IPL : ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. 145 పరుగుల లక్ష్యాన్ని కూడా హైదరాబాద్ జట్టు చేధించలేకపోయింది. 7 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. మనీశ్ పాండే , అక్షర్ పటేల్ చెరో 34 పరుగులతో రాణించారు. మిచెల్ మార్ష్ (25), డేవిడ్ వార్నర్ (21) కాస్త ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో ఢిల్లీ భారీ స్కోర్ చేయలేకపోయింది.
హైదరాబాద్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ 2 రెండు వికెట్లు, నటరాజన్ ఒక వికెట్ తీశారు. ఢిల్లీ జట్టులో ముగ్గురు బ్యాటర్లు రనౌట్ అయ్యారు.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు వేగంగా పరుగులు చేయలేకపోయింది. ఓపెనర్ హ్యారీ బ్రూక్ ( 7) మరోసారి విఫలమయ్యాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (49) రాణించాడు. హెన్రిచ్ క్లాసెన్ (31), వాషింగ్టన్ సుందర్ (24 నాటౌట్) జట్టును గెలిపించేందుకు ప్రయత్నించారు. చివరి ఓవర్ లో విజయానికి 13 పరుగులు అవసరం కాగా..హైదరాబాద్ జట్టు 5 పరుగులు మాత్రమే చేసింది. ఆ ఓవర్ ను ఢిల్లీ బౌలర్ ముకేశ్ కుమార్ అద్భుతంగా వేశాడు. దీంతో 20 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ జట్టు 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేసింది.
ఢిల్లీ బౌలర్లలో నోకియా ,అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఇషాంత్ శర్మ, కులదీప్ యాదవ్ తలో వికెట్ తీశారు. ఆల్ రౌండర్ ప్రదర్శనతో ఢిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించిన అక్షర్ పటేల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.