Sharmila: అనుకున్నదొక్కటి అయినది ఇంకోటి. సిట్ కార్యాలయం ముట్టడిద్దామనుకున్నారు షర్మిల. కానీ, ఆమెను ఇంటి నుంచి బయటకే రానివ్వలేదు పోలీసులు. తననే అడ్డుకుంటారా అంటూ ఖాకీలపై శివాలెత్తారు షర్మిల. ఓ ఎస్సైని తోసేశారు. ఇద్దరు కానిస్టేబుల్స్‌ను కొట్టారు. పోలీసులపైకి కారును నడిపించారు. కట్ చేస్తే.. షర్మిల అరెస్ట్. 14 రోజుల రిమాండ్.
పోలీసులపై దాడి కేసులో వైఎస్ షర్మిలకు 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. మే 8 వరకు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంచాలని.. చంచల్‌గూడ జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది. షర్మిల జైలు కెళ్లడం ఆ పార్టీ శ్రేణులకు షాకింగ్ పరిణామం.
అంతకుముందు, ఉదయం నుంచి హైడ్రామా నడిచింది. కొత్త సచివాలయం ముట్టడి చేపడతారనే అనుమానంతో షర్మిలను హౌజ్ అరెస్ట్ చేసేందుకు ఆమె ఇంటికి వచ్చారు పోలీసులు. ఆమెను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో, తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన షర్మిల.. పోలీసులతో తీవ్ర వాగ్వాదం, గొడవ, దాడికి దిగారు. షర్మిలను అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పీఎస్‌కు తరలించారు.
షర్మిలను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆమె తల్లి విజయమ్మ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. పీఎస్‌లోకి అనుమతించకపోవడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఓ మహిళా కానిస్టేబుల్‌పై విజయమ్మ కూడా చేయిచేసుకున్నారు. నిరుద్యోగుల కోసం షర్మిల పోరాడుతోందని.. ఆమెను ఎందుకు అరెస్ట్ చేశారని నిలదీశారు. పోలీసులు విజయమ్మను బలవంతంగా కారులో ఎక్కించి అక్కడి నుంచి వెనక్కి పంపారు. భర్త అనిల్‌ను మాత్రం షర్మిలను కలిసేందుకు అనుమతించారు.
ఇక, షర్మిల పోలీసులను కొట్టడాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఆమెపై ఐపీసీ 353, 332, 503, 427 సెక్షన్ల కింద కేసు పెట్టి అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. పోలీసులు, షర్మిల తరఫు న్యాయవాదుల వాదనలు విన్న న్యాయస్థానం.. ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. చంచల్‌గూడ జైలుకు తరలించాలని ఆదేశించింది. షర్మిల లాయర్లు వెంటనే బెయిల్ పిటిషన్ వేయగా.. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది కోర్టు. దీంతో, షర్మిల జైలుకు వెళ్లక తప్పలేదు.