Gold Buyer : బంగారం బంగారమే. దాని విలువ తగ్గదు. మరేదానికి అంత విలువ ఉండదు. సాక్షాత్తు రిజర్వ్ బ్యాంకులే వీలైనప్పుడల్లా బంగారం కొని పెట్టుకుంటాయి. అనుకోని పరిస్థితుల్లో ఆదుకునేది బంగారం మాత్రమే. వ్యక్తులకే కాదు.. దేశానికి కూడా బంగారమే రక్ష. అందుకే, ధర తగ్గినప్పుడో, డాలర్ ఇండెక్స్ పడిపోయినప్పుడో ఇలా బంగారం కొంటుంటాయి. గత మూడేళ్లుగా.. అంటే కరోనా వచ్చి ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసినప్పటి నుంచి ఇండియా బంగారం కూడబెట్టుకుంటోంది. మొన్న ఫిబ్రవరి నెలలో మూడు టన్నుల బంగారం కొనుగోలు చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
ప్రస్తుతం ఆర్‌బీఐ వద్ద 790 టన్నుల బంగారం ఉంది. 2020 మార్చి నుంచి 2023 మార్చి వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 137.19 టన్నుల బంగారం కొనేసింది. దీంతో ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వల్లో ఇండియా ఎనిమిదో స్థానానికి చేరింది. ప్రస్తుతం ఇండియా వద్ద ఉన్న మొత్తం బంగారం విలువ 3 లక్షల 75 వేల కోట్ల రూపాయలు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఈ విషయం చెప్పింది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ పతనం కావడంతో.. ఇతర కరెన్సీలు ఉన్న వారికి బంగారం చాలా చౌకగా దొరికింది. సరిగ్గా అలాంటి సమయంలోనే బంగారం కొనిపెట్టుకుంది ఇండియా. డాలర్ మీద రూపాయి మారకం విలువ పతనం కావడంతో దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఏడు శాతం పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్ బంగారం ధర 2000 డాలర్ల స్థాయికి చేరి ఆల్ టైం హై రికార్డును తాకింది.
ఇండియా అనే కాదు.. ప్రపంచ దేశాలు సైతం బంగారాన్ని రికార్డ్ స్థాయిలో కొనుగోలు చేశాయి. 1967 తర్వాత పలు దేశాల రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు పెరగడం ఇదే హైయెస్ట్. తాజాగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇదే విషయం చెప్పింది. 2022లో వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు.. 1136 టన్నుల బంగారం కొనుగోలు చేశాయి. వీటి విలువ 5 లక్ష 73 వేల కోట్లు ఉంటుందని డబ్ల్యూటీసీ తెలిపింది.