Amla :- మన పెద్దలు పెట్టిన ఆచారాలు, పద్దతులు వెనుక ఎన్నో కారణాలుంటాయి. ఈ రోజుల్లో వాటిని మూఢనమ్మకం అని తేలిగ్గా తీసి పారేస్తుంటారు. వాటి వెనుక ఉన్న అర్ధాలను, పరమార్ధాలను చెప్పేవారు లేకపోవడానికి తోడు వినే ఒపిక కూడా నేటి జనానికి లేదు. మన పెద్దోళ్లు ఆదివారం రోజు ఉసిరికాయ పచ్చడిని తినవద్దని చెబుతుంటారు. రాత్రి సమయంలో అయితే అసలు ఉసిరి కాయ పదం కూడా పలకడం తప్పని వారిస్తుంటారు. ప్రత్యేకించి రాత్రి పూట ఉసిరికాయ మాట అనవద్దు అనడానికి ఓ కారణం ఉంది. రాత్రి సమయాల్లో ఉసిరిచెట్లపై పాములు సంచరిస్తాయి. ఆ సమయంలో ఉసిరికాయలను గురించి మాట్లాడుకుంటే, వాటిని పిలిచినట్టు అవుతుందనే నమ్మకం పూర్వకాలం నుంచి ఉంది. అందుకే పెద్దలు ఉసిరికాయ ప్రస్తావన రాత్రి పూట తీసుకురావద్దని చెబుతుంటారు..
వాస్తవానికి ఉసిరి ప్రకృతి ప్రసాదించిన వరం. ఉసిరి తింటే కలిగే పులుపు ఒంటికి ఎంతో మంచిది. శరీరానికి సీ విటమన్ ఇచ్చే ఉసిరి కాయ తిన్నాక నీళ్లు తాగితే ఆ నీళ్ల తియ్యగా అనిపిస్తాయి. ఆయుర్వేద వైద్యంలో ఉసిరికి ప్రాధాన్యం ఉంది. ఉసిరికాయలో ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి. అనారోగ్యం బారిన పడకుండా కాపాడటంలో ఉసిరికాయ ప్రముఖమైన పాత్రను పోషిస్తూ వుంటుంది. ఉసిరికాయ పచ్చడి రుచిని చూసిన వారు మరిచిపోలేరు. కొందరికి పాత ఉసిరికాయ పచ్చడి అంటే పడి చచ్చిపోతారు, అంత ఇష్టపడుతుంటారు. ప్రతీ రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు ఉసిరి రసం తాగితే షుగర్ పేషంట్లకు చాలా మంచిది.
రాత్రి సమయంలో ఉసిరిని తినకూడదు అని చెప్పడానికి కారణం ఉంది. శరీర ఉష్ణోగ్రత రాత్రి పూటతో పోల్చితే పగలు ఎక్కువగా ఉంటుంది. శరీరం టెంపరేచర్ తక్కువ ఉన్న సమయంలో తినడం వల్ల అనారోగ్యం కలుగుతుంది. గ్రహాల పరంగా ఉసిరి రవికి – శుక్రుడికి శత్రుత్వం ఉంది. ఉసిరికాయలోని యాసిడ్ గుణం శుక్రుడికి చెందిది. అందుకే రవికి ఇష్టమైన ఆదివారం రోజున ఉసిరికాయ తినకూడదని చెబుతుంటారు.