Liquor: మందుబాబుల మైండ్ సెట్ వెరైటీగా ఉంటుంది. పుల్లుగా తాగాక.. వెర్రివేషాలు వేస్తుంది. అప్పటి వరకూ గప్‌చుప్‌గా తాగుతారు. నిషా నషాలానికి అంటాక.. బయటకు వస్తారు. తమ హీరోయిజాన్ని అంతా చూడాలని కోరుకుంటారు. క్రేజ్ కోసమో, న్యూసెన్స్ చేయాలనో.. ఓపెన్‌గా బాటిల్ ఎత్తి తాగుతుంటారు. అయితే, బహిరంగ మద్యపాన సేవనంపై నిషేధం ఉంది. పోలీసులు చూస్తే కేసు తప్పనిసరి. అందుకే, వైన్స్, బార్స్, ఇంట్లో తప్ప ఎక్కడ పడితే అక్కడ మందు తాగరు. తాగనివ్వరు. కానీ….
ఇకపై రూల్స్ మారిపోతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించేందుకు అనుమతులిస్తూ తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్లే గ్రౌండ్స్, కన్వెన్షన్ సెంటర్స్, ఫంక్షన్ హాల్స్, మీటింగ్ హాల్స్, బాంక్వెట్ హాల్స్.. ఇలా ఎక్కడైనా మద్యం సేవించ వచ్చంటూ ఉత్తర్వులు సవరించింది. అయితే, కండిషన్స్ అప్లై.
ఇష్టం వచ్చిన చోట మందు తాగాలంటే.. ముందు పర్మిషన్ తీసుకోవాలి. ప్రభుత్వానికి డబ్బులు కట్టాలి. ఇదీ సంగతి. ఆ కాసులకు కక్కుర్తిపడి.. స్టాలిన్ సర్కార్ ఇలా మద్యానికి గేట్లు ఎత్తేసిందంటూ విమర్శలు వస్తున్నాయి. ఆఖరికి ఇంట్లో మందు పార్టీలు చేసుకోవాలన్నా.. ఫీజు కట్టాల్సిందే. అంతర్జాతీయ సదస్సులు, నేషనల్ ఈవెంట్లు, కార్యక్రమాలు, సమావేశాలు, వేడుకలు, పండుగలు.. ఇలా ఏ కార్యక్రమాల్లోనైనా మద్యం అందించాలంటే లైసెన్స్ తప్పనిసరి. వామ్మో.. స్టాలిన్ మామూలోడు కాదంటున్నారు మందుబాబులు.
లైసెన్స్ కోసం కేటగిరీల వైజ్ రుసుం విధించింది సర్కారు. మున్సిపల్ కార్పొరేషన్‌లో రూ.లక్ష, మున్సిపాలిటీల్లో రూ.75,000, ఇతర ప్రాంతాల్లో రూ.50,000 వరకు వార్షిక ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ వన్డే పార్టీ లేదా ఈవెంట్ అయితే.. ఒక రోజుకు మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాల్లో రూ.11,000, మున్సిపాలిటీల్లో రూ.7,500, ఇతర చోట్ల రూ.5,000 ఫీజు చెల్లించాలంటూ కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చింది తమిళనాడు ప్రభుత్వం. ఇప్పుడీ నిర్ణయం వివాదాస్పదమవుతోంది. స్టాలిన్ నిర్ణయంపై విపక్షాలు ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి. మందుబాబుల నుంచి మిక్స్డ్ ఒపీనియన్ వస్తోంది.