Tamilisai Soundararajan latest news(Telugu news headlines today): తెలంగాణ సర్కార్ పై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి పరోక్ష విమర్శలు చేశారు. హుస్సేన్ సాగర్ పరిశుభ్రతపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. హుస్సేన్ సాగర్ తెలంగాణకు ఓ గిఫ్ట్ అన్న గవర్నర్..సాగర్ ను శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. హుస్సేన్ సాగర్ ను ప్రభుత్వం శుభ్రపరచాలని సూచించారు. హుస్సేన్ సాగర్ ప్రకృతి ఇచ్చిన వరమని.. ఇప్పుడు చెత్తా చెదారంతో నిండిపోయి, కంపుకొడుతుందని చెప్పారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు చేపట్టి.. హుస్సేన్ సాగర్ ను శుద్ధి చేయాలని గవర్నర్ తమిళిసై సూచించారు. సెయిలింగ్ వీక్ ముగింపు వేడుకల్లో కేసీఆర్ సర్కార్ పై ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
అయితే హుస్సేన్ సాగర్ పరిశుభ్రత పై ఇప్పుడు గవర్నర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై సర్కారు ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది. ఏకంగా గవర్నరే హుస్సేన్ సాగర్ పరిశుభ్రత పై అసహనం వ్యక్తం చేయడం..సాగర్ చెత్తా చెదారంతో నిండిపోయి కంపుకొడుతుందనడం అధికార పార్టీకి మింగుడుపడటం లేదు. తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళిసై మధ్య ఎప్పటినుంచో వివాదం నెలకొంది. గతంలోను పలు ప్రభుత్వ కార్యాక్రమాలపై బాహాటంగానే విమర్శలు గుప్పించారు గవర్నర్. తాజాగా మరోసారి హుస్సేన్ సాగర్ పై ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ అంశంగా
మారిపోయాయని చెప్పడంలో సందేహం లేదు.
ఇది ఇలా ఉండగా ప్రత్యేక తెలంగాణ తర్వాత ఏర్పడ్డాక కేసీఆర్ సర్కార్ హుస్సాన్ సాగర్ పై ప్రత్యేక దృష్టి సారించింది. హుస్సేన్‌సాగర్‌ను శుద్ధి చేస్తామని.. దాన్ని మంచి నీటి చెరువుగా మారుస్తామని కేసీఆర్ 2014లోనే హామీ ఇచ్చారు. సాగర్ జలాల శుద్ధి కోసం గత కొన్నేళ్లలోనే వందల కోట్లు ఖర్చుపెట్టారు. కానీ ఫలితం లేకపోయింది. మురుగు నీరు, పారిశ్రామిక వ్యర్థాలను హుస్సేన్ సాగర్‌లోకి తీసుకొచ్చే నాళాలను మళ్లించే ప్రయత్నంలో తెలంగాణ సర్కారు విజయం సాధించలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. హుస్సేన్ సాగర్‌లోకి వచ్చే వ్యర్థాలు, మురికి నీటిలో 75 శాతం వాటా కూకట్‌పల్లి నాలాదే. ఇందులో నుంచి వచ్చే మురుగు నీటిలో 30-40 శాతం శుద్ధి చేయకుండానే హుస్సేన్ సాగర్‌లో కలుస్తోంది.
హుస్సేన్ సాగర్ పరిరక్షణ, కాలుష్యం లాంటి అంశాల గురించి అధ్యయనం కోసం 2021లో ఎన్‌జీటీఓ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. బంజారా, యూసఫ్‌గూడ, బల్కాపూర్ నాలాల నుంచి మురుగు నీరు వచ్చి చేరుతోందని కమిటీ గుర్తించింది. పికెట్ నాలాలో శుద్ధి చేసిన మురుగు నీటితోపాటు శుద్ధి చేయని వ్యర్థాలు సైతం కలుస్తున్నాయని తెలిపింది. బల్కాపూర్ నాలా మురుగు నీటి శుద్ధి కేంద్రం పని చేయడం లేదని కమిటీ గుర్తించింది.సాగర్ నీటిని శుద్ధి చేసేందుకు ఆరు నెలలపాటు బయోరెమిడియేషన్ చేపట్టారు. కానీ నాలాల నుంచి మురుగునీరు వచ్చి కలుస్తుండటంతో.. అది ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వకపోవచ్చని కమిటీ రిపోర్ట్‌లో తెలిపింది.