ్చిగా మాట్లాడటం లేదని.. ఈ విషయం చెప్పడం తన బాధ్యత అన్నారు శంభాజీ భిడే.
మూడు రోజుల కిందట కూడా ఆయన మహాత్మా ఫూలే, మహాత్మాగాంధీ, పండిట్ నెహ్రూపై కూడా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మహాత్మాగాంధీ ఓ ముస్లిం భూస్వామి కొడుకు అన్నారు. దీనికి సంబంధించిన చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయని అన్నారు. శంభాజీ వ్యాఖ్యలతో మహా పాలిటిక్స్ హీటెక్కాయి. అధికార, విపక్ష నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శంభాజీపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ వివాదం ఇంకా చల్లారకముందే భిడే మరోసారి సాయిబాబాపై సంచలన ప్రకటన చేశారు.
శంభాజీ భిడే శ్రీ శివ్ ప్రతిష్టాన్ హిందూస్థాన్ సంస్థ నేత. ఆయనపై ఇప్పటికే మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. శంభాజీ భిడే ఇప్పుడే కాదు తన పనులతో గతంలో కూడా వార్తల్లో నిలిచారు. 2022లో నుదుట బొట్టు లేదని ఓ జర్నలిస్ట్‌తో మాట్లాడేందుకు నిరాకరించారు. సెక్రటేరియట్‌కు వెళ్లి సీఎం ఏక్‌నాథ్ షిండేను కలిసి వస్తుండగా ఆయనను ఓ జర్నలిస్ట్ పలకరించే యత్నం చేశారు. అయితే ఆమె నుదుటపై బొట్టు లేని విషయం గమనించిన ఆయన మాట్లాడను అని తెగేసి చెప్పాడు. అంతేకాదు 2018లో.. తన తోటలోని మామిడి పండ్లను తిన్న దంపతులకు మగపిల్లలు పుడతారంటూ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదస్పదమయ్యాయి.