EPAPER
Kirrak Couples Episode 1

Mann Ki Baat: మన్ కీ బాత్‌లో మన గురించి.. తెలుగువాళ్లు ఫుల్ ఫిదా..

Mann Ki Baat: మన్ కీ బాత్‌లో మన గురించి.. తెలుగువాళ్లు ఫుల్ ఫిదా..
mann ki baat telugu

Mann Ki Baat: మన్ కీ బాత్ అంటే సాదా సీదా ప్రోగ్రామ్ గా మిగిలిపోలేదు. ప్రధాని నోట తమ మాట వచ్చిందనుకున్న ప్రతీ ఒక్కరి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తన ప్రసంగంలో ప్రతి ప్రాంతాన్ని టచ్ చేశారు. అందులో సందర్భానుసారం మన తెలుగు రాష్ట్రాలు, తెలుగు ప్రముఖులు, పలు సంస్థల గురించి కూడా ప్రస్తావించారు. అన్ని ప్రాంతాల ప్రజలను ఈ కార్యక్రమంలో మమేకం చేసేలా చూసుకున్నారు మోదీ.


మన్ ​కీ బాత్ ​కార్యక్రమంలో భాగంగా ఎందరో తెలుగువారిని గుర్తించి నరేంద్ర మోదీ తన స్పీచ్ తో ప్రపంచానికి పరిచయం చేశారు. సిరిసిల్ల నేత, మేడారం జాతర, కాకతీయ కళావైభవం… ఒక్కటేమిటి అన్ని విషయాలనూ మోదీ ప్రస్తావించారు. 2015 జూన్ 28న తొలిసారి కర్నూలు జిల్లాలోని బెలుం గుహల అందాల గురించి చెప్పారు. 2015 అక్టోబర్‌ 25 స్వచ్చ భారత్ పై రామోజీరావు చేస్తున్న కృషిని ప్రస్తావించారు మోదీ. తెలంగాణ, ఏపీలో అమలవుతున్న జల సంరక్షణ విధానాలను 2016లో ప్రస్తావించారు.

తెలంగాణాలోని తిమ్మాయిపల్లి గ్రామ ప్రజలు వర్షాకాలంలో ప్రతి నీటిబొట్టును వృథా కానివ్వకుండా వాటిని కాలువలుగా మళ్లించి నీటికుంటలను నిర్మించారు. తిమ్మాయిపల్లి గ్రామ ప్రజల దృఢ సంకల్పాన్ని 2019 జూన్ 30న ప్రసారమైన ఎపిసోడ్ లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. బోయినపల్లి కూరగాయల మార్కెట్ లో 10 టన్నుల వ్యర్థాలతో కరెంట్ ను ఉత్పత్తి చేసే ప్రయత్నాన్ని మోదీ ప్రశంసించారు. వ్యర్థాల నుంచి సంపద సృష్టించే యాత్రగా ఆయన అభివర్ణించారు. ల్యాబ్ టు ల్యాండ్ పేరుతో తెలంగాణకు చెందిన చింతల వెంకట రెడ్డి వ్యవసాయ రంగంలో చేస్తున్న కృషిని మన్ కీ బాత్ లో గుర్తు చేసిన సందర్భం ఉంది.


హైదరాబాద్‌కు చెందిన రైతు చింతల వెంకట్‌రెడ్డి గురించి ప్రధాని మోదీ తన మన్‌కీబాత్‌ ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన కష్టపడి విటమిన్‌-డితో కూడిన గోధుమ, బియ్యం రకాలను పండించినట్లు చెప్పారు. ఇక 2021 డిసెంబర్‌ 26న తెలంగాణకు చెందిన 84 ఏళ్ల డాక్టర్‌ కురెల విఠాలాచార్య గురించి ప్రస్తావించారు. లెక్చరర్‌గా పనిచేసి పదవీవిరమణ పొందిన అనంతరం ఆయన తన సొంత పుస్తకాలతో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడంతోపాటు, తాను సంపాదించిందంతా అందుకోసమే ధారపోసినట్లు ప్రశంసించారు. యాదాద్రి జిల్లా రామన్నపేట డివిజన్‌లో ఉన్న ఈ గ్రంథాలయంలో 2 లక్షల పుస్తకాలున్నట్లు తెలిపారు. విఠలాచార్య నుంచి స్ఫూర్తి పొందిన ఎంతోమంది తమ గ్రామాల్లోనూ అలాంటివి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని ఉదహరించారు.

2022 మార్చి 27న ప్రసారమైన మన్ కీ బాత్ ఎపిసోడ్ లో ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో పండే బంగినపల్లి, సువర్ణరేఖ రకం మామిడిపండ్ల గురించి ప్రస్తావించారు. ఇక్కడినుంచి దక్షిణ కొరియాకు ఎగుమతి అవుతున్నట్లు తెలిపారు. అదే ఎపిసోడ్ లో సికింద్రాబాద్‌లోని బన్సిలాల్‌పేట మెట్ల బావిని ప్రజా భాగస్వామ్యంతో పునరుద్ధరించిన విషయం గురించి మాట్లాడారు.

2022 మే 29న ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురానికి చెందిన రాంభూపాల్‌రెడ్డి అనే వ్యక్తి పదవీవిరమణ చేసిన తర్వాత వచ్చిన డబ్బంతా ఆడపిల్లల చదువుకోసం ధారపోసిన విషయాన్ని మోదీ మన్ కీ బాత్ లో ప్రస్తావించారు. సుకన్య సమృద్ధి యోజన కింద 100 మంది ఆడపిల్లలకు ఖాతాలు తెరిపించి అందులో 25లక్షలు డిపాజిట్‌ చేసిన విషయాన్ని చెప్పారు. అటు 2022 జూన్‌ 26 ఎపిసోడ్ లో తెలంగాణకు చెందిన పర్వతారోహకురాలు పూర్ణా మలావత్‌ గొప్పతనం గురించి మోదీ చెప్పారు. 7 సమ్మిట్‌ ఛాలెంజ్‌లు పూర్తిచేయడం ద్వారా ప్రపంచంలో ఏడు క్లిష్టమైన పర్వతాలను అధిరోహించి దేశం గర్వపడేలా చేశారన్నారు.

2022 జులై 31న మన్ కీ బాత్ ఎపిసోడ్ లో తెలంగాణలోని కోయ గిరిజనులు మేడారంలో జరుపుకొనే అతిపెద్ద పండుగ సమక్క, సారలమ్మ జాతర గురించి ప్రధాని ప్రస్తావించారు. తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిపొందిందని, గిరిజన మహిళానాయికలు సమక్క, సారలమ్మ గౌరవార్థం ఆ జాతర జరుపుతారని చెప్పారు. ఇది కేవలం తెలంగాణలోనే కాకుండా ఛత్తీస్‌గడ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ల్లోని గిరిజనులకూ పెద్ద పండుగ అంటూ మన్ కీ బాత్ లో జాతర గురించి ప్రస్తావించారు.

ఇక సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ గురించి 2022 నవంబర్‌ 27 నాటి మన్ కీ బాత్ లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. జీ 20 సమావేశాలపై దేశ ప్రజలు ఎంత ఆసక్తిగా ఉన్నారోనన్న విషయం తనకు అర్థమైందన్నారు. సిరిసిల్ల జిల్లాకు చెందిన హరిప్రసాద్‌ చేత్తోనేసిన జీ-20 లోగోను ప్రధాని మోదీకి బహుమతిగా పంపారు. ఈ విషయాన్ని మోదీ స్వయంగా మన్ కీ బాత్ లో వెల్లడించారు. ఆ బహుమతిని చూసి ఆశ్చర్యపోయానన్నారు. తన చేనేత కళతో అందర్నీ ఆకట్టుకున్నారని, జీ-20 సమ్మిట్ పై ఎంత అవగాహనతో ఉన్నారోనన్న విషయం తెలిసిందంటున్నారు.

2023 ఫిబ్రవరి 26న ప్రసారమైన ఎపిసోడ్ లో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన విజయదుర్గ అనే మహిళ ఉయ్యాలవాడ నరసింహారెడ్డిపై రాసిన కవితను చదివి వినిపించారు. ఈ ఎపిసోడ్ లోనే తెలంగాణకు చెందిన రాజ్‌కుమార్‌ నాయక్‌ తెలంగాణలోని 31 జిల్లాల్లో 101 రోజులపాటు నిర్వహించిన పేరిణి నాట్యం గురించి చెప్పారు. కాకతీయ రాజుల కాలంలో ఖ్యాతి పొందిన పేరిణీ నృత్యం ఇప్పటికీ తెలంగాణ మూలాలతో ముడిపడి ఉందన్నారు ప్రధాని. ఇలా సందర్భం వచ్చిన ప్రతిసారి తెలుగు ప్రముఖులు, సంస్థలు చేసిన సేవలను మన్ కీ బాత్ లో ప్రస్తావిస్తూనే ఉన్నారు మోదీ.

ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంపై దేశ విదేశీ ప్రముఖులు ప్రశంసించారు. ఈ కార్యక్రమం వందో ఎపిసోడ్ సందర్భంగా మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకులు బిల్ గేట్స్ అభినందనలు తెలిపారు. పారిశుధ్యం, ఆరోగ్యం, మహిళల ఆర్థిక సాధికారత, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలతో ముడిపడి ఉన్న ఇతర సమస్యలపై ఈ కార్యక్రమం ఎంతగానో ప్రభావం చూపిందన్నారు గేట్స్.

మన్‌ కీ బాత్‌ థీమ్‌ ఆధారంగా దేశంలో ప్రసిద్ధి పొందిన 12 మంది చిత్రకారులు వేసిన పెయింటింగ్స్, ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ను కూడా ఢిల్లీలో ప్రారంభిస్తారు. ఈ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌లో నీటి పొదుపు, నారీశక్తి, కరోనాపై అవగాహన, స్వచ్ఛ భారత్, వాతావరణ మార్పు, రైతాంగం–వ్యవసాయం, యోగా – ఆయుర్వేదం, సైన్స్‌–ఖగోళ శాస్త్రం, స్పోర్ట్స్–ఫిట్‌నెస్, భారత్‌ ఎట్‌ 75 అమృత్‌ కాల్, ఈశాన్య రాష్ట్రాలు అనే 12 రకాల థీమ్స్‌ ఉంటాయి. దీంతో పాటు 12 అమర్‌చిత్ర కథ కామిక్స్‌లో మొదటి కామిక్‌ను మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ సందర్భంగా రిలీజ్ చేయనున్నారు.

ఇప్పటివరకు జరిగిన 99 మన్ కీబాత్ ఎపిసోడ్ లలో ఎందరో స్వాతంత్ర్యోద్యమ వీరుల త్యాగాలను మోదీ స్మరించారు. ఎందరో సైంటిస్టులను, సాహితీవేత్తలను, క్రీడాకారులను, కళాకారులతోపాటు, సామాన్యుల అసామాన్య కృషిని జాతికి పరిచయం చేశారు. సమాజంలో తెరమరుగున ఉన్న ప్రతిభావంతుల గొప్పతనాన్ని ప్రధాని తన మన్ కీ బాత్ ద్వారా వెలుగులోకి తెచ్చారు.

Related News

JANASENA vs TDP: ఆ ఎన్నికతో పిఠాపురంలో సీన్ రివర్స్ అయిందా.. జనసేన వర్సెస్ టీడీపీ.. ఏం జరుగుతోంది?

AP Elections: ఏపీలో ఎన్నికలు.. అప్పుడే అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ..

TTD Ex Chairman: చంద్రబాబుపై శివాలెత్తిన భూమన.. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఫైర్

Nagababu Comments: ఆ ఒక్క మాటతో జగన్, ప్రకాష్ రాజ్‌ల పరువు తీసేసిన నాగబాబు.. అందుకే పవన్ అలా స్పందించారట!

Tirumala: దసరాకు తిరుమల వెళ్తున్నారా.. దర్శనం టికెట్ లేకున్నా.. ఇలా చేస్తే శ్రీవారిని దర్శించవచ్చు

Janasena: సీఎం సీటుపై పవన్ ఫోకస్.. ప్లాన్-బి అమలు చేసే పనిలో జనసేనాని?

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

Big Stories

×