Nellore: సమస్యలకు చెక్ పెడుతూ నిర్ణయాలు తీసుకుంటారని భావించిన నెల్లూరు కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం కాస్తా రసాభాసకు వేదికైంది. సీఎం ఫోటో విషయంలో చెలరేగిన డైలాగ్ వార్ కాస్తా కార్పొరేటర్లు పోడియం దగ్గర ఆందోళన చేపట్టి నినాదాలు చేసేంత వరకూ వెళ్లింది. స్రవంతి మేయర్‌గా పదవిలో కొనసాగేందుకు వీల్లేదంటూ వైసీపీ కార్పొరేటర్లు చేసిన నినాదాలతో సీన్ మారిపోయింది. అజెండా పేపర్లు చించేసేదాకా వెళ్లింది.
79 అంశాలపై అజెండా రెడీ చేశారు. పెండింగ్ అంశాలపై క్లారిటీ వస్తుందనుకున్నారు. సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనుకున్నారు. సీన్ కట్ చేస్తే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో కార్పొరేటర్ల తోపులాట, మేయర్ కు వ్యతిరేకంగా నినాదాలు, అజెండా పేపర్ల చించివేత ఇష్యూతో కౌన్సిల్ సమావేశం కాస్తా రచ్చరచ్చగా మారిపోయింది.
నెల్లూరు నగరపాలక సంస్థలో 54 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వీళ్లంతా అధికార వైఎస్ఆర్ సీపీకి చెందిన వారే. అయినా సరే ఈ గొడవ మొదలవడానికి కారణం చిన్నదే. కానీ స్వపక్షంలో విపక్షం మాదిరి గ్రూప్ వార్ పెద్దది. సింహపురి వైసీపీలో మారిన రాజకీయ సమీకరణాలతో నెల్లూరు కార్పొరేటర్లు గ్రూపులుగా విడిపోయారు. అందుకే ఫైటింగ్.
ఇవాళ్టి సర్వసభ్య సమావేశానికి ముందు 79 అంశాలపై అజెండా పేపర్లను కార్పొరేటర్లకు అందించారు. ప్రశాంతంగా మొదలైన సమావేశాలు ఒక్కసారిగా హైటెన్షన్ గా మారిపోయాయి. కౌన్సిల్ హాల్‌లో సీఎం ఫొటో విషయంలో మేయర్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణంగా మారాయి. అసలు ఈ ఫోటోను ఎవరు ఏర్పాటు చేశారని అనడంపై వైసీపీ కార్పొరేటర్లు భగ్గుమన్నారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మేయర్ తీరును తప్పుబడుతూ కార్పొరేటర్లు నేలపై కూర్చొని నిరసనకు దిగారు. అజెండా పేపర్లు చించేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నట్లుగా మేయర్ స్రవంతి చెప్పుకొచ్చారు. అయితే తనపై జరిగిన దాడిపై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు మేయర్ స్రవంతి.
తనపై రాజకీయ కుట్రతోనే వైసీపీకి చెందిన కొందరు కార్పొరేటర్లు సమావేశంలో గందరగోళం సృష్టించారన్నది మేయర్ వెర్షన్. కొందరు కార్పొరేటర్లు దురుసుగా వ్యవహరించారని అంటున్నారు. సీఎం ఫోటో గురించి తాను ఏమీ మాట్లాడలేదని చెబుతున్నారు. సీన్ కట్ చేస్తే కౌన్సిల్ లో ఈ ఆందోళన జరగడానికి తెరవెనుక చాలా కారణాలు ఉన్నాయంటున్నారు. నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి ఇటీవలే వైసీపీ నుంచి సస్పెండ్ అయిన MLA కోటంరెడ్డి వర్గంలో ఉన్నారు. దీంతో మేయర్ స్రవంతిని.. ఆదాల, అనిల్ వర్గం కార్పొరేటర్లు లక్ష్యంగా చేసుకున్నారు. కౌన్సిల్ సమావేశాలు జరిగినప్పుడల్లా ఈ తరహా ఆందోళనలు పెరుగుతున్నాయి. మొత్తంగా నెల్లూరు మున్సిపల్ కౌన్సిల్ లో కార్పొరేటర్లు గ్రూపులుగా విడిపోవడంతో సమస్యలపై చర్చించే స్కోప్ లేకుండా పోతోందన్న ఆవేదన వ్యక్తం అవుతోంది.