share market : స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి పెద్ద కంపెనీ షేర్లు కొనుక్కోండని సలహా ఇస్తుంటారు. లార్జ్ క్యాప్ షేర్స్ అయితే కాస్త తక్కువ నష్టాలు చవిచూస్తాయని. అందులో వాస్తవం ఉంది కూడా. కాని, కాలం కలిసి రాకపోతే.. అంబానీ అయినా, అదానీ షేర్లు అయినా పడిపోవాల్సిందే. అప్పుడిక పెద్ద షేర్లా, చిన్న షేర్లా అనే దాంతో సంబంధం ఉండదు. లార్జ్ క్యాప్ షేర్లు పడినా… తొందరగా రికవరీ అవుతాయని చెబుతుంటారు. ఒక్కోసారి ఈ ఫార్ములా కూడా వర్కౌట్ కాకపోవచ్చు. ఏడాది దాటినా.. రికవరీ ఉండకపోవచ్చు. అందుకే, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టండి.. మూడేళ్ల పాటు వెయిట్ చేయండి అని సలహా ఇచ్చేది. ముఖ్యంగా సిస్టమేటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. లార్జ్ క్యాప్ షేర్లు పడినా, చివరికి మంచి లాభాలు పొందొచ్చు.
ఇక అసలు విషయానికొస్తే… ఇండియన్ స్టాక్ మార్కెట్లో లార్జ్ క్యాప్ షేర్లుగా చెప్పుకునే 11 కంపెనీలు ఇన్వెస్టర్లకు 14 లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని ఇచ్చాయి. ఇందులో రిలయన్స్ షేర్లు కూడా ఉన్నాయి. రిలయన్స్ ఇన్వెస్టర్లకూ లక్షన్నర కోట్ల రూపాయల లాస్ వచ్చింది. రిలయన్స్ షేరు గత ఏడాది కాలంలో 14 శాతం పడిపోయింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ లక్షా 40వేల కోట్లు తగ్గింది.
ప్రస్తుతం ఐటీ షేర్ల సంగతి చెప్పక్కర్లేదు. అమెరికా, యూరప్‌లో రెసిషన్ కారణంగా ఆర్డర్లు తగ్గాయి. ఈ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన వారికి కూడా ఏడాది కాలంగా అస్సలు కలిసిరాలేదు. వీటిలో ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో కంపెనీలకు కూడా మినహాయింపు లేదు. ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ లక్షా 60 వేల కోట్లు, టీసీఎస్ మార్కెట్ లక్షా 40వేల కోట్లు, విప్రో మార్కెట్ క్యాప్ 94 వేల కోట్లు తగ్గింది. గత ఏడాది కాలంలో ఈ ఐటీ కంపెనీల షేర్లు 12 నుంచి 31 శాతం వరకు పడ్డాయి.
అదానీ గ్రూప్ షేర్లైతే ఇన్వెస్టర్లకు చుక్కలు చూపించాయి. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలతో ఈ గ్రూప్ షేర్లు 60 శాతం వరకు క్రాష్ అయ్యాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ 3 లక్షల కోట్లు, అదానీ టోటల్ గ్యాస్ లక్షా 70వేల కోట్లు, అదానీ ట్రాన్స్‌మిషన్ లక్షా 80వేల కోట్లు, నష్టపోయాయి.
ఇక బజాజ్ ఫైనాన్స్ షేర్ 19 శాతం నష్టపోవడంతో మార్కెట్ క్యాప్ 81 వేల కోట్లు తగ్గింది. వేదాంత షేర్ 34 శాతం నష్టపోయి ఇన్వెస్టర్లకు 53వేల 700 కోట్ల నష్టాన్ని తెచ్చింది. కాకపోతే.. పరిస్థితులు బాగుండి మార్కెట్లు రివైవ్ అయితే… ఫస్ట్ పెరిగే షేర్లు ఇవే. అందుకే, ఎప్పటికైనా లార్జ్ క్యాప్ షేర్లు మంచివి అంటుంటారు.