CM KCR: ఏ ముహూర్తాన కొత్త సచివాలయంలో అడుగుపెట్టారో కానీ.. అప్పటి నుంచీ అన్నీ మంచి విషయాలే వినిపిస్తున్నాయి. కీలక ఫైల్స్ మీద సంతకాలు చేస్తున్నారు సీఎం కేసీఆర్. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. పోడుభూముల పంపిణీ నుంచి పారిశుద్ద కార్మికుల జీతాల పెంపు వరకు.. చాలానే గుడ్‌న్యూస్‌లు చెప్పారు. లేటెస్ట్‌గా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో మరో కొత్త పథకానికి నిర్ణయం తీసుకున్నారు.
రైతు బీమా. రైతు బంధులానే ప్రతిష్టాత్మక పథకం. అన్నదాత అకస్మాత్తుగా చనిపోతే.. ఆ కుటుంబానికి వెంటనే 5 లక్షల పరిహారం అందివ్వడం. చనిపోయిన రైతు కుంటుంబానికి ఎంతో దన్నుగా నిలుస్తోందీ పథకం. సేమ్ టు సేమ్ ఇలాంటి పథకమే.. గౌడన్నలకు కూడా అమలు చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. రైతు బీమా తరహాలోనే.. కల్లుగీత కార్మికులకు ‘గీత కార్మికుల బీమా’ పథకాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.
కల్లుగీస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన గీత కార్మికుల కుటుంబాలకు 5 లక్షల బీమా సాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. విధివిధానాలపై కొత్త సచివాలయంలో గీత కార్మికుల బీమా పథకంపై మంత్రులు, అధికారులతో చర్చించారు సీఎం కేసీఆర్. వారం రోజుల్లోనే బీమా సొమ్ము అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.