Revanth Reddy: వేలకోట్ల ఆదాయం వచ్చే ఔటర్ రింగ్ రోడ్డును కేసీఆర్ ఓ ప్రైవేట్ సంస్థకు తాకట్టు పెట్టారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 30వేల కోట్ల ఆదాయం వచ్చే ఔటర్ ను 7వేల380 కోట్లకు తాకట్టు పెట్టడం వెనక పెద్ద కుంభకోణం ఉందన్నారు. దాదాపుగా వెయ్యి కోట్లు చేతులు మారాయన్నారు రేవంత్‌రెడ్డి.
భాగ్యనగరానికి మణిహరంలా ఉన్న ఔటర్ రింగ్ రోడ్డును రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అమ్మకానికి పెట్టిందన్నారు పీసీసీ చీఫ్. ఈ కుంభకోణం వెనక సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్, మంత్రి కేటీఆర్ ఉన్నారని ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎట్టిపరిస్థితుల్లో ఆమోదించదని రేవంత్ తేల్చిచెప్పారు. అధికారంలోకి వచ్చాక దీనిపై సమగ్ర విచారణకు ఆదేశిస్తామన్నారు. యాజమాన్యం కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఓఆర్ఆర్‌ను తాకట్టు పెట్టడంపై బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదని రేవంత్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల ఆస్తులను కేసీఆర్ అమ్ముతుంటే బండి సంజయ్, కిషన్ రెడ్డిలు ఎందుకు స్పందించడంలేదని నిలదీశారు.