JC Prabhakar Reddy : టీడీపీ నేత , తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రూటే సెపరేటు. ఆయన ఏం చేసినా సంచలనమే. ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో ఆయన శైలే వేరు. నిరసన తెలపడంలోనూ అదే తీరు. ఇప్పుడు ప్రభుత్వంపై వినూత్నంగా పోరాటం చేస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి రాత్రంతా రోడ్డు డివైడర్ పైనే నిద్రించారు. మంగళవారం ఉదయం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఆరుబయటే స్నానం చేశారు. మళ్లీ నిరసన శిబిరంలో కూర్చుని ఆందోళన కొనసాగిస్తున్నారు.
పెద్దపప్పూరు వద్ద పెన్నా నదిలో ఇసుక రీచ్ ల్లో జరుగుతున్న అక్రమ తవ్వకాలపై అధికారులు, పోలీసుల తీరును నిరసిస్తూ సోమవారం ఉదయం నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన చేస్తున్నారు. టీడీపీ కౌన్సిలర్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. సోమవారం ఉదయం నిరసన తెలిపేందుకు బయటకు వచ్చిన జేసీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇంటి బయటే ఆందోళనకు దిగారు. అక్కడే కుర్చీ వేసుకుని కూర్చున్నారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు బలవంతంగా గృహనిర్బంధం చేశారు. పోలీసులు, ప్రభుత్వం తీరుపై జేసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అడ్డగోలు అక్రమాలు జరుగుతున్నా పట్టించుకోని పోలీసులు….ఎందుకిలా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. ఆ తర్వాత తన ఆందోళనలు కొనసాగించారు. రాత్రి రోడ్డుపైకి వచ్చి డివైడర్ పై పడుకుని నిరసన వ్యక్తం చేశారు.