Property Registration : జీవితంలో ఇల్లు కొనుక్కోవడం అనేది అతిపెద్ద టాస్క్. అబ్బో దాని కోసం ఎన్ని ఎంక్వైరీలు చేస్తామో. ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే ఎన్ని విషయాలు ఆరా తీస్తామో. అచ్చం అలాగే ఇల్లు కొనేటప్పుడు కూడా చేస్తారు. భూమి విషయంలోనూ ఇంచుమించు ఇంతే. ఎవరిదో, ఏంటో కనుక్కుని, వాటిపై లీగల్ సమస్యలు లేవని కన్ఫార్మ్ చేసుకుని అప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం. రిజిస్ట్రేషన్ అయ్యాక ఓ పెద్ద భారం దిగిపోయినట్టే. చాలా మంది అంతటితోనే ఆపేస్తారు. కాని, ఇల్లు లేదా భూమి మన పేరు మీదకి రావాలంటే రిజిస్ట్రేషన్ చాలదు. అక్కడితో ఆ ప్రాసెస్ అయిపోదు. ఆ తరువాత జరగాల్సిన ప్రాసెస్ మ్యుటేషన్. ఈ మ్యుటేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మ్యుటేషన్ చేయిస్తేనే.. రెవెన్యూ రికార్డులలో అమ్మిన వారి పేరు తొలగించి కొన్న వారి పేరు మీదకు ఆస్తి బదిలీ అవుతుంది.
ఫలానా ఆస్తి మీ పేరు మీద ఉంది అని చెప్పడానికి ఆధారం మ్యుటేషన్. ప్రాపర్టీని ఎవరి పేరు మీదైనా రాయాలనుకున్నా, బహుమతిగా ఇవ్వాలనుకున్నా, ఆ ఆస్తిని పంచాలనుకున్నా సరే మ్యుటేషన్ అవసరం. మీరు కొన్న ఇల్లు లేదా భూమిని ఏదైనా అవసరానికి అమ్ముకోవాలనుకున్నా కూడా మ్యుటేషన్ డాక్యుమెంట్స్ ఉండాల్సిందే. మీ ఇంటికి కరెంట్ కనెక్షన్, వాటర్ కనెక్షన్ సమయంలోనూ చూపించాల్సి ఉంటుంది. గ్రామాల్లో పంచాయతీ రికార్డుల్లో, నగరాల్లో అయితే మున్సిపాలిటీల్లో, జీహెచ్‌ఎంసీలోని రికార్డుల్లో తన పేరుపై నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆస్తికి తామే నిజమైన వారసులమని తెలియజేయడమే మ్యుటేషన్ ముఖ్య ఉద్దేశం. అందుకే, రిజిస్ట్రేషన్ అయిన తరువాత కచ్చితంగా మ్యుటేషన్ చేయాలి.
తహసీల్దార్ ఆఫీసులలో మ్యుటేషన్ చేస్తారు. లేదంటే సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులు, మున్సిపల్ ఆఫీసులలో భూమి లేదా ఇల్లు మ్యుటేషన్ చేస్తారు. ప్రాంతాన్ని బట్టి ఈ ఆఫీసులలోనే దరఖాస్తు చేసుకోవాలి. మ్యుటేషన్ కోసం ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆస్తి విలువలో 0.1 శాతం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకున్న తరువాత.. 15 నుంచి 30 రోజులలో మ్యుటేషన్ సర్టిఫికేట్ వస్తుంది.