Scientists:- ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విధమైన అలవాటు ఉంటుంది. కొందరికి పొద్దునే లేచి వ్యాయామం చేయడం నచ్చితే.. కొందరికి ఎక్కువసేపు పడుకోవడం నచ్చుతుంది, కొందరికి వెజ్ ఆహారం అలవాటు అయితే.. మరికొందరికి నాన్ వెజ్ అంటే ఇష్టం ఉంటుంది. ఇలా ఏ ఇద్దరి అలవాట్లు ఒకేలాగా ఉండవు. అయితే ఈ అలవాట్లు గురించి ఇటీవల పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.
మామూలుగా జిమ్‌కు వెళ్లే అలవాటు ఉన్నవారు మొదట్లో త్వరగా లేవడం, జిమ్‌కు వెళ్లడం కష్టంగా భావించే ఉంటారు. మెల్లగా జిమ్‌కు వెళ్లడం, వ్యాయామం చేయడం అలవాటు అయిపోయి ఉంటుంది. అయితే ఇది అలవాటు అవ్వడానికి ఎంత సమయం పడుతుందో మామూలుగా అంచనా వేసి చూశారా..? జిమ్‌కు వెళ్లడం అలవాటుగా మారడానికి కనీసం ఆరు నెలలు పడుతుందని శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో తేలింది. అలాగే చేతులు ఊరికే కడుక్కుంటూ ఉండడం అలవాటు అవ్వడానికి అయితే కొన్ని వారాలు పడుతుందని తేల్చారు. ఇలా ఒక్కొక్క అలవాటుకు ఒక్కొక్క సమయం పడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
ఈ అలవాటు అవ్వడానికి ఇన్ని రోజులు సమయం పడుతుంది అని ప్రత్యేకంగా సమయం అంటూ ఏమీ ఉండదని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. మామూలుగా ఏదైనా విషయం అలవాటు అవ్వడానికి కనీసం 21 రోజులు సమయం పడుతుంది అనే మాటను వినే ఉంటాం. కానీ సైన్స్ పరంగా దీనికి ఉదాహరణ అంటూ ఏమీ లేదని వారు తెలిపారు. వారు చేసిన పరిశోధనల ప్రకారం ఒక్కొక్క అలవాటుకు ఒక్కొక్క విధంగా సమయం పడుతుందని తేలిందన్నారు.
అలవాట్ల గురించి స్టడీ చేయడం కోసం శాస్త్రవేత్తలు మొదటిసారి మెషీన్ లెర్నింగ్ ప్రక్రియను ఉపయోగించారు. ఈ పరిశోధన కోసం నాలుగేళ్లుగా జిమ్‌కు వెళ్లున్న దాదాపు 3 లక్షల మందిని ఎంపిక చేశారు. వారితో పాటు దాదాపు 3000 మంది మెడికల్ స్టాఫ్‌ను కూడా సెలక్ట్ చేసుకున్నారు. వీరందరిపై స్టడీ చేయడానికి శాస్త్రవేత్తలు మెషీన్ లెర్నింగ్ ప్రక్రియనే ఉపయోగించారని తెలుస్తోంది. ఇప్పటివరకు మనుషుల అలవాట్లపై చేసిన పరిశోధనల్లో ఇది మెరుగైన రిజల్ట్స్‌ను అందించిందని శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.